దిల్‌రాజు 20 ఏళ్ల జర్నీ ప్రెస్‌మీట్
సినీరంగంలో డిస్ట్రిబ్యూటర్స్‌గా, నిర్మాతలుగా 20 ఏళ్ల జర్నీని పూర్తి చేశాం.. మరో కొత్త ప్రయాణానికి స్వీకారం చుట్టడం ఆనందంగా ఉంది : హిట్ చిత్రాల నిర్మాత
శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూటర్స్‌గా, నిర్మాతలుగాఎన్నో విజయవంతమైన వాణిజ్య, కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్. సామాన్య ప్రేక్షకుడి నాడిని పట్టిన ఈ ముగ్గురు అసలు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలనే దానిపై ఓ అవగాహన ఏర్పరుచుకుని ఒక వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూనే నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టారు. కథలపై పక్కా జడ్జ్మెంట్, మిస్ ఫైర్ కానీ ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్‌తో నిర్మాణ రంగంలోనూ తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు. వీరి బ్యానర్లో ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుడు మంచి సినిమా చూస్తామని థియేటర్లోకి అడుగుపెట్టేంత నమ్మకాన్ని సంపాదించుకున్నారు. వీరు డిస్ట్రిబ్యూటర్స్‌గా, నిర్మాతలుగా సినీ జర్నీని ప్రారంభించి నేటి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో …
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యానర్ ప్రయాణం 1999లో `ఒకే ఒక్కడు`తో ప్రారంభమైంది. దానికి ముందు జూలై 24న `తొలిప్రేమ` చిత్రాన్ని పార్ట్నర్ షిప్లో రిలీజ్ చేశాం. పవన్‌కల్యాణ్‌గారిని స్టార్‌ను చేసిన ఆ సినిమా అనుభవం గొప్పగా అనిపించింది. అలాగే పెళ్లిపందిరి సినిమా నిర్మాతగా నేను ఇక్కడ ఉండటానికి కారణమైంది. అప్పుడు మాకు అండగా నిలిచిన నిర్మాతలకు థాంక్స్. అలాగే మా డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాతలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూషన్ నుండి ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేశాం. తర్వాత ప్రొడక్షన్‌ను పెంచి 16 ఏళ్లలో 32 సినిమాలు పూర్తయ్యాయి. ఈ గ్రేట్ జర్నీ అని చెప్పగలను. ఈ 20 ఏళ్లలో మాకు వచ్చిన ఎక్స్‌పీరియెన్స్‌ను స్ప్రెడ్ చేయాలనే ఆలోనలో ఉన్నాం. ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్క్రిప్ట్ దగ్గరి నుండి రిలీజ్ వరకు ఎన్నో అంశాలుంటాయి. 2017లో మా సంస్థలో 6 సినిమాలు చేశాం. 2018లో 3 సినిమాలు, 2019లో కూడా నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక్కడితో అగకుండా నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలనుకుంటున్నాం. అందులో భాగంగా అప్‌కమింగ్ ప్రొడ్యూసర్స్‌కు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగా, ఇక నుండి అందరూ నిర్మాతలు వారు తీసే సినిమాల్లో స్క్రిప్ట్ దగ్గర నుండి రిలీజ్ వరకు మా బ్యానర్‌తో అసోసియేట్ అయ్యుంటారు. మా సంస్థలో వస్తున్న మంచి సినిమాల్లాగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషిగా సపోర్ట్ చేయబోతున్నాం. వీళ్లే కాకుండా మంచి స్క్రిప్ట్‌తో వచ్చే నిర్మాతలకు ఆహ్వానమే. ఇది కొత్త ప్రయాణం. ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం“ అన్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు వేర్వేరు రంగాల నుండి సినిమా రంగంలోకి 20 సంవత్సరాల ముందు అడుగుపెట్టారు. సినిమా మీద పిచ్చితో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి ముందు డబ్బులు పొగొట్టుకుని, ఇళ్లలో తిట్టు తిని, మళ్లీ భూములు అమ్ముకుని ఆ డబ్బుల తెచ్చి ఇన్వెస్ట్ చేసి ప్రయాణాన్ని మొదలు పెట్టారు. 20 ఏళ్లలో నేను వాళ్లతో 18ఏళ్లుగా టచ్‌లోనే ఉన్నాను. ఈ బ్యానర్లో నేను నాలుగు సినిమాలు చేయడం నాకు మరచిపోలేని జ్ఞాపకం. ప్రేక్షకులకు ఏం కావాలనే విషయాన్ని ఈ ముగ్గురు నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ స్టేజ్‌లోనే తెలుసుకున్నారు. ఇది నా మాతృ సంస్థ అని గర్వంగా చెప్పుకుంటాను. నాకు డైరెక్టర్‌గా జన్మనిచ్చారు. ఫస్ట్ సినిమా సరిగా ఆడకపోయినా అదే నమ్మకంతో మరో సినిమాకు అవకాశాన్ని ఇచ్చారు. ఈ 20 ఏళ్ల జర్నీ పూర్తయిన సందర్భంగా వీళ్లు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం. ఈ బ్యానర్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నాలాంటి ఎంతో మంది దర్శకులు నిలదొక్కుకుంటారు. న్యూ జర్నీకి అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
డైరెక్టర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ – “దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారి 20 ఏళ్ల జర్నీకి కంగ్రాట్స్. ఇప్పుడు కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు దానికి ఆల్ ది బెస్ట్. ఈ ప్రయాణంలో నేను కూడా భాగమై ఉన్నాను. ప్రతి సినిమాకు వాళ్లు నాకు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. వారి కారణంగానే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సక్సెస్ వాళ్లతో ఉండాలని కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారి జడ్జ్మెంట్, శిరీష్‌గారి ప్లానింగ్, లక్ష్మణ్‌గారి ఎగ్జిక్యూషన్ కారణంగానే వారికి ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉంది. సక్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఈ కార్యక్రమంలో శివలెంక కృష్ణ ప్రసాద్, హరి, మహేశ్ కొనేరు, వేణుగోపాల్, సాగర్, రాహుల్ యాదవ్ నక్కా, విజయ్ చిల్లా, రాజీవ్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.