ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ
శర్వా‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రివ్యూ
శర్వానంద్ కు ఖచ్చితంగా హిట్ కావాల్సిన టైమ్ ఇది. పడిపడి లేచే మనసు, శ్రీకారం, మహాసముద్రం ఇలా భారీ హైప్ తో వచ్చిన సినిమాలు భారీగానే మునిగిపోయాయి. దాంతో ఈసారి మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నా.. నాకు ఆస్కార్ వద్దు కానీ.. సినిమా ఆడితే చాలు అంటూ శర్వానంద్ చేతులు పట్టుకుని చెప్పినంత పనిచేసాడు. దానికి తోడు జానర్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ మన ముందుకు వచ్చాడు శర్వానంద్. మరి.. ఈసారైనా శర్వానంద్ ప్రేక్షకులను ఒప్పించాడా? ట్రైలర్ లో హామీ ఇచ్చినట్లు నవ్వించాడా? అసలు ఈ సినిమా ఎలా ఉంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ ఎందుకు పెట్టారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Storyline:
బాబుకు పెళ్లి కావాలి..ఇదే కాన్సెప్టు. చిరు (శర్వానంద్)కు ఇంటినిండా ఆడమందే. తల్లి (రాధిక)తో పాటు, పిన్నిలు నలుగురు (ఊర్వశి, కల్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, సత్య కృష్ణన్) అతన్ని చిన్నప్పటి నుంచి గారంగా పెంచుకుంటూ వస్తారు. వాళ్లకో కళ్యాణమండపం ఉంటుంది. ఇక తమ ముద్దుల కొడుకు చిరుకు పెళ్లి వయస్సు వచ్చిందని ఓ సుముహార్తన గమనించి తమ ఇంటికి కోడల్ని తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతారు. అంతవరకూ బాగానే ఉంది కానీ …వాళ్ల ఆలోచనలకు, కోరికలకు ,రిక్వైర్మెంట్ కు తగ్గ అమ్మాయి ఒక్కత్తీ సెట్ కాదు. ప్రతీ వాళ్లకు వంకలు పెట్టడంతో ప్రతీ సంభందం వెనక్కి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో …అతనికి ఆద్య (రష్మిక) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతాడు చిరు. అయితే ఆద్య తల్లి వకుళ (ఖుష్బూ) ఓ డిఫరెంట్ క్యారక్టర్ . ఆమెకు అసలు తన కూతురుకి పెళ్లి చేయటమే ఇష్టం ఉండదు. ఆద్యనేమో తల్లి మాట జవదాటే మనిషి కాదు. ఈ సిట్యువేషన్ లో చిరు ఏం చేశాడు ? చివరికి వీరి కథ ఏమైయింది ? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
Screenplay Analysis:
ప్రారంభంలో హీరో తల్లి,పినతల్లిల మధ్య పెరగటం,వారి మాటే వేద వాక్కుగా భావించి పెళ్లిళ్లు చెడిపోతున్నా చూస్తూండటం దాకా కొత్తగా అనిపించింది. ఎప్పుడైతే హీరోయిన్ తల్లి ఖుష్బూ పెళ్లి చేయను నా కూతురుకి అంటూ ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే కథ కాకతీయుల కాలం నాటికి, స్క్రీన్ ప్లే శ్రీకృష్ణ దేవరాయుల కాలానికి వెళ్లిపోయింది. ఏ సీన్ చూసినా ఎక్కడో ఇంతకు ముందు చూసినట్లు అనిపిస్తుంది. అందుకు కారణం …కథ ఎనభైల నాటి సినిమాలను గుర్తు చేయటమే. అప్పట్లో వచ్చిన రాజేంద్రప్రసాద్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉండేవి. వాటిని అప్పుడు ఎంజయ్ చేసాము. ఇప్పుడు మారిన జనరేషన్ కు కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. దానికి తోడు టీవి సీరియల్ లాగ వరస పెట్టి ఆడవాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పట్టుచీరలు కట్టుకుని మరీ డైలాగులు చెప్తూంటారు. టైటిల్ ని జస్టిఫై చేయాలన్నట్లు మగాళ్లను ప్రక్కన పెట్టి ఆడవాళ్లకే మొత్తం సీన్స్ ఇచ్చారు. ఫస్టాప్ దాదాపు హీరో పెళ్లి చూపులు, ఫెయిల్యూర్…అందులో నుంచి వచ్చే ఫన్ ఫస్ట్రేషన్ . హీరోయిన్ పాత్ర పరిచయం బావుంది కానీ ఆ ట్రాక్ పరమ రొటీన్ . అయితే ఇంటర్వెల్ కు ముందే వచ్చే ఎపిసోడ్ కాస్త కిక్ ఎక్కిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తల్లి పాత్ర …ఆమెనుంచి పుట్టే కాంప్లిక్ట్ తో సినిమా బోర్ కొట్టేసింది. ఉన్నంతలో డైలాగులే సినిమాని కాపాడాయి కానీ స్క్రిప్టు మాత్రం కాదు. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలకు క్లైమాక్స్ లో బలమైన కాంప్లిక్ట్స్, కంక్లూజనా్ తో ముగియాలి. కానీ దర్శకుడు లైట్ తీసుకున్నాడు. అలాంటి ఎమోషన్స్ కి చోటివ్వకుండా రొటీన్ గా కథని ముగించేసాడు.
Analysis of its technical content
దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో పుష్ప స్దాయిలో లేవు కానీ ఈ ఫ్యామిలీ డ్రామాకు సరిపోయేలా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ నీట్ గా వుంది. ప్రొడక్షన్ గట్టిగా ఖర్చు పెట్టారు. బాగా రిచ్ గా ఉంది ఫిల్మ్. దర్శకుడు తిరుమల కిషోర్ స్క్రిప్టులో డైలాగులకు ఇచ్చిన ప్రయారిటీ సీన్స్ కు, స్క్రీన్ ప్లేకి ఇవ్వలేదు. ఇంటర్వెల్ వరకూ బాగా లాగాడు కానీ సెకండ్ హాఫ్ లో సోసోగా సరిపెట్టేసాడు.
నటీనటుల్లో … చిరు పాత్ర కూడా శర్వా తన రెగ్యులర్ స్టైల్ లో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రష్మిక బాగా నటించింది అనేకన్నా అందంగా ఉంది అనాలి. రాధిక, ఖుష్బూ,ఊర్వశి, ఝాన్సీ .. మంచి క్యారక్టర్స్ పడ్డాయి. వాళ్ళ ఎక్సపీరియన్స్ బాగా కలిసొచ్చింది. వెన్నెల కిషోర్, సత్య ఫన్ బాగానే వర్కవుట్ అయ్యింది.
CONCLUSION:
ట్రైలర్ చూసి టెమ్ట్ అయ్యి ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడాలి.
Movie Cast & Crew
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బూ, రాధిక, ఊర్వశి, రాజశ్రీ నాయర్, సత్యకృష్ణన్, కల్యాణి నటరాజన్, ఝాన్సీ, రజిత, ప్రదీప్ రావత్, సత్య, వెన్నెలకిశోర్ తదితరులు
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
రచన- దర్శకత్వం: కిశోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రన్ టైమ్ : 2h 21m
విడుదల: మార్చి 4, 2022