జాను మూవీ రివ్యూ

Published On: February 7, 2020   |   Posted By:

జాను మూవీ రివ్యూ

‘స్లో’ పాయిజన్ (`జాను` మూవీ రివ్యూ)
 
Rating: 3/5

మన జీవితాలను,మనస్సులను స్పృశిస్తూ సాగే ప్రేమ కథలు అరుదుగా స్క్రీన్ పైకి  ఎక్కుతూంటాయి. అలాంటివాటిల్లో తమిళంలో వచ్చి హిట్టైన `96` . త్రిష‌, విజ‌య్ సేతుప‌తి జంట‌గా రూపొందిన  ఈ చిత్రం అక్క‌డ మంచి హిట్. అంతేకాదు  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు త్రిష‌కు అవార్డుల్ని సైతం సంపాదించి పెట్టింది. అలాంటి సినిమాని రీమేక్ చేయటం కన్నా డబ్బింగ్ బెస్ట్ అని భావిస్తూంటారు. కానీ దిల్ రాజు మన వాళ్లకు ఆ మ్యాజిక్ ని మన నేటివిటితో అందించాలనుకున్నాడు. అందుకోసం ఒరిజనల్ తమిళ డైరక్టర్ నే తెచ్చి డైరక్ట్ చేయించాడు. మరి ఆ తమిళ దర్శకుడు మన తెలుగు నేటివిటని పట్టుకోగలిగాడా…మన సెన్సిబులుటినీ తెరపై ఆవిష్కరించగలిగాడా…అసలు ఈ సినిమాలో జనాలను ఆకట్టుకునేటంత విషయం ఏముంది…తెలుగులోనూ తమిళ స్దాయి మ్యాజిక్ క్రియేట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

స్టోరీ లైన్
 
 వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌ రామ్ (శ‌ర్వానంద్‌) తమ చిననాటి స్కూల్ స్టూడెంట్స్ రీయూనియన్ కు వైజాగ్ వస్తాడు. అక్కడకు వచ్చాక అతన్ని పాత జ్ఞాప‌కాలు వెంటాడతాయి. అదే మీట్ కు  సింగ‌పూర్‌లో ఉన్న జానకి దేవి అలియాస్ జాను (స‌మంత‌) కూడా వ‌స్తుంది. రామ్‌, జాను ఇద్దరు స్కూల్ డేస్ లో ప్రేమికలు. అయితే ఆ విషయం ఇద్దరికీ తెలిసినా ఎప్పుడూ వ్యక్తం చేసుకోరు. ఆ క్రమంలో జీవితం వాళ్లిద్దరిని విడతీస్తుంది. జాను  పెళ్లి చేసుకుని సెటిలైపోతుంది. రామ్ మాత్రం ఆ ప్రేమను మనస్సులో పెట్టుకుని బ్యాచులర్ గానే మిగిలిపోతాడు. ఇలాంటి వీరిద్దరూ దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇప్పుడు మెచ్యూర్టి వచ్చి జీవితంలో సెటిలైన వీళ్లిద్దరి మధ్యా ఆ ప్రేమ అలాగే ఉందా…ఆ కొద్ది గంటల్లో వీళ్లు ఎలాంటి ఎక్సపీరియన్స్ ని ఫేస్ చేసారు. వీళ్ల కలయిక ఏమన్నా కొత్త ప్రస్దానానికి నాంది పలికిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

స్క్రీన్ ప్లే

ఈ సినిమా స్టోరీ లైన్ గా చాలా చిన్నది. దాన్ని ట్రీట్మెంట్ తో విస్తరించి మెప్పించే ప్రయత్నం చేసారు దర్శకుడు. ముఖ్యంగా సెకండాఫ్ లో మెమెరీస్ తప్ప మామూలు కథంటూ ఉండదు. హృదయాన్ని  మెప్పిస్తేనే ఇలాంటి సినిమాలు నడుస్తాయి. ఎందుకంటే కామెడీ,యాక్షన్ వంటి రొటీన్ సినీ అంశాలకు ఈ సినిమా దూరం. అదే సమయంలో ఈ సినిమాని విస్తరించే ప్రయత్నంలో బాగా స్లోగా నడపటంతో సాగిన ఫీలింగ్ చాలా చోట్ల వస్తుంది. ఓ ప్రక్కన మన జీవితంలోని  ఇలాంటి ప్రేమ గుర్తు చేసుకుంటూనే మరో ప్రక్క సాగుడుని బాదుడుగా ఫీలవుతాం. అలాగే ఈ కథను తొంభైల్లోనే జరిగినట్లు చూపెడితే మరింత కనెక్ట్ అవటానికి సహకరించేది. దూరదర్శన్ వంటి లాజిక్ లు ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యేవి. ఏదైమైనా తెలుగుకు వచ్చేసరికి ..కాస్తంత ఇక్కడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని స్లో ని తగ్గించాల్సింది. స్కూల్ సీన్లన్నీ ప్రేక్షకులందరికీ నోస్టాల్జిగ్గా డిజైన్ చేయటం ఈ సినిమాకు దర్శకుడు చేసిన పెద్ద సాయం.

తమింళంకు తెలుగుకు తేడా

చాలా మందికి ఈ సినిమా రీమేక్ అనగానే …అబ్బే వర్కవుట్ కాదు..ఫీల్ ని రీమేక్ చేయటం కష్టమని అనేసారు. అయితే దర్శకుడు తమిళం సినిమాని ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించటంతో జెరాక్స్ అనిపించినా ..ఫీల్ మాత్రం ఎక్కడికీ పోలేదు. హీరో,హీరోయిన్ల హృదయాల్లో ఉన్న బావోద్వేగాలు ఆ ఫ్రేమ్ ల్లో భద్రంగా ఉన్నాయి. కాబట్టి తమిళంలో చూసినా అచ్చమైన తెలుగులో మరోసారి చూసే ధైర్యం చేయచ్చు.
 
నటీనటుల్లో

ఈ సినిమా రీమేక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు…ఖచ్చితంగా విజయ్ సేతుపతి, త్రిషల నటనతో శర్వా, సమంతలను పోల్చి చూస్తారని అందరికీ అర్దమైంది. కాబట్టి ఖచ్చితంగా శర్వా,సమంతలకు కూడా అర్దమయ్యే ఉంటుంది. దాంతో వాళ్లు జాగ్రత్తలు తీసుకుని వేరియేషన్ చూపించే ప్రయత్నం చేసారు. కానీ దర్శకుడు తమిళంలో ఉన్నదున్నట్లు దింపాలి అనుకున్నాడేమో చాలా చోట్ల శర్వాని చూస్తూంటే విజయ్ సేతుపతి గుర్తు వస్తారు. అలాగే త్రిష ముందు సమంత తేలిపోయింది.

సాంకేతికంగా
ఇలాంటి సినిమాలకు అత్యవసరమైన సంగీతం, సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉన్నాయి.  బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్స్ ను మ‌రో స్దాయికి తీసుకెళ్లింది. సినిమాలో చాలా స్లో నెరేష‌న్‌లో నడవడమే  దర్శకుడు, ఎడిటర్ పై చెప్పాల్సిన కంప్లైంట్.

 చూడచ్చా
మీకూ ఓ వయస్సులో  క్ర‌ష్ ఉంండి, ల‌వ్ బ్రేక‌ప్స్ ఉంటే బాగా నచ్చుతుంది.  మీ మ‌న‌సుని బాగా తాకుతుంది.
 
ఎవరెవరు…

 స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, సమంత‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌, శ‌ర‌ణ్య‌, గౌరి, సాయికిర‌ణ్‌, హాసిని త‌దిత‌రులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌