చంద్రశేఖర్ యేలేటి ఇంటర్వ్యూ.
‘చెక్’ కమర్షియల్ సినిమా… ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు – దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి
‘
ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు గర్వించే సినిమాలు అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘చెక్’. యూత్ స్టార్ నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. కల్యాణీ మాలిక్ సంగీతం అందించారు.
ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యేలేటితో ఇంటర్వ్యూ…
*’చెక్’ ఐడియా ఎప్పుడు వచ్చింది?*
– ఎవరికీ లేని గొప్ప టాలెంట్ ఉన్న మనిషి… తన కోసం అన్వేషణ జరుగుతుంటే? ఎక్కడ ఉంటే? అని ఓ ఐడియా ఎప్పటి నుంచో ఉంది. ఓ పది పదిహేను ఏళ్లుగా నాలో ఉంది. అది రకరకాలుగా మారి ‘చెక్’లా తయారైంది. అంటే… ఐడియా లెవల్ లో ఉన్నది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఉండదు. కథపై చాలా రీసెర్చ్ చేశా.
*చదరంగం నేపథ్యంలో ఇంతకు ముందు ఓ సినిమా వచ్చింది. చూశారా?*
– చూడలేదు. సినిమా జరిగేటప్పుడు నేను చూడను. తర్వాత చూస్తాను.
*మీ సినిమా అంటే స్క్రీన్-ప్లే హైలైట్ ఉంటుంది. ఈ సినిమాలో…*
– ‘చెక్’లోనూ స్క్రీన్-ప్లే అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా హ్యూమన్ డ్రామా. సినిమాలో హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ, బాగా తెలివైన వ్యక్తి. రోడ్లు మీద తిరగడు. క్రెడిట్ కార్డ్స్, ఫ్రాడ్స్ చేస్తూ ఉంటాడు. అతని తెలివితేటలను మీరు ఎలా వాడుకుంటారు? అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడిపోతుంది. ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. అతను ఫ్రీగా ఉన్నప్పుడు తెలివితేటలు తప్పుడు దారికి ఉపయోగపడింది. జైలులో ఎవరో పరిచయం అవ్వడంతో అతని బుర్ర సరైన దారిలో పడింది.
*కథలో చదరంగం ఆటకు ఎంత ప్రాముఖ్యం ఉంది?*
– చాలా ఉంది. కథలో చెస్ గేమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి లాస్ట్ అప్షన్, క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోవడం. రాష్ట్రపతి దగ్గర చాలా పిటిషన్లు ఉంటాయి. అప్పటి పరిస్థితుల బట్టి ఒకరిద్దరికి క్షమాభిక్ష ఇస్తారు. ఆ యాంగిల్ ఒకటి తీసుకున్నాం. హీరో చెస్ బాగా ఆడతాడు. వరుసపెట్టి విజయాలు సాధిస్తుంటే అతడిపై సానుభూతి కలగవచ్చు. రాష్ట్రపతి దగ్గర అభిప్రాయం మారవచ్చు. ఆట, క్షమాభిక్ష… ఈ రెండు అంశాల నేపథ్యంలో సన్నివేశాలు ఉంటాయి.
*సినిమాలో ఎక్కువశాతం జైలు నేపథ్యంలో ఉంటుందట. దానిని ఎలా డీల్ చేశారు?*
– అవును. 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. అంత కంటే తగ్గేది? కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది.
*సాధారణంగా చేతికి ఉంగరాలు పెట్టుకుంటారు. మీ హీరో చేతికి టాటూలు ఉన్నాయేంటి?*
– జైలుకి రావడానికి ముందు అతని లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో చెప్పడానికి ఆ టాటూలు డిజైన్ చేశాం.
*హీరోగా నితిన్ ని ఎంచుకోవాడానికి కారణం ఏంటి?*
– ఎంచుకోవడం కాదు… నితిన్ తో సినిమా చేయాలని అనుకున్నాం. అప్పుడు రెండుమూడు కథలు అనుకున్నాం. దీనికి ముందు ఇంకో కథపై వర్కవుట్ చేశాం. ఫైనల్ గా ఈ కథ బావుంటుందని అనుకుని ‘చెక్’ చేశాం.
*నితిన్ ని మైండ్ లో పెట్టుకుని కథ రాశారా? కథ ప్రిపేర్ అయ్యాక నితిన్ ని కలిశారా?*
– ప్రిపేర్ అయ్యాక కలిశా. అయితే, అప్పటికే నితిన్ తో చేయాలని ఉంది. నితిన్ కి బాగా సూట్ అవుతుందని అనిపించింది.
*మీ సినిమాల్లో స్క్రీన్-ప్లే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లెవల్ ఉంటాయి. బ్యాక్-గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. కల్యాణీ మాలిక్ గారిని తీసుకోవడానికి కారణం? ‘ఐతే’ తర్వాత గ్యాప్ కూడా వచ్చింది.*
– ఎప్పటి నుంచో మేమిద్దరం చేయాలని అనుకుంటున్నాం. మధ్య మధ్యలో కలిశాం. పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇన్ని రోజుల తర్వాత కుదిరింది. అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు.
*ప్రచార చిత్రాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ను న్యాయవాదిగా చూపించారు. ఆ అమ్మాయి రోల్ ఏంటి?*
– అమ్మాయిది న్యాయవాది పాత్రే. కాకపోతే… బేసిగ్గా భయస్తురాలు. భయస్తురాలు నుంచి ధైర్యవంతురాలిగా మారుతుంది. క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. అటువంటి అమ్మాయి తీవ్రవాది ముద్రపడిన ఓ వ్యక్తి కేసు డీల్ చేయాల్సి వస్తుంది. ఆమెది మంచి రోల్.
*ప్రియా ప్రకాశ్ వారియర్ రోల్ ఏంటి?*
– ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ఆ అమ్మాయిదీ చాలా ఇంపార్టెంట్ రోల్. నితిన్ లవ్ ఇంట్రెస్ట్. ఆమె ఎంటర్ అయిన దగ్గర్నుంచి మొత్తం కథ టర్న్ తీసుకుంటుంది.
*మురళీశర్మ, సంపత్ రాజ్, సాయి చంద్ పాత్రల గురించి?*
– జైలు సూపర్ సూపరింటెండెంట్ పాత్రలో నితిన్ కి మద్దతుగా మురళీ శర్మగారు నటించారు. ఆయన తర్వాత సూపరింటెండెంట్ గా సంపత్ రాజ్ వస్తారు. ఆయనది విలన్ పాత్ర. సాయి చంద్ గారు అయితే సినిమాకి బ్యాక్ బోన్. చెస్ నేర్చుకోవాలి, ఆడాలి అని జైలులో హీరోను ప్రేరేపించిన వ్యక్తి సాయి చంద్ గారు. ఎప్పుడో ఆవేశంలో చేసిన తప్పు వలన జైలుకు వెళ్తారు. అక్కడ ఒక్కరే చెస్ ఆడుకుంటూ ఉంటారు. హీరో జైలుకు వెళ్లిన తర్వాత ఇద్దరికి పరిచయం ఏర్పడుతుంది. హీరో చెస్ నేర్చుకుంటాడు.
*నిర్మాత ఆనందప్రసాద్ గారి గురించి?*
– చాలా మంచి నిర్మాత. ఆయన 100 శాతం మనపై నమ్మకం ఉంచుతారు. మొదట కథ వింటారు. కథ నచ్చితే… నాకు తెలిసి మళ్ళీ ఫైనల్ కాపీ చూస్తారు. దర్శకుడిపై అంత నమ్మకం పెడతారు. ఆయనతో చిన్న సమస్య కూడా ఉండదు. వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవిగారు వెనుక ఉండి నడిపిస్తుంటారు.
*సినిమాలో ఖైదీ యూనిఫామ్ కొత్తగా ఉంది. ఎక్కడి జైలు…?*
– మా సినిమాలో జైలు, ఆ యూనిఫామ్ పూర్తిగా కల్పితం. గద్వాల్ జైలు అని పెట్టాం. దానికి కారణం ఏంటంటే… చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఓ ఏడాది పాటు అన్ని జైళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించాం. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తాయి కనుక చూడటానికి అనుమతులు ఇవ్వడం లేదు. జైలులో విధానాలపై మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. అంటే… తీవ్రవాదులను ఎలా తీసుకువెళతారు? ఎలా పెడతారు? వంటి విషయాలు చెప్పడానికి ఓపెన్ గా లేరు. కాన్ఫిడెన్షియల్ మేటర్ కాబట్టి అర్థం చేసుకోగలను. అందుకని, ఓ జైలును కల్పించాం. ఫరీద్ కోట్ నుండి విశాఖ వరకు ఐదారు జైళ్లకు వెళ్ళా. సాధారణ ఖైదీలను చూపిస్తున్నారు. అక్కడ నుంచి ముందుకు వెళ్లడం లేదు. పేర్లు అప్రస్తుతం గానీ… కొంతమంది ఖైదీలను ఎక్కడ పెట్టారు? ఎటువంటి భోజనం ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తే సమాధానాలు రాలేదు.
*మీ సినిమాలు ఎక్కువగా నిజానికి దగ్గరగా ఉంటాయి. ఎటువంటి ఇన్సిడెంట్లు తీసుకుని చేస్తారు?*
– ఇవాళ ఉదయం పేపర్లో ఒక ఆర్టికల్ చదివి ఉండొచ్చు. అది మనసులో ముద్రపడి రెండు సంవత్సరాల తర్వాత మారిపోయి వేరే ఐడియాగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్… ‘ఐతే’ సినిమాకి అమెరికా ప్రభుత్వ ప్రకటన ఒకటి స్ఫూర్తి. ఒసామా బిన్ లాడెన్ మీద 100 మిలియన్ డాలర్ ప్రైజ్ మనీ ఏదో పెట్టారు. అక్కడ నుంచి ఐడియా ట్రిగ్గర్ అయింది. శూన్యం నుంచి ఎవరికీ ఐడియాలు రావు. కొత్తగా ఏదీ సృష్టించలేం. సృష్టించాల్సింది అంతా భగవంతుడు ఎప్పుడో సృష్టించాడు. ఐడియా ఎవరు ట్రిగ్గర్ చేస్తారనేది చెప్పలేం. ఎక్కువగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి పొందుతా. ఫిక్షన్ తీసుకోను.
*ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్ అయ్యుంటారా?*
– అలాగని చాలామంది అంటారు. నా సినిమాలు విడుదలైన రెండు మూడేళ్ల తర్వాత ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. ‘సినిమాలో అది బావుంది’ అని చెప్తారు. అడ్వాన్స్డ్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి.
*మీరు స్ట్రయిట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎందుకు చేయరు?*
– ‘చెక్’ చేశాను కదా. ఇది కొత్త పాయింటే. అయినా… యాక్షన్ సహా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎమోషనల్ థ్రిల్లర్ కనుక ఎక్కువ పాటలు అవసరం లేదని అనుకున్నాం. పాటలు తప్ప మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. చూసిన వాళ్లు అందరూ బాగా వచ్చిందని అంటున్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.
*ఫైనల్ కాపీ చూశాక… మీకు ఏం అనిపించింది?*
– ఈ సినిమా అనే కాదు, ఏ సినిమాకైనా రాసుకున్నది 60 శాతం తెరపైకి తీసుకు రాగలిగితే హ్యుజ్ సక్సెస్. ‘చెక్’ విషయంలో 70 శాతానికి పైగా తీసుకొచ్చానని అనుకుంటున్నాను.
*’చెక్’ సినిమా యుఎస్‌పి ఏంటి?*
– ఒక్కటి అని చెప్పలేను. ఎందుకంటే… నటీనటుల ప్రతిభ గానీ, సంగీతం గానీ, కళా దర్శకత్వం గానీ, ఇంకొకటి గానీ, ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. యాక్షన్ పార్ట్… ఫైట్ మాస్టర్ రవి వర్మ అద్భుతంగా చేశాడని సినిమా చూసినవాళ్లు చెప్తున్నారు. కల్యాణీ మాలిక్ నేపథ్యం సంగీతం… మేం 50 శాతం చేస్తే, మిగతా 50 శాతం కల్యాణీ మాలిక్ చేశాడు. మా కెమరామెన్ రాహుల్ శ్రీవాత్సవ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు .వివేక్ ఆర్ట్ డైరెక్షన్, నరేష్ అని కొత్త రైటర్ రాసిన డైలాగులు, ముఖ్యంగా ఆనంద ప్రసాద్ గారి నిర్మాణ విలువలు… సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా చేయలేదని అనిపించదు. అంత బాగా ఉంటుంది.
*ప్రేక్షకులకు ‘చెక్’ గురించి ఏం చెప్తారు?*
– నేను తీసిన మిగిలిన సినిమాలు ఏమైనా డిజప్పాయింట్ చేసి ఉండచ్చు. ఈ సినిమా డిజప్పాయింట్ చేయదు. ఫిబ్రవరి 26న ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది. ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.
*నెక్స్ట్ సినిమా?*
– ఈ సినిమాకి ముందే రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సినిమా ఇంకొకటి చేయాలి.