ఓ పిట్టకథ మూవీ రివ్యూ

Published On: March 7, 2020   |   Posted By:

ఓ పిట్టకథ మూవీ రివ్యూ

సస్పెన్స్ తో సరదా  (‘ఓ పిట్టక‌థ‌’ రివ్యూ)
Rating:2.5/5

మళయాళంలో థ్రిల్లర్స్ వస్తూంటాయి. ముఖ్యంగా నేటివిటినీ అద్దుకుని, లోకల్ గ్రామీణ నేఫధ్యం తీసుకుని ఆ థ్రిల్లర్స్ తక్కువ బడ్జెట్ లో రూపొందుతూంటాయి. అక్కడ ప్రేక్షకులు వాటిని బాగానే ఆదరిస్తూంటారు కూడా. అయితే మనకు తెలుగులో థ్రిల్లర్ అంటే అర్బన్ లోనే జరగాలి, సైకోలు, మర్డర్స్ వరస పెట్టి జరిగిపోతూండాలి. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ తెగ తిరుగుతూ బిల్డప్ ఇస్తూండాలి. మధ్య మధ్యలో ఫైట్స్ వంటివి కూడా ఆశిస్తూంటారు. అయితే వాటికి భిన్నంగా లోకల్ విలేజ్ థ్రిల్లర్ తో తెలుగుదనం ఉట్టిపడే టైటిల్ ‘ఓ పిట్టక‌థ‌’ తో దర్శకుడు వచ్చాడు. సెలబ్రెటీలు సైతం ప్రమోట్ చేయటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని ఎంతవరకూ ఈ సినిమా అందుకోగలిగింది…ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

కాకినాడలోని వెంకటలక్ష్మి థియేటర్‌ ఓనర్ వీర్రాజు కు ఒకే ఒక కూతురు వెంకటలక్ష్మి. ఆ అమ్మాయిని చిన్నప్పటినుంచి మనసంతా నువ్వే టైప్ లో ప్రభు (సంజయ్‌ రావ్‌) అనే ఓ కుర్రాడు లైన్ చేస్తూంటాడు. ఆ పిల్లాడు వాళ్ల థియేటర్‌లోనే పనిచేస్తూంటాడు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి , ఇక వీర్రాజుకు ఈ ప్రేమ విషయం తెలిసిపోతుంది అనగా…ఈ లవ్ స్టోరీకు ఓ ట్విస్ట్ పడుతుంది. చెప్పాపెట్టకుండా చైనా నుంచి వచ్చిన వీర్రాజు మేనల్లుడు క్రిష్ (విశ్వంత్‌) కథలోకి ఎంట్రీ ఇస్తాడు. కొద్ది రోజులు ఉండిపోక …ఊసిపోక తాను కూడా వెంకటలక్ష్మీతో ప్రేమలో పడతాడు.

ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మారుతోందనుకునేలోగా…ఊహించని విధంగా వెంకట లక్ష్మి కిడ్నాప్ అవుతుంది. ఈ కేసుని కాకినాడ ఎస్సై అజయ్‌ కుమార్‌ (బ్రహ్మాజీ) ఇన్వెస్టిగేట్‌ చేయటం మొదలెడతాడు. ఈ ఇద్దరి లవర్స్ మీదా ఆ ఎస్సైకు డౌట్స్ ఉంటాయి.  ఇంతకి వెంకట్ లక్ష్మిని ఎవరు కిడ్నాప్ చేశారు. ప్రభు, క్రిష్‌లలో వెంకటలక్ష్మి ఎవరిని ప్రేమిస్తుంది? ఎవరు కిడ్నాప్ చేసారు. మధ్యలో మూడో క్యారక్టర్ ఏదైనా ఎంట్రీ అయ్యిందా అన్నది తెలియాలంటే మాత్రం ఓ.. పిట్ట కథ ని చూడాల్సిందే..

పిట్ట కథ..గట్టి స్క్రీన్ ప్లే..

ఈ సినిమా పూర్తిగా స్క్రిప్టు బేసెడ్ స్టోరీ. ఈ సినిమాలో ఉన్నన్ని మలుపులు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ చూడలేదు. అయితే అన్ని మలుపులును డైజస్ట్ చేసుకోవటం కూడా కష్టమే అనిపిస్తుంది కొంత టైమ్ అయ్యాక. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కు వచ్చేసరికి ఒక్కో ముడి విడుతూంటే దర్శకుడు ఎంత కష్టపడి స్క్రిప్టు చేసుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ బాలెన్స్ తప్పినా సినిమా అర్దం కాకుండా పోతుంది. అయితే ఇలాంటి స్క్రీన్ ప్లే బేసెడ్ సినిమాలు మనకు బాగా తక్కువ. ఓ రకంగా కొత్త జానర్ క్రిందే చెప్పాలి. అయితే దర్శకుడు థ్రిల్స్, ట్విస్ట్ ల మీద పెట్టిన శ్రద్ద సినిమాలో ఎమోషన్ పై పెట్టలేదు. అది కూడా యాడ్ అయితే సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉండేది. మన భారతీయ సినిమాలకు ఎన్ని ఏం చేసినా ఎమోషనల్ కనెక్టవిటీ లేకపోతే కష్టం అనిపిస్తుంది.

ఫస్టాఫ్ రెగ్యులర్ కథతో, కామెడీ సీన్స్ తో లాగేసి, మొత్తం కథంతా సెకండాఫ్ కు దాచి పెట్టుకున్నాడు. దాంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించలేదు. యాక్ట్ విభజన ఫెరఫెక్ట్ గా చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. డైలాగులు సోసోగా ఉన్నాయి. ఈ దర్శకుడు ఇంతకు ముందు చిత్రాల డైలాగులతో పోలిస్తే ..ఇందులో తేలిపోయాయి. మధ్య మధ్యలో ఫోర్సెడ్ గా కామెడీని ఇరికించినట్లు ఉన్నారు.

దర్శకుడు అసలు కథనంతా సెకండాఫ్ లో  రివిల్ చేశాడు. ఒక్కో ట్విస్ట్ ని రీవీల్ చేస్తూ ఆధ్యంతం ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసాడు. అయితే ఈ ప్రాసెస్ లో తెరపై  అసలేం ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్‌  అయితే వస్తుంది. ప్రేక్షకుడు మేధాశక్తితో ఈ సినిమా ఆడుకుంటుంది.  ఇలా చివరివరకు సస్పెన్స్ మైంటైన్ చేయడం ఎక్కడో హాలీవుడ్ చిత్రాల్లో జరుగుతుంది. మన తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రిప్టు లు తక్కువే. అందుకు దర్శకుడుని అభినందించాల్సిందే.

టెక్నికల్ గా…

మేకింగ్ వైజ్ ఈ సినిమా మరింత స్టాండర్డ్స్ లో ఉంటే బాగుండేది. ఎందుకంటే సగటు ప్రేక్షకుడు ఈ రోజు ఓటీటిల పుణ్యమా అని వరల్డ్ సినిమా చూసేస్తున్నాడు. ఆ స్దాయిలో కాకపోయినా అందులో సగమైనా మేకింగ్ లేకపోతే ఆనటం లేదు. సినిమాటోగ్రఫీ విలేజ్ అందాలను పట్టుకున్నంతగా, క్రైమ్ సీన్స్ లో ఆ షార్ప్ నెస్ ని చూపలేకపోయింది.  ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలు సోసో, నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సిన అవసరం ఉంది.
 
నటినటుల్లో కొత్తవాళ్లైనా సంజయ్‌, విశ్వంత్‌, నిత్యాశెట్టి  బాగా చేసారు. నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు కు తొలి సినిమా అయినా అలా అనిపించదు. అయితే అతనిలో నెగిటివ్ షేడ్స్ బాగా పండుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మంచి స్దాయికి వెళ్తాడు.
 
చూడచ్చా
థ్రిల్లర్స్ చూడటం ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా మంచి కాలక్షేపం.
——–
ఎవరెవరు..
నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు.
పాటలు: శ్రీజో
క‌ళ‌: వివేక్‌ అన్నామలై
కూర్పు: డి.వెంకటప్రభు
ఛాయాగ్ర‌హ‌ణం:  సునీల్‌ కుమార్‌ యన్
సంగీతం:  ప్రవీణ్‌ లక్కరాజు
నిర్మాత:  వి.ఆనంద ప్రసాద్‌
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:  చెందు ముద్దు.
విడుద‌ల‌ తేదీ: 06-03-2020