ఎఫ్2 మూవీ రివ్యూ
అంతేగా..అంతేగా (ఎఫ్2 రివ్యూ)
Rating: 3/5
క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడే సందడి, పెళ్లాం ఊరెళితే ఇవన్నీ ఒక్కో సీజన్ లో వచ్చిన బ్యాక్ బస్టర్ కామెడీ సినిమాలు. వీటిని అనుకరిస్తూ ఆ తర్వాత సినిమాలు వచ్చినా ఆ స్దాయిలో పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఈ మూడు కామెడీ సినిల్లోనూ ఓ సిమిలారిటీ ఉంది. పెళ్లాలకు…మొగుళ్ల మధ్య వచ్చే కీచులాటలు, ఫ్రస్టేషన్. ఆ సక్సెస్ ఫుల్ స్టోరీలైన్ నే తీసుకుని దర్శకుడు అనీల్ రావిపూడి మరో హిట్ తీద్దాం అని ఎఫ్ 2 ని ప్లాన్ చేసి మనకందించారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటి.. వెంకటేష్ కు ఏమన్నా ప్లస్ అవుతుందా..వరుణ్ తేజ లాంటి యంగ్ హీరో చేయదగ్గ కథేనా, ఫ్యామిలీలతో చూడదగ్గ కామెడీయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కధ ఇదే
వెంకీ చేసుకున్న హారిక (తమన్నా) తన తల్లితో కలిసి డామినేట్ చేయటానికి ప్రయత్నం చేస్తూంటుంది. దాంతో భార్యా భాధితుడుగా మారిన వెంకీ ఆ ప్రస్టేషన్ ని రకరకాలుగా వ్యక్తం చేస్తూంటారు. ఈ క్రమంలో అతనికి ఓ విషయం తెలుస్తుంది. తన మరదుల హనీ (మెహరీన్) ని ప్రేమించిన వరణ్ యాదవ్ (వరుణ్ తేజ) తనలాగే అదే ఇంటికి అల్లుడుగా రాబోతున్నాడని. దాంతో ముందస్తు హెచ్చరిక చేస్తాడు. కానీ ప్రేమ వరణ్ ని విననివ్వదు. ఇవన్నీ లైట్ అంటూ పెళ్లి చేసేసుకుంటాడు. ఆ తర్వాత వెంకీ అన్నా..నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటూ బావురుమంటారు. ఇలా ఈ ప్రస్టేషన్ తో తోడల్లుళ్లు (వెంకీ- వరుణ్) ఇద్దరూ ఉంటే ప్రక్కింటి రాజేంద్రప్రసాద్ వీళ్లకు ఓ ఐడియా ఇస్తాడు. మీరు దూరం అయితే కానీ మీ విలువ మీ భార్యలకు తెలిసి రాదు..అంటాడు. దాంతో వీళ్లిద్దరు కలిసి యూరప్ వెళ్లిపోతారు. అక్కడ ఎంజాయ్ చేస్తూండగా…హఠాత్తుగా ఆ అక్కా చెళ్లిలిద్దరూ అక్కడే ప్రత్యక్ష్యమవుతారు. అంతేకాకుండా వాళ్లు మళ్లీ పెళ్లికి రెడీ అవుతారు. అప్పుడు వెంకీ, వరుణ్ లు ఏం చేసారు. వాళ్ల భార్యలు ఎందుకు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చివరకు ఏమైంది.. ఈ కథలో ప్రకాష్ రాజ్, నాజర్ ల పాత్రలేమిటి అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.
విశ్లేషణ
జనం రిలీఫ్ ని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. అందుకే కామెడీ సినిమాలు ఎప్పుడూ ఎవర్ గ్రీనే. అయితే కామెడీ తీయటం, చేయటం రెండూ కష్టమే. ఎందుకంటే ఏ మాత్రం బాలెన్స్ తప్పినా భరించటం కష్టమైపోతుంది. దానికి తోడు ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ ని పట్టుకుని కామెడీ చేయగలగాలి. వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ పెరగటానికి కారణం కామెడీ సినిమాలంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన కూడా గత కొంత కాలంగా కామెడీలు చేయటం లేదు. ఆయనతో కామెడీ లు చేసే దర్శకులు వేరే జానర్స్ కు వెళ్లిపోయారు..రిటైర్ అయ్యిపోయారు.
కొత్త జనరేషన్ డైరక్టర్స్…యంగ్ స్టార్స్ తో కామెడీ చేయాలనుకుంటున్నారు తప్ప సీనియర్స్ తో ధైర్యం చేయటం లేదు. కానీ అనీల్ రావిపూడి..అటు వరుణ్ తేజని, ఇటు వెంకీని ముటి పెట్టి…కామెడీని ప్లాన్ చేసాడు. ఆ ఆలోచనకే అనీల్ కు మంచి మార్కులు వేయవచ్చు. ఇక వెంకటేష్ తన కామెడీ టైమిగ్ కు వదలలేదు కాబట్టి సినిమాకు ప్లస్ అయ్యింది. వరుణ్ తేజకుఆ వియంలో కాస్త తక్కువ మార్కులే పడతాయి. అయితే సిట్యువేషన్ కామెడీతో సినిమాని ట్రాక్ లో పెట్టాడు దర్శకుడు.
ఇక ఫస్టాఫ్ కామెడీ సిట్యువేషన్ తో పరుగులు పెట్టించిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి పట్టాలు తప్పాడు. కానీ క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకున్నాడు. దాంతో సినిమా రేంజి తగ్గింది. అలాగని సెకండాఫ్ లో ఫన్ లేదని కాదు ..ఎపిసోడిక్ గా ఉంది. కథలో కలవలేకపోయింది. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్ వంటివారు కూడా మోయాల్సి వచ్చింది.
హైలెట్స్
వెంకటేష్ ని మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లి చూడవచ్చు..నవ్వుకోవచ్చు…అదే ఈ సినిమా మనకు అందించే మొదటి లాభం. ఇక వరుణ్ తేజ సైతం స్లాఫ్ స్టిక్ కామెడీని బాగానే ట్రై చేసాడు. కొన్ని చోట్ల మిస్ ఫైర్ అయినా అదీ బాగానే వర్కవుట్ అయ్యింది. అయితే అతనికి పెట్టిన తెలంగామా స్లాంగ్ మాత్రం బాగోలేదు. కె.ఆర్ విజయ, అన్నపూర్ణ వంటి సీనియర్ నటీమణులు, మెహరీన్ సిల్లీ ఎక్సప్రెషన్స్ బాగున్నాయి. సినిమాలో కుక్క ఎపిసోడ్ సైతం బాగా పండింది. అంతేగా..అంతేగా అనే మ్యానరిజం ఇప్పటికే బాగా జనాల్లోకి వెళ్లిపోవటంతో ధియోటర్స్ లో అలా అనగానే దద్దరిల్లుతోంది. మైనస్ లు…
కధే అతి పురాతనం.స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా సాదాసీదాగా ఉంది. ఇప్పుడు తెలుగులో మారుతున్న ధోరణిలను ఈ సినిమా పట్టించుకున్నట్లు లేదు. కేవలం నడివయస్సు వాళ్లకు మాత్రమే ఈ సినిమా అన్నట్లుంది. వరణ్ తేజ వంటి యంగ్ హీరోని పెట్టుకుని కూడా ఈ కాలం కుర్రాళ్ళకు తగిన సీన్స్ డిజైన్ చేయలేదు. దాంతో యూత్ కు ఈ సినిమా దూరం అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాలో కాంప్లిక్స్ పాయింట్ కూడా పెద్దగా రైజ్ చేయలేదు. అలా కామెడీ సీన్స్ పేర్చుకుంటూ వెళ్లిపోయారు.
టెక్నికల్ గా ..
దేవిశ్రీప్రసాద్ మొహమాటానికి ఈ సినిమా ఒప్పుకున్నారో ఏమో కానీ ఆయన స్దాయిలో సంగీతం కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అందించలేదు. డైలాగులు సిట్యువేషన్ తగ్గట్లు పంచ్ లతో బాగా పండాయి. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి కొత్తగా మాట్లాడేది ఏముంది. కెమెరా డిపార్టెంట్ వాళ్లు యూరప్ లో విజృంభించేసారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా చేయాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఓ పాట లేపేయచ్చు. డైరక్టర్ గా అనీల్ రావిపూడి ఎక్కడా అతికి పోలేదు. వెంకటేష్ పొటెన్షియల్ ఏమిటో గమనించుకుని దాన్ని ఎలివేట్ చేసుకుంటూ పోయాడు. అయితే కథలో కొన్ని లాజిక్స్ కూడా పెట్టుకుని,సెకండాఫ్ స్క్రిప్టుని మెరుగ్గా చూసుకుని ఉంటే బాగుండేది.
చివరి మాట
పండగకు ఫ్యామిలీలతో వెళ్లి నవ్వుకునేందుకు సరిపడ్డ సినిమా. అంతేగా..అంతేగా..
తెర వెనక..తెర ముందు
నటీనటులు: వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్: బిక్కిని తమ్మిరాజు
నిర్మాత: దిల్‌రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడి
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 12-01-2019