తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విలేఖరుల సమావేశం
జీవోనెం120ని స్వాగతిస్తున్నాం – తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రసిడెంట్ సునిల్ నారంగ్
సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రసిడెంట్ సునిల్ నారంగ్ (ఏషియన్ సునిల్). ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ – “చిన్న సినిమాలు 50 -150 రూపాయల వరకూ టికేట్ రేటుకి అమ్ముకోవచ్చు. నిర్మాతలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అధిక దరలకు టికెట్లు విక్రయించకూడదు. ఈ రోజు కొన్ని థియేటర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మడం మా దృష్టికి వచ్చింది. మేం వెంటనే స్పందించి ఆ రేట్లను సవరించి మిగతా డబ్బుని వారి ఎకౌంట్స్‌కి రీఫండ్ చేయడం జరిగింది. మాకు ప్రేక్షకుల సౌకర్యాలే ముఖ్యం. ప్రస్తుతం నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఈ విధానం గురించి అవగాహన కలిపిస్తున్నాం. మీడియా సహకారంతో ఈ జీవోపై మరింత మందికి అవగాహన వస్తుందని నమ్ముతున్నాం. కొన్ని థియేటర్స్ క్యాంటిన్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని కూడా సవరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం“ అన్నారు.
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ – “గవర్నమెంట్ ఇటీవల జీవో నెం 120ని విడుదలచేసింది. ప్రతి ఒక్క సినిమాకు లాభం జరగాలి అనేదే దాని సారాంశం. అందులో మినిమం, మ్యాగ్జిమం రేట్లను నిర్ణయించారు. చిన్న సినిమాలు మినిమం రేట్లకు, మీడియం సినిమాలు మొదటి వారం రోజులు మ్యాగ్జిమం రేట్లకు అమ్మాలి తర్వాత మినిమం రేటుకు అమ్మాలి. పెద్ద సినిమాలు మొదటి రెండు వారాలు మ్యాగ్జిమం తర్వాత మినిమం రేట్లకు అమ్మాలి ఈ రేట్లు అన్ని పన్నులతో సహా ఉంటాయి“ అన్నారు.
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రసిడెంట్ బాలగోవింద్ రాజ్ మాట్లాడుతూ – “జీవో120 అనేది అందరూ ఆహ్వానించదగినది. గత ఐదారు సంవత్సరాలుగా ఇవే రేట్లు మేము కోర్టు ద్వారా తెచ్చుకోవడం జరిగింది. ఈ జీవోను తప్పకుండా పాటించే విధంగా ఛాంబర్ నిర్ణయం తీసుకుంటుంది“ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.