ఒరేయ్ బామ్మ‌ర్ది మూవీ రివ్యూ

Published On: August 14, 2021   |   Posted By:

 ఒరేయ్ బామ్మ‌ర్ది మూవీ రివ్యూ 

Rating:2/5

ఓటీటిల్లో డబ్బింగ్ సినిమాలు వరసపెట్టి చూసిన వాళ్లు ఇప్పుడు థియోటర్ లో కూడా అవే డబ్బింగ్ లు చూడాల్సి వస్తోంది.  సిద్ధార్థ్ రెండేళ్లక్రితం తమిళంలో ‘సివ‌ప్పు మంజ‌ల్ ప‌చ్చై’ అనే సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయ్యి థియోటర్ లోకి దిగింది.  ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చిత్ర టీమ్ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఈ రోజు (ఆగస్ట్‌ 13న) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామని చెప్తున్నారు. అయితే అందులో అంత విషయం ఉందా.తెలుగువాళ్లకు ఎక్కే సినమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

మ‌దన్‌(జీవీ ప్రకాశ్‌కుమార్‌) కు బైక్ రేసులంటే పిచ్చి. ఆ పిచ్చి తోనే ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా రోడ్డుపై వెళ్లటంతో  సిన్సియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్…రాజ్‌(సిద్దార్థ్‌) కి దొరికిపోతాడు. రాజ్ పోనీలే కుర్రాడు అని వార్నింగ్ ఇచ్చి వదిలేసే రకం కాదు. అతనికి ఆడ‌వాళ్ల నైటీ వేసి అంద‌రి ముందు అవ‌మానించి… అరెస్ట్ చేసి ఓరోజంతా జైల్లో వేస్తాడు. దాంతో ఎవరికైనా మండుతుంది. యధావిధిగా కుర్రోడైన మదన్ …రాజ్ పై పగ పెంచేసుకుంటాడు. అవకాసం దొరికితే అంతకు అంత తీర్చుకోవాలని వెయిట్ చేస్తూంటాడు. అయితే ఊహించని విధంగా అదే రాజ్ తన బావ రూపంలో తన అక్క రాజీ (లిజోమోల్ జోస్‌) తో ప్రేమలో పడి తన జీవితంలోకి ప్రవేశిస్తాడు. పగ రెట్టింపు అవుతుంది. కానీ చూస్తే అక్క మొగడాయే. అయితే ఈ లోగా ఇంతో సమస్య మదన్ ని వెంటాడుతుంది. ఓ కేసులో మదన్ ఇరుక్కుంటాడు.  ఆ కేసునుంచి బయిటపడేయాలంటే బావ సాయం తప్పనసరి. మరి బావ సాయం తీసుకుని మదన్ బయిటపడ్డాడా..అసలు తనను బావ అని పిలవని బామ్మర్దికి రాజ్ సాయం చేసాడా వంటి విషయాలు తెలియాలంటే  సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ సినిమాని పనిగట్టుకుని థియోటర్ లో విడుదల చేయక్కర్లేదనిపిస్తుంది. ఎందుకంటే తమిళంలోనూ ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయం ఏమీ సాధించలేదు. అలాగే సిద్దార్దకు ఇక్కడ మార్కెట్ లేదు. జివీ ప్రకాష్ ని గుర్తు పట్టేవాళ్లు లేరు. పోనీ ఇవన్నీ  ప్రక్కను పెట్టి డైరక్టర్ ‘బిచ్చ‌గాడు’ వంటి సూపర్ హిట్ తీసిన వాడు కదా అని రాజీ పడదామనుకుంటే సినిమా ఆ స్దాయిలో ఉండదు. స్క్రీన్ ప్లే బోరింగ్ గా సాగుతుంది. సిద్దార్ద పాత్రను సమస్యలో పడేసి జీవి ప్రకాష్ క్యారక్టర్ వచ్చి రక్షిస్తే బాగుండేది. అప్పుడు రేసుగుర్రం లా కథ పరుగెత్తేది. అక్కడ అన్నదమ్ములు..ఇక్కడ బావ,బావమరుదులుగా ఉండేవారు. కమర్షియల్ సక్సెస్ ఫార్ములా అది. ఫార్ములాని బ్రేక్ చేయాలనుకోవటం మంచిదే కానీ మరి వ్యతిరేక ఫలితాలు వచ్చేలా చేయకూడదు కదా. అలాగే ఈ సినిమాలో జీవి ప్రకాష్ పాత్రకు అసలు పాటలు,హీరోయిన్ అనవసరం అనిపిస్తుంది. ఆ విధంగా స్క్రీన్ ప్లే రాసారు. అతన్ని హీరోగా అనుకుంటే ఇంకో రకంగా ఉండేది. సిద్దార్ద డౌన్ అవుతాడని అతన్ని ప్రక్కన పెట్టారు. అప్పటికీ ఇంట్రవెల్,ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ సీన్ తేలిపోయింది.

దర్శకత్వం,మిగతా విభాగాలు

సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి. అలాగే కెమెరా వర్క్, రీరికార్డింగ్ కూడా ప్లస్ అయ్యాయి. తెలుగు డబ్బింగ్ డైలాగులు సోసోగా ఉన్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సిందే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఖర్చుపెట్టారనిపించారనిపించింది. డబ్బింగ్ కూడా బాగా చేయించారు.

నటీనటుల్లో… సిద్ధార్థ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి. అతని అనుభవంతో… సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఆవేశపరుడైన కుర్రాడిగా జీవీ ప్రకాష్ బాగా చేసారు. సిద్ధార్థ్-జీవీ ప్రకాష్ ల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. తమ్ముడిని అమితంగా ప్రేమించే అక్క పాత్రలో లిజోమోల్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసారు.  
   
తెర వెనక..ముందు

నిర్మాణ సంస్థ‌:  శ్రీల‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్
 నటీన‌టులు: సిద్ధార్థ్‌, జీవీ ప్ర‌కాష్‌, లిజోమ‌ల్  జోస్‌, క‌శ్మీర‌, మ‌ధుసూధ‌న‌న్‌, దీప రామానుజ‌మ్‌, ప్రేమ్ త‌దిత‌రులు
నిర్మాత‌: ఎ.ఎన్‌.బాలాజీ
 సంగీతం: సిద్ధు కుమార్
ఛాయాగ్ర‌హ‌ణం: ప్ర‌స‌న్న ఎస్‌.కుమార్‌
ద‌ర్శ‌కుడు: శ‌శి
రన్ టైమ్: 2 గంటల 20 నిముషాలు
విడుద‌ల తేదీ: 13-08-2021