డిస్కోరాజ మూవీ రివ్యూ

Published On: January 23, 2020   |   Posted By:

డిస్కోరాజ మూవీ రివ్యూ

డిస్క్ మార్చు రాజా…!( `డిస్కోరాజా`రివ్యూ)
Rating:2.5/5

 మనం చూడని ఒక కొత్త కాలానికి తీకుకెళ్లి, ఊహించని కొత్తలోకాన్ని పరిచయం చేస్తూ ఊహాత్మక ప్రపంచానికి  కేరాఫ్ ఎడ్రస్ గా ఉండేవి సైన్స్ ఫిక్షన్ సినిమాలు.వీటి ద్వారా ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. ఇక  తెలుగులో మొదటి నుంచీ సాహిత్యపరంగానూ, సినిమాల పరంగానూ సైన్స్ ఫిక్షన్ కు ఆదరణ తక్కువే. ఆ తరహా కథాంశాలను స్పృశించేవారు తక్కువే. కొద్దో గొప్పో తమిళ డబ్బింగ్ లు ఆ లోటు తీరుస్తున్నాయి .అయితే ఈ మధ్యన  కొంతమంది కొత్త దర్శకుల దృష్టి ఈ జానర్ పై పడింది. ఆ మధ్యన అంతరిక్షం అంటూ ఓ సినిమా వస్తే …ఇప్పుడు మళ్లీ మరో సైన్స్ ఫిక్షన్ కథతో ఓ పెద్ద హీరో సినిమా వచ్చింది. హాలీవుడ్ కే పరిమితమవుతున్న సైన్స్ ఫిక్షన్ …మన తెలుగులోనూ మెల్లిగా నిలదొక్కుకునే పరిస్దితులు ఈ సినిమా కల్పిస్తుందా. ఈ సినిమా కథేంటి…ఇందులో ఉన్న సైన్స్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

స్టోరీ లైన్
కిడ్నాప్ కు గురైన వాసు (ర‌వితేజ‌) గురించి అతనికి సంభందించిన వారు సెర్చ్ చేస్తూంటారు. ఈ లోగా లద్దాఖ్‌  మంచు కొండ‌ల్లో గ‌డ్డక‌ట్టుకుపోయిన రవితేజ ఓ మృత‌దేహం ట్రెక్కింగ్ టీమ్ కు  దొరుకుతుంది. దానిని సొంతం చేసుకున్న మెడికల్ రీసెర్చ్ కంపెనీకి  చెందిన సైంటిస్ట్ లు తమ ప్రయోగాలతో ప్రాణం పోస్తారు. ప్రాణం వచ్చినప్పటికీ మెమరీ ని మిస్ అవుతాడు. దాంతో అతనెవరు అనేది ఎవరికీ తెలియదు. తానెవరో తెలుసుకోవటం కోసం ల్యాబ్ నుంచి తప్పించుకుని కావాలనే ఓ ఎంపితో గొడవపడి,వైరల్ అవుతాడు. ఈ క్రమంలో అతని కుటుంబం కన్నా ముందు బ‌ర్మాసేతు(బాబీ సింహా) గ్యాంగ్‌ దృష్టిలో పడతారు. అతను డిస్కోరాజ్ అని కన్ఫర్మ్ చేసుకున్న వాళ్లు అతన్ని చంపేయటానికి సిద్దపడతారు. ఎప్పుడో 1980ల్లో చనిపోయిన డిస్కోరాజ్ అతనేనా, మరి వాసు ఏమైనట్లు, ఇద్దరికి ఒకే పోలికలు యాదృచ్చికమా, బర్మా సేతుకు, డిస్కోరాజా  కు మధ్య వైరం ఏమిటి…వంటి  విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


కథ,స్క్రీన్ ప్లే ఎలా ఉంది..

కథ బాగుంటే ఎన్ని డిస్కోలు చేసినా ..రాజా అనిపించుకుంటాం. అయితే ఆ కథ అనే డిస్కో దగ్గరే చాలా మంది తడబడేది. అయితే దర్శకుడు సైన్స్ ఫిక్షన్ అంటూ కథ వైపు మన దృష్టి పడకుండా మేనేజ్ చేద్దామనుకున్నాడు. కానీ దొరికిపోయాడు.

సైన్స్ ఫిక్షన్ కథ అంటే ఏవేవో ఎక్సపెక్ట్ చేస్తాం. అంత సీన్ ఈ సినిమాకు లేదని మనకి విలన్ ఎప్పుడైతే సీన్ లోకి వస్తాడో అప్పుడే అర్దమైపోతుంది. సర్లే విలన్,హీరో, పగ,ప్రతీకారం కథ కదా అని చూద్దామంటే ఆ విలనీని సైతం రొట్టకొట్టుడుగా మార్చేసారు. దాంతో ఆ ట్రాక్ పెద్దగా ఇంట్రస్ట్ లేకుండా పోతుంది. మరి సినిమాలో ఏముందయ్యా అంటే …1980ల్లో జరిగే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్..దాన్ని రెట్రో గా డిజైన్ చేసారు. కంటెంట్ ఎలా ఉన్నా ఆ కాలానికి వెళ్లేలా చేయటం మంచి ఎక్సపీరియన్స్.

అలాగే ఈ కథని స్టైయిట్ గా చెప్పకుండా సైంటిస్ట్ లు,ప్రయోగం, డిస్కోరాజా, వాసు అంటూ రెండు పాత్రలు ఇలా స్క్రీన్ ప్లే కాస్త ఇంట్రస్ట్ గా మొదలెట్టారు. అంతవరకూ అంతాబాగానే ఉంది..ఎప్పుడైతే విలన్ కు,హీరోకు మధ్య వార్ అని కథ అర్దమైందో..ప్లాష్ బ్యాక్ రివీల్ అయ్యాక..ఇది సైన్స్ ఫిక్షన్ కాదని, ఆ తోలు కప్పుకున్న పాత రివేంజ్ స్టోరీనే అని తెలిసిపోతుంది. దాంతో సినిమాపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. అదేదో ఇది మామూలు యాక్షన్ సినిమాగా చెప్తే కాదన్నదెవరు..ఇలా ఛీటింగ్ చేయాలా అనిపిస్తుంది.దాంతో క్లైమాక్స్ ట్విస్ట్ బాగా పండినా, సోసో గా నిట్టూరుస్తూ థియోటర్ నుంచి బయిటకు వస్తాం.

రవితేజ రచ్చ చేసాడు కానీ…

ఈ సినిమాలో రవితేజ నటనకు, ఎనర్జీకు ఎక్కడా వంక పెట్టలేం. తన శాయశక్తులా పాత్రలో ఒదిగిపోయి చేసాడు. డాన్ రాజా గానూ దుమ్ము రేపాడు. కాకపోతే అతనికి కథే సహకరించలేదు. అంతేకాదు తన కామెడీ టైమింగ్ కు తగ్గ సీన్స్ కూడా పడలేదు. సునీల్, వెన్నెల కిషోర్ వంటివాళ్ల సాయిం ఉన్నా జస్ట్ ఓకే అనిపిస్తుంది కామెడీ.

ఇక డైరక్టర్ తెలివి తేటలు  బాబీ సింహా ని ఈ సినిమాకు ఎంచుకోవటం లో కనిపిస్తుంది. బ‌ర్మా సేతుగా ఆ పాత్రకి ప్రాణం పోశాడు. అయితే ఆ విలనిజం ఎలివేట్ చేసే సీన్స్ ని అల్లు కోలేదు. ఇక పాయ‌ల్ రాజ్‌పుత్ పాత‌కాలంనాటి లుక్‌లో బాగుంది. న‌భా న‌టేష్ కు చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఏదో అలా పాటల్లో వచ్చి వెళ్లిపోవటమే.

టెక్నికల్ గా ..
 కార్తీక్ ఘ‌ట్టమ‌నేని కెమెరా వర్క్ సినిమాకు పెద్ద హైలెట్.  త‌మ‌న్ రీరికార్డింగ్, రెండు పాటలు బాగా ప్లస్ అయ్యాయి. ఆర్ట్ డిపార్టమెంట్, కాస్ట్యూమ్స్ ..ఎనభైల్లోకి మనని తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యాయి. ద‌ర్శకుడు వి.ఐ.ఆనంద్ కొత్తదన కోసం ట్రై చేసాడు కానీ పాతదనం పొత్తిళ్లలోనే బొజ్జున్నాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ..రవితేజ గత సినిమాల్లో లాగానే రిచ్ గా ఉన్నాయి. ‘మన వాళ్లు కలలు నిజం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక కలలపై బుక్స్‌ ఎలా రాస్తారు వంటి చమక్కులు అబ్బూరి రవి కలం నుంచి అప్పుడప్పుడూ జాలువారాయి.

చూడచ్చా
సైన్స్ ఫిక్షన్ అని ఆవేశపడి థియోటర్ కు వెళ్తే నిరాశే. అలా కాకుండా ఓ మామూలు రవితేజ సినిమాగా చూస్తే బాగుందనిపిస్తుంది.

తెర వెనక..ముందు
న‌టీన‌టులు: ర‌వితేజ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్, తాన్య హోప్‌, బాబీ సింహా, రాంకీ, సునీల్‌, న‌రేష్, స‌త్య‌, గిరిబాబు, అన్నపూర్ణమ్మ త‌దిత‌రులు.
ఛాయాగ్రహ‌ణం: కార్తీక్ ఘ‌ట్టమ‌నేని
మాట‌లు: అబ్బూరి ర‌వి
స‌ంగీతం: త‌మ‌న్‌
నిర్మాత‌: రామ్ తాళ్లూరి
ద‌ర్శక‌త్వం: వి.ఐ.ఆనంద్
సంస్థ‌: ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల‌: 24 జ‌న‌వ‌రి 2020