కేదార్‌నాథ్‌ మూవీ రివ్యూ

Published On: December 7, 2018   |   Posted By:

‘టైటానిక్’ కు ఇంకో ఆర్డర్ ! (‘కేదార్‌నాథ్‌’ రివ్యూ)

Rating:-2/5

కేదార్ నాథ్ వరదల గురించి విన్నప్పుడు, ఆ విజువల్స్ చూసినప్పుడు …అరే భలే ఉన్నాయే..ఇలాంటి విజువల్స్ ని రీక్రియేట్ చేస్తూ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. మరో టైటానిక్ అయ్యిపోదూ అనిపిస్తుంది. అదే ఆలచోన ఓ బాలీవుడ్ డైరక్టర్ కు వచ్చింది. వెంటనే టైటానిక్ సినిమా దగ్గరపెట్టుకుని ఎనభైల్లో వచ్చి తనకు నచ్చిన ఓ లవ్ స్టోరీని దగ్గరపెట్టుకుని మెల్లిగా కలపటం మొదలెట్టాడు. అంతే కేదార్ నాథ్ రెడీ అయ్యిపోయింది. కేదార్ నాథ్ లో దేవుడు సంగతి ఎలాగున్నా…తను ప్రేక్షక దేవుళ్లను మెప్పించ గలను అనుకున్నాడు. అందులో తప్పు కూడా ఏమీ లేదు. అయితే టైటానిక్ వేరు..కేదార్ నాథ్ వేరు అని తెలిసికోకపోతే వచ్చే సమస్య అంతా.. అప్పట్లో టైటానిక్ మునిగిపోయి..సినిమాని నిలబెట్టింది. ఇప్పుడు కేదారినాథ్ కు కూడా అలాంటి మ్యాజికే జరుగిందా…లేక వరదల్లో కొట్టుకుపోయిందా..రివ్యూలో చూద్దాం.

కథ ఇదే..

హిందువులకు అతి పవిత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయ పండితుల్లో ఒకరైన (నితీశ్‌ భరద్వాజ్‌) కుమార్తె
మందాకిని (సారా అలీ ఖాన్‌) . ఆమె ఇదే ప్రాంతానికి చెందిన మన్సూర్‌ ఖాన్ (సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌) అనే ముస్లిం కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ప్రేమలో పడేటప్పటికే మందాకినికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఏం చేయాలా అనే డైలమోలో ఉండగానే…వీరి లవ్ స్టోరీ ఆమె తండ్రికి తెలిసిపోతుంది.

ముస్లిం కుర్రాడిని ప్రేమించి హిందువుల సంప్రదాయాలు దెబ్బతీసిందంటూ వారిని విడదీస్తారు. దాంతో మందాకిని తన ప్రేమను బతికించుకోవడం కోసం జపం చేస్తానంటుంది. అదే సమయంలో కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తుతాయి. ఇలాంటి సిట్యువేషన్ లో మందాకిని తన ప్రేమను బతికించుకుందా? ఆమె చేసిన జపం ఫలించిందా? తదితర విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది.

ఎలా ఉంది

అప్పట్లో వచ్చిన టైటానిక్ సినిమా చూసి దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు. ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. అక్కడ టైటానిక్ లో డబ్బున్న అమ్మాయి..పేద కుర్రాడు కథని..డబ్బున్న హిందూ అమ్మాయి, పేద ముస్లిం కుర్రాడి కథగా మార్చి,దానికి కేధారినాథ్ వరదలను కలిపే ప్రయత్నం చేసాడు. అక్కడ టైటానిక్ మునిగిపోవటం అనే ఎలిమెంట్ ..ఇక్కడ కేధారినాధ్ వరదలుగా డిజైన్ చేసుకున్నాడు. దాంతో ఈ చిత్రం కథ ఎక్కడా కొత్తగా అనిపించదు. ఎప్పుడో గత జన్మలో చూసేసిన సినిమాని మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

దానికి తోడు ఈ కాలం లో జరగాల్సిన కథ ఏదో ఎనభైల్లో జరుగుతున్న ఫీల్ తీసుకువస్తాడు దర్శకుడు. ఆ డైరక్టర్ విజువల్స్ అన్నీ అమోల్ పాలేకర్ కాలంలో ఆగిపోయాయి. మేకింగ్ సైతం సోసో గా నార్మల్ గా ఉంది.

టెక్నికల్ గా

ఇలాంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం. కానీ ఆ విషయం డైరక్టర్ మర్చిపోయినట్లున్నారు. తమ దగ్గర ఉన్న పాయింట్ ని టైటానిక్ ఫార్మెట్ లో పెట్టుకోవటంలో ఉన్న శ్రద్ద ఈ విషయంలో పెట్టలేకపోయాడు. మిగతా డిపార్టమెంట్ లలో కెమెరా వర్క్ బాగుంది. మంచి విజువల్స్ ని పట్టుకున్నాడు.

సారా కు కలిసొస్తుందా

ఈ సినిమా ద్వారా సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ పరిచయం అయ్యింది. ఆమెకు ఈ చిత్రం కేవలం ఓ షో రీల్ గా తప్ప దేనికి పనికి రాదు. అప్పట్లో ఆమె తల్లి అమృతా సింగ్ ..బేతాబ్ సినిమాలో పరిచయం అయ్యిన పేద-ధనిక భేధం కథే ఇప్పుడు ఎంచుకుని హిచ్ కొడదామనుకోవటం అత్యాశే. అలాంటి కథలుకు కాలం చెల్లింది. అయినా భ్రమ తీరక అలాంటి కథే తీయాలంటే సైరట్ లాంటి వాస్తవికతో ముడిపెట్టిన కథనే చేయాలి తప్ప వేరే దారి లేదు.

బ్యాన్ చెయ్యాల్సిన అవసరం ఉందా

మతపరమైన భావోద్వేగాలను కించపరిచే విధంగా ఉందని..ఈ చిత్రాన్ని పున: పరిశీలించాలని పిటిషనర్లు సీబీఎఫ్‌సీని కోరారు ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని, విడుదలను నిలిపివేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కానీ ఈ సినిమాకు ఆపాలంటే అంత అవసరం లేదు. డైరక్టరే ఆ పని సమర్దవంతంగా చేసేసాడు.

అదీ సంగతి

ఇలాంటి కథలను స్క్రీన్ ప్లే భాషలో.. డిజాస్టర్ జానర్ ఫిలింస్ అంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఓ డిజాస్టర్ సినిమా చూసినట్లే అనిపిస్తుంది. అంటే జానర్ కు న్యాయం చేసారన్నమాట. శభాషో శభాష్.

నటీనటులు: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్‌, నితీశ్‌ భరద్వాజ్‌, అల్కా అమీన్‌, సోనాలి సచ్‌దేవ్‌, పూజా గోర్‌, నిషాంత్‌ దాహియా తదితరులు

సంగీతం: అమిత్‌ త్రివేది

సినిమాటోగ్రఫీ: తుషార్‌ కాంతి రాయ్‌

కూర్పు: చందన్‌ అరోరా

నిర్మాణ సంస్థ: ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌, గయ్‌ ఇన్‌ ది స్కై పిక్చర్స్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్‌ కపూర్‌

విడుదల తేదీ: 07-12-2018