జాతిరత్నాలు మూవీ రివ్యూ

Published On: March 11, 2021   |   Posted By:
జాతిరత్నాలు మూవీ రివ్యూ
 
నవ్వుల రత్నాలు: ‘జాతిరత్నాలు’ రివ్యూ

Rating: 3/5

కామెడీకు ఎప్పుడూ ఓ వర్గం సపోర్ట్ ఉంటుంది. ఆ వర్గం దాహాన్ని తీర్చటానికి ఆ తరంలో ఇవివి, జంధ్యాల వంటి వారు ఆ తర్వాత శ్రీనువైట్ల, ఇప్పుడు అనీల్ రావిపూడి వచ్చారు. ..ఇదిగో ఈ రోజు ఈ డైరక్టర్ మన ముందుకు వచ్చాడు. నాన్ స్టాప్ కామెడీ చేస్తానని,నాన్సెన్స్ కథతో నవ్విస్తానని నమ్మించాడు. జాతిరత్నాలు అంటూ టైటిల్ లోనే సెటైర్ ని పేల్చాడు. మరి ఈ కొత్త డైరక్టర్ కామెడీ మనకు నచ్చుతుందా..అసలు ఈ చిత్రం కథేంటి..నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో ఏ పాత్ర చేసాడు…నాగ్ అశ్విన్ ఏం నమ్మి ఈ సినిమాపై పెట్టుబడి పెట్టారో చూద్దాం.

స్టోరీ లైన్
 
జోగిపేట కుర్రాడు…శ్రీకాంత్ (న‌వీన్ పొలిశెట్టి) కు ఇద్దరు ఫ్రెండ్స్ ..  శేఖ‌ర్ (ప్రియద‌ర్శి), ర‌వి (రాహుల్ రామ‌కృష్ణ‌). వీళ్లు ఏం పనిచేసినా కలిసి పనిచేస్తారు..కలిసి తాగుతారు..కలిసే తిరుగుతారు. కలిసే అమ్మాయిలకు సైట్ కొడతారు. అలాంటి వాళ్లు కు ఊళ్లో ఉంటే ఇజ్జత్ పోతోందని,ఎవరూ గౌరవించటం లేదని అర్దమవుతుంది. తన తండ్రి(భరణి) శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం లో తనను కూర్చోపెడతారని భయపడ్డ శ్రీకాంత్ ..హైదరాబాద్ ప్రయాణం కడతారు. అయితే హైదరాబాద్ లో అతనికి అతనికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఫుల్ ఖుషీ అవుతాడు.  ఆ తర్వాత అనుకోకుండా ఓ  స్పోర్ట్స్ మినిస్టర్ చాణక్య (ముర‌ళి శ‌ర్మ‌) మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాన్నుంచి బయిటపడటానికి వాళ్లు ముగ్గురూ చేసే ప్రయత్నాలే మిగతా సినిమా. అయితే అసలు వాళ్లు కేసులో ఇరుక్కోవటానికి కారణం ఏమిటి..ఏం జరిగింది. శ్రీకాంత్ లవ్ స్టోరీ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

ఎనాలసిస్ ..

ఇదొక ఫార్సికల్ కామెడీ . కామెడీకి పెద్దగా లాజిక్ లు లేవని ఈ డైరక్టర్ బాగా నమ్మినట్లున్నాడు. అందుకు తగ్గట్లే సీన్స్ నడుస్తూంటాయి. వన్ లైనర్స్, ఫన్నీ సీన్స్ ప్రధానంగా ఉంటుంది తప్ప కథ అనేది ఎక్కడా కనపడదు. అలాగే చాలా జోక్స్  విడిగా వింటే వింతగా ఉండచ్చు. కానీ ఈ సినిమాలో భాగంగా చూస్తే అవి పగలబడి నవ్వేలా ఉంటాయి. అంటే సినిమా కు తగ్గ టోన్ ని ముందే సెట్ చేయటం కలిసొచ్చింది. అలాగే మన కళ్ల ఎదురుగా మన టౌన్ లలో తిరిగే కుర్రాళ్లను రీసెర్చ్ చేసినట్లుగా క్యారక్టరైజేషన్స్ తీర్చిదిద్దటంతో సగం సక్సెస్ వచ్చేసింది. వాస్తవానికి కంటెంట్,కథ పరంగా ఏమీ లేదు. ఎక్కడికక్కడ లాజిక్ లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. సెకండాఫ్ అయితే మరీనూ. అయితేనే ఎక్కడా బోర్ కొట్టకుండా నవ్విచంటం కలిసొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ మాత్రం కూడా నవ్వించేవి లేవే అని జనాలు తెగ నవ్వేసుకుంటున్నారు.  
 
 టెక్నికల్ గా..

ఈ సినిమా కు పెద్ద బ్యానర్ తోడవటంతో మంచి స్టాండర్డ్స్ తో తెరకెక్కింది. మంచి టెక్నిషియన్స్ సెట్ అయ్యారు. కెమెరా వర్క్, సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది.  నాగ్ అశ్విన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.డైలాగులు బాగా పేలాయి.  న‌వీన్ పోలిశెట్టి  గురించే సినిమా చూడాలనిపించేలా చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌ కోర్టు ఎపిసోడ్‌ లో అదరకొట్టాడు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కూడా నవీన్ తో పోటా పోటీగా చేసారు. అలాగే.. హీరోయిన్ చేసిన ఫ‌రియా అబ్దుల్లా బాగుంది.  జ‌స్టిస్ బ‌ల్వంత్ చౌద‌రిగా బ్రహ్మానందం మళ్లీ తన పాత రోజుల ఫన్ గుర్తు చేసారు.
 
చూడచ్చా

అసభ్యతా, అశ్లీలం లేని క్లీన్ కామెడీ కనుక కుటుంబసమేతంగా చూడచ్చు.

తెర ముందు..వెనక

నిర్మాణ సంస్థ‌: స‌్వ‌ప్న సినిమా;
న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, ముర‌ళి శ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, బ్ర‌‌హ్మాజీ, న‌రేష్ త‌దిత‌రులు;
సంగీతం: ర‌ధ‌న్‌; ఛాయాగ్ర‌హ‌ణం: సిద్ధం మ‌నోహ‌ర్‌;
ఆర్ట్: చ‌ంద్రిక – అలీ;
ఎడిటర్: అభిన‌వ్ దండా;
నిర్మాత‌:  నాగ్ అశ్విన్‌;
కథ,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  కె.వి. అనుదీప్‌;
రన్ టైమ్:2 గంటల, 25 నిముషాలు
విడుద‌ల తేదీ: 11-03-2021