Reading Time: 2 mins

డియర్ మేఘా మూవీ రివ్యూ

వర్షించని మేఘం: ‘డియర్ మేఘా’ రివ్యూ
Rating: 2.5/5
ఒక హీరోయిన్ పేరుతో సినిమా టైటిల్ పెట్టడం అంటే ఆమె క్రేజ్ పై నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో అంచనా వేయచ్చు. రీసెంట్ గా విడుదలైన ‘రాజ రాజ చోర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది మేఘా ఆకాశ్ తాజా చిత్రం ఇది. అలాగే తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్ర పోషించిన అరుణ్ అదిత్ హీరోగా చేసిన సినిమా. వీరిద్దరితో కాంబినేషన్ లో రూపొందిన ముక్కోణ ప్రేమకథా చిత్రం ఈ వారం విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది. అసలు ఏమి ఉందని ఈ ప్రాజెక్టుకు ఇంత క్రేజ్ వచ్చింది. కథేంటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

 బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ మేఘ (మేఘా ఆకాశ్) తమ కాలేజీ సీనియర్ అర్జున్ (అర్జున్ సోమయాజుల)తో ప్రేమలో పడుతుంది. అయితే ఆమెది వన్ సైడ్ లవ్. ఎన్నో సార్లు తన మనస్సులో మాట చెప్పాలనుకుంటుంది కానీ ధైర్యం చాలక చెప్పలేదు. ఈ లోగా అర్జున్ కు సింగపూర్ లో జాబ్ వచ్చి చదువును అర్థాంతరంగా ఆపేసి వెళ్ళిపోతాడు. కానీ మూడేళ్ళ తర్వాత ముంబైలో తిరిగి మేఘకు కనపడి తాను మేఘను ప్రేమిస్తున్నట్టు చెబుతాడు. ఆమె సంతోషపడుతుంది. కానీ ఆ సంతోషం ఎంతోకాలం ఉండదు. తర్వాత రోడ్డు యాక్సిడెంట్ తో అర్జున్ తిరిగి మేఘ జీవితంలోంచి ఎలా నిష్క్రమిస్తాడు? ఆ డిప్రెషన్ లో ఉండి సూసైడ్ ఎటెమ్ట్ చేసిన కు ఆమెకు ఆది (అరుణ్ అదిత్) పరిచయమవుతాడు. ఈ ప్రేమ జీవితం కాస్త ముందుకు వెళ్లగానే అర్జున్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. ఈ ట్విస్టెడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది? ఎవరితో మేఘ తన జీవిత పంచుకుంది అనేది మిగతా కథ.
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …

గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన కన్నడ చిత్రం ‘దియా’కు రీమేక్. గతంలో ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ అనే మూవీని డైరెక్ట్ చేసిన సుశాంత్ రెడ్డికి ఇది సెకండ్ మూవీ. ఇలాంటి కథలు తెలుగు తెర అనేక సార్లు చూసిందే. కొత్తదన అయిత ఏమీ లేదు. కన్నడ వాళ్లు ఇలాంటి ప్రేమ కథలను ఎలా చూసారో కానీ తెలుగులో మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ట్విస్ట్ లుగా బాగా అనిపించే ఈ ప్రేమకథలో ఫీల్ అయితే మిస్సైంది. ఏదో టీవి సీరియల్ ని తెరపై చూస్తున్నట్లు అనిపిస్తుంది. దానికి తోడు బాగా స్లో నేరేషన్. డబ్బింగ్ చేసి వదిలితే సరిపోయే సినిమా ఇది. ఈ రోజుల్లో ఇలాంటి కథను రీమేక్ చేయటం సాహసమే. కన్నడంలో హిట్టవటానికి రకరకాల రీజన్స్ ఉండచ్చు.

కానీ తెలుగులో హిట్ అవ్వాలంటే ఒకే ఒక రీజన్ కథ బాగుండాలి ఇలాంటి సినిమాలకు. ఎందుకంటే ఈ కథను మోసే స్టార్ లేడు. కేవలం స్టార్ గా అనిపించే హీరోయిన్ మాత్రమే ఉంది. ఆమె అభిమానులు కూడా ఈ బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే ని భరించటం కష్టమే అనిపిస్తుంది. ఒరిజలన్ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు మంచి ప్రాధాన్యం ఉంది.తెలుగులోనూ అదే కాస్తంత ఉన్నంతలో హృదయానికి హత్తుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అలా అలా నడిచిపోతుంది. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చే సరికి తట్టుకోలేనిహెవీ డ్రామాగా మారిపోతుంది. ఇక క్లయిమాక్స్ లో అయితే… దారణం అనిపిస్తుంది. ఓ రకంగా భారమైన హృదయంతో జనం థియేటర్ల నుండి బయటకు రావాలని దర్శకుడు ఐడియా కానీ ఓ రకమైన విసుగుతో బయిటకు వస్తాం. ఇలాంటి కథలకు ఎంత గొప్ప స్క్రీన్ ప్లే రాసినా గెలవటం కష్టమే.

టెక్నికల్ గా…
స్క్రిప్టే  బోర్ గా అనిపించటంతో మిగతా విభాగాలేమీ అంత గొప్పగా అనిపించవు. ఇలాంటి ప్రేమ కథా  సినిమాలకు అవసరమైన సంగీతం, సినిమాటోగ్రఫీ మాత్రం బాగా కుదిరింది. హరి గౌర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఐ అండ్రూ  క్లోజప్ సీన్స్ సైతం చాలా అందంగా చూపించారు. దాంతో మూవీకి విజువల్ రిచ్ రెస్ వచ్చింది. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్ ఓకే.  నిర్మాత అర్జున్ దాస్యన్ చిత్ర ప్రొడత్రన్ వాల్యూస్ బాగగున్నాయి. ఏ విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదని అర్థమౌతుంది. అయితే… కొత్తదనం లేని ఈ సినిమాను ఎంత టెక్నికల్ విజన్ ఉంటే మాత్రం కలిసొచ్చేదేముంటుంది.  

నటీనటుల్లో మేఘ ఎమోషన్స్ ను బాగా పండించి తన పాత్రకు ప్రాణం పోసింది. తనలోని అంతర్గత సంఘర్షణను తెరపై అలవోకగా ఆవిష్కరించింది. ఆది పాత్రలో అరుణ్ అదిత్ బాగా చేసాడు.  అర్జున్ సోమయాజులు జస్ట్ ఓకే. లక్కీ పాత్రలో నటించిన పవిత్ర లోకేష్ తల్లి పాత్రలో కన్నడంలో చేసిన పాత్రనే రిపీట్ చేసారు.

చూడచ్చా
హెవీ డోస్ ఉన్న సెంటిమెంట్ లవ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

తెర వెనక…ముందు
న‌టీన‌టులు: మేఘా ఆకాష్‌, అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు, ప‌విత్ర లోకేష్ తదితరులు
సంగీతం: హ‌రి గౌర;
 సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ;
నిర్మాత‌: అర్జున్ దాస్య‌న్‌;
 ద‌ర్శ‌క‌త్వం: ఎ.సుశాంత్ రెడ్డి;
రన్ టైమ్: 2 గంటల 1 నిముషం
విడుద‌ల తేదీ: 03-09-2021