జీవి మూవీ రివ్యూ

Published On: June 25, 2021   |   Posted By:

జీవి మూవీ రివ్యూ

థ్రిల్లర్స్ ఇష్టపడే జీవులకే…: ‘జీవి’ రివ్యూ

Rating:2.5/5 

‘ఆహా’ ఓటీటిలో వరస తప్పకుండా డబ్బింగ్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మళయాళ డబ్బింగ్ లకు కాస్త గ్యాప్ ఇచ్చి…తమిళ డబ్బింగ్ సినిమాలు బయిటకు తీసారు. 2019 జూన్ లో తమిళనాట విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యింది. అక్కడ బాగానే వర్కవుట్ అయ్యింది. మంచి అప్లాజ్ మాత్రమే కాకుండా డబ్బులూ తెచ్చిపెట్టింది. థ్రిల్లర్ అభిమానులందరూ మెచ్చుకున్నారు. మరి ఈ థ్రిల్లర్ మూవీ తెలుగువారికి నచ్చుతుందా, కథేంటి ..అసలు  ఎలా ఉందో తెలుసుకుందాం.

స్టోరీ లైన్

రైతు కుటుంబం నుంచి వచ్చిన  శ్రీనివాస్ (వెట్రి) పెద్దగా చదువుకోడు. కానీ లోక జ్ఞానం..ముఖ్యంగా పుస్తక జ్ఞానం ఎక్కువ. కుటుంబ పరిస్దితుల దృష్ట్యా హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఓ జ్యూస్ షాప్ లో పనికి దిగుతాడు. అక్కడే పనిచేస్తున్న  టీ మాస్టర్ మణి (కరుణాకరన్)తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటాడు. అంతేకాదు పనిలో పనిగా..  వాళ్ళ షాప్ ఎదురుగా సెల్ ఫోన్ షాప్ లో పనిచేసే ఆనంది (మోనిక)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించినా…శ్రీనివాస్ ఆర్దిక పరిస్దితి చూసి..పెళ్లైతే కష్టమని స్కూల్ టీచర్ అయిన మేనమామతో పెళ్ళి చేసుకుందామని ఫిక్సవుతుంది. శ్రీనివాస్ కు ఆనంది బ్రేక్ అప్ చెప్పేస్తుంది. తన ప్రేమ దెబ్బ తినటానికి కారణం తన దరిద్రమే అని..డబ్బులు సంపాదించాలని అడ్డ దారిలో వెళ్లటానికి ఫిక్స్ అవుతాడు.  తన హౌస్ ఓనర్ లక్ష్మీ (రోహిణి) ఇంట్లోని నగలను దొంగిలించాలని ప్లాన్ చేస్తాడు. తన ప్రెండ్ మణి తో కలిసి అమలు చేస్తాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్..  ఇప్పుడు శ్రీనివాస్ జీవితంలో జరుగుతున్న సంఘటనలే పాతికేళ్ళ క్రితం అతని ఇంటి ఓనర్ లక్ష్మీ జీవితంలోనూ జరిగి ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న  శ్రీనివాస్ ఏం చేస్తాడు. తర్వాత ఏం జరిగింది. పోలీస్ లకు పట్టుబడి పోయాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్

థ్రిల్ల‌ర్ సినిమాకి ఓ గొప్ప లక్షణం ఉంటుంది. పాత్రలు పరిచయం అయ్యిన కొద్ది సేపటికి  సెటప్ పూర్తి చేసి… ఓ ప‌జిల్ మన ముందుంచుతారు. చూస్తున్న ప్రేక్షకుడు ఛేదించ‌లేని స్దాయిలో ఓ ప‌జిల్ ఇచ్చి, ద‌ర్శ‌కుడు తాను సాల్వ్ చేస్తూ.. మ‌న‌కు థ్రిల్ కి గురి చేయ‌డ‌మే థ్రిల్ల‌ర్ ల‌క్ష‌ణం.అలాంటి థ్రిల్లర్స్ మనకు తెలుగులో చాలా అరుదుగానే వస్తున్నాయి. అడపా,దడపా వచ్చి హిట్టైనవి తమిళ లేదా మళయాళ రీమేక్ లు కావటం చెప్పుకోదగ్గ విషయం. ఓ దృశ్యం తీసుకున్నా, ఓ రాక్షసుడు తీసుకున్నా ఆ స్టాండర్డ్స్ లో కథ చెప్పటం తెలుగువాళ్లకు సాధ్యం కాదని అర్దమవుతోంది. ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నా అదే అనిపిస్తుంది. ఇది గొప్ప సినిమా,అరుదైన సినిమా అని చెప్పలేం కానీ డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. ఎందుకంటే సాదా సీదా ఎలిమెంట్స్ తో స్ట్రాంగ్ ఇంటిలిజెంట్ పాత్రలతో కథ,కథనం అల్లి పరుగెత్తించారు. ఇలాంటి థ్రిల్లర్స్ చూడటం ఓ మంచి అనుభూతి అని చెప్పాలి. ఈ సినిమా సెటప్ కొంత లేటైన మాట వాస్తవం. కొత్త హీరో అవ్వటం వల్లనో ఏమో కానీ ఆ మొహం పరిచయం అయ్యేదాకా చాలా టైమ్ తీసుకుని కథలోకి వచ్చారు. ఆ తర్వాత కథ క్రైమ్ లోకి ప్రవేశించాక.. థ్రిల్ చేసి ఇంట్రస్ట్  రేకెత్తించ‌డం వ‌ర‌కూ అంతా బాగుంది. ఆ తర్వాత డల్ అవుతుందనుకునే సమయంలో  సారూప్య సంఘటనలు అనే కొత్త కాన్సెప్టు ని మన ముందు ప్రవేశ పెట్టి ఆ లోట మనకు తెలియనివ్వలేదు. ఇది రైటర్, డైరక్టర్ కలిసి సాధించిన విజయమే. అయితే ఫస్టాఫ్ మాత్రం బోర్ కొడుతుంది. అది భరిస్తేనే మిగతాది చూసే అవకాసం.
 
టెక్నికల్ గా..

డైరక్షన్ విషయానికి వస్తే.. ముఖ్యంగా ప్రేక్షకుడుని మెల్లిగా  త‌న దారిలోకి తీసుకొచ్చి క‌థ చెబుతూ.. ప్రేక్ష‌కుడి ఇంటిలిజెన్స్ లెవ‌ల్స్ ఏమాత్రం డిస్ట్ర‌బ్ అవ్వ‌కుండా – చిక్కుముడుల‌న్నీ విప్ప‌టమే ఈ కథనం చేసిన  పని. ఇలాంటి సినిమాలు నిజంగా ద‌ర్శ‌కుడికి అదే పెద్ద టాస్క్‌. ఈ సినిమా వ‌ర‌కూ ఇవ‌న్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. నిజానికి  క‌థ‌, స్క్రీన్ ప్లే అందించిన ర‌చ‌యిత‌కు ఈ మార్కుల‌న్నీ ప‌డిపోతాయి. అలాగే ఈ సినిమాలో చేసిన వెట్రి సీనియర్ కాదు. ఒకటో రెండో సినిమాలు చేసిన కొత్తవాడు. అతనికి క‌చ్చితంగా ఇది కొత్త త‌ర‌హా పాత్రే. త‌ను సిన్సియ‌ర్ ఎఫెర్ట్ పెట్టాడు.  పాట‌లు, ఫైటింగులు పెట్టుకోకుండా… క‌థ‌ని ఫాలో అయ్యాడు. అదే కలిసొచ్చింది.  కె. ఎస్. సుందర మూర్తి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి.  ప్రవీణ్‌ కె.ఎల్‌. ఎడిటింగ్‌ ఫరవాలేదు.    

చూడచ్చా:

థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడే వారికే మాత్రమే నచ్చే సినిమా ‘జీవి’
 
ఎవరెవరు…

నటీనటులు: వెట్రి, కరుణాకరన్‌, మోనికా, అనిల్‌ మురళి, టైగర్‌ గార్డెన్‌ తంగదురై, రోహిణి, మిమి గోపి, బోస్కీ తదితరులు;
సంగీతం: కె.ఎస్‌.సుందర మూర్తి;
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ కుమార్‌;
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌;
నిర్మాత: ఎం.వెల్లపాండియన్‌, సుధాలాయికన్‌ వెల్ల పాండియన్‌, సుబ్రమణియన్‌;
రచన: బాబు తమిళ‌;
దర్శకత్వం: వి.జె.గోపీనాథ్‌;
ఓటీటి: ఆహా
విడుదల తేదీ: 25,జూన్ 2021
రన్ టైమ్:1గం|| 54ని||