చక్ర మూవీ రివ్యూ

Published On: February 21, 2021   |   Posted By:

చక్ర మూవీ రివ్యూ

కమర్షియల్ వక్ర : విశాల్ ‘చక్ర’ మూవీ రివ్యూ
Rating: 2/5

డేటా దొంగతనం అనేది ఈ రోజు న అతి సామాన్య విషయం గా మారిపోయింది. ఒకప్పుడు డబ్బు ఎంతో జాగ్రత్తగా దాచుకునేవారు. కానీ ఇప్పుడు డేటాని అంతకన్నా ఎక్కువగా దాచుకోవాల్సిన పరిస్దితి. లేకపోతే ఆ డేటా ఎవరి చేతిలోకి వెళ్లి ఏయే మార్గాల్లో దుర్వినియోగం అవుతుందో తెలియదు. ఆ విషయాల మీద మనందరికీ అవగాహన అవసరమే. అందుకు ప్రభావవంతమైన మీడియా అయిన సినిమా సహకారం మరీ అవసరం. ఆ విషయాన్ని విశాల్ గమనించారు. గతంలో ఇలాంటి ఆలోచనలు చుట్టూ తిరిగే కథతో,కొంత అవగాహనను ప్రేక్షకుడుకి కలగచేస్తూ అభిమన్యుడు వంటి సినిమాతో ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో సారి ‘చక్ర’ అంటూ మన ముందుకొచ్చారు. మరి ఈ సారి కూడా అదే స్దాయిలో సక్సెస్ అయ్యాడా..అసలు ‘చక్ర’ కథేంటి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమానా..ఆ విషయాలేమిటో రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్
49 దొంగతనాలు హైదరాబాద్ లో ఒకే రోజు అదీ ఆగస్టు 15 న జరుగుతాయి. పోలీస్ లకు ఏమీ అర్దం కాదు. ఓ ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి దొంగతనం చేసారని మాత్రమే తెలుస్తుంది. ఆ దోచుకోబడ్డ ఇళ్లల్లో వారంతా ముసలి వాళ్లు అని, బెదిరించి దోచారని అర్దమవుతుంది. ఆ దొంగతనాల్లో జరిగిన ఇళ్లలో హీరో చంద్రు(విశాల్) నాయనమ్మది కూడా ఒకటి. ఆ దొంగలు ఆ ఇంట్లో నగలు,డబ్బుతో పాటు..హీరో తండ్రికి సంభందించిన అశోక చక్ర మెడల్ ని కూడా పట్టుకెళ్తారు. దాంతో హీరోకు కాలిపోతుంది. వెంటనే తను చేస్తున్న మిలిట్రీ నుంచి వచ్చేస్తాడు. తన మాజీ ప్రేయసి గాయత్రి(శ్రద్ధ శ్రీనాథ్) ఆధ్వర్యంలోనే ఈ కేసు ఇన్విస్టిగేట్ జరుగుతోందని తెలుసుకుంటాడు. వెంటనే ఆమెను కలిసి ఆ టీమ్ ని లీడ్ చేయటం మొదలెడతాడు. తన తెలివితో ఒక్కో ముడి విప్పుకుంటూ..ఒక్కో డాట్ ని కలుపుతూ పోతే ఆ చివర ఓ మాస్టర్ మైండ్ లీల(రెజీనా కసెండ్రా) ఉంటుంది. అక్కడ నుంచి ఆమెతో పిల్లీ,ఎలకా ఆట మొదలవుతుంది. ఎత్తుకు,పై ఎత్తులతో ఇద్దరూ గేమ్ ఆడతారు. చివరకు ఆ గేమ్ లో చంద్రు ఎలా విజయం సాధించాడు. అసలు ఎవరా మాస్టర్ మైండ్, ఆమె గతం ఏమిటి..ఆ దొంగతనాల వెనక ఉన్న స్ట్రాటజీ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …

ఈ కథ ఎత్తుగడ చక్కగా మొదలై చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. కానీ ముందుకు వెళ్లే కొలిది అది ఓ విలన్, హీరో కథలాగ మారిపోతుంది. అంతేతప్ప డేటా చౌర్యం గురించి చర్చించదు. డేటా చౌర్యం గురించి ఈ సినిమా కు వెళ్లినవారికి మొదట నిరాశ కలుగుతుంది. పోన్లే ఏదోకొటి ఇంట్రస్టింగ్ గా ఉంటే చూద్దామని ఫిక్సైతే..సెకండాఫ్ లో మరీ రొటీన్ గా సీన్స్ వస్తాయి. విలన్ అయిన రెజీనా పాత్రకు ప్లాష్ బ్యాక్, ఓ పాట పెట్టి తమిళ అతితో ఇబ్బంది పెడతాడు. సర్లే అని అదీ భరిస్తే .. క్రైమ్ లో కొత్త ట్విస్ట్ లు ఏమీ రివీల్ కావు. ఇన్విస్టిగేషన్ డ్రామా ఎండ్ అవగానే థ్రిల్లింగ్ అంతమైపోతుంది. దానికి తోడు చాలా సిల్లీగా , ఇల్లాజికల్ గా మొత్తం పోలీస్ డిపార్టమెంట్ ఐజీ నుంచి , సిటీ పోలీస్ కమీషనర్ దాకా ..హీరో చెప్పిన ఆదేశాలు ఫాలో అవుతూంటే..ఓ మిలిట్రీలో పనిచేసే ఆఫీసర్ కు పోలీస్ లు ఇంత సీన్ ఇస్తారా అనే సందేహం కలుగుతుంది. రెజీనా పాత్ర ఎంతో బిల్డప్ గా స్టార్ట్ చేస్తారు..కానీ ఆమె కనిపించిన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా డ్రాప్ అయ్యిపోయి..క్లైమాక్స్ కు వచ్చేసరికి..పూర్తిగా డమ్మీ అయ్యిపోతుంది. ఎప్పుడైతే విలన్ క్యారక్టర్ పడిపోయిందో అక్కడే సినిమా దెబ్బ తింది. అభిమన్యుడులో అర్జున్ విలన్ గా చేసి దుమ్మురేపారు. ఇక్కడే అదే మిస్సైంది. అలాగే సినిమాలో ఎమోషనల్ డెప్త్ లేనప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చి ఉపయోగం ఏమిటి అనే విషయం కొత్త దర్శకుడు మర్చిపోయాడు.

టెక్నికల్ గా…
స్క్రిప్టు విషయంలో చాలా బద్దకంగా ఉన్న ఈ సినిమాకు ప్లస్ లు ఏమిటీ అంటే..బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్. మిగతా డిపార్టమెంట్స్ అన్ని జస్ట్ ఓకే అన్నట్లుగా ఉన్నాయి. విశాల్ అభిమానులుకు నచ్చుతాడు ఏమో కానీ ..నిజానికి చేసిందేమీ లేదు. ఏసీపీ గాయ‌త్రిగా శ్ర‌ద్ధా శ్రీనాధ్ చాలా బెస్ట్. రెజీనా క్యారక్టర్ ని ‘The Girl with the Dragon Tattoo’ లోంచి తీసుకున్నారని స్పష్టంగా అర్దమవుతోంది. గెటప్ తో సహా లేపారు.

చూడచ్చా
ఏదో కాలక్షేపంకు ఓ లుక్కేద్దామనుకుంటే ఓకే. అంతేకాని ఓ అదిరిపోయే థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం దెబ్బ తింటారు.

 

తెర ముందు..వెనుక
బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ;
నటీనటులు: విశాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా, శ్రుతి డాంగే,రోబో శంకర్‌, మనోబాల తదితరులు;
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా;
సినిమాటోగ్రఫీ: కె.టి.బాలసుబ్రహ్మణ్యం;
ఎడిటింగ్‌: త్యాగు;
నిర్మాత: విశాల్‌;
రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు
రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌.ఆనందన్‌;
విడుదల తేదీ: 19-02-2021