ది హ్యుమానిటీ 30 నిమిషాల నిడివి గల ఇండిపెండెంట్ ఫిల్మ్
మతం కంటే మానవత్వం మిన్న – ‘ది హ్యుమానిటీ’ డైరెక్టర్
సయ్యద్ హుస్సేన్
‘మన సమాజానికి కావాల్సింది మతం కాదు మానవత్వం’ అనే అంశాన్ని తీసుకుని… అత్యున్నత ప్రమాణాలతో ‘ది హ్యుమానిటీ’ టైటిల్ తో 30 నిమిషాల నిడివి గల ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించారు యువ ప్రతిభాశాలి సయ్యద్ హుస్సేన్. ‘పైసా-పొట్టి-ప్రాబ్లెమ్, దావత్ ఏ షాది, సలామ్ జిందగి’ వంటి సూపర్ హిట్ డెక్కన్ చిత్రాలతో తన ప్రతిభను ఘనంగా నిరూపించుకొని- హిందీలో రెండు భారీ చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్న సయ్యద్ హుస్సేన్.. ‘ది హ్యుమానిటీ’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో ఉరూసా రహీంతో కలిసి తెరకెక్కించారు.
హీనా షేక్, చారు కదరియా, నరేందర్ శర్మ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వెల్లూరు మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. అష్ఫాకుద్దీన్-నిసార్ అక్తర్ లతో కలిసి ఈ ఫిల్మ్ కు రచన చేసిన హుస్సేన్.. ఇందులో ఒక పాత్ర కూడా పోషించడం కూడా గమనార్హం. హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ లలో భారీ బడ్జెట్ తో తెలుగు-డెక్కనీ-హిందీ భాషల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం.. రైలు ప్రమాదంలో అనాధగా మారిన ఓ ముస్లిం బాలికకు ఆశ్రయం కల్పించడం కోసం.. జర్నలిస్ట్ గా పని చేసే ఓ బ్రాహ్మణ యువతి చేసిన పోరాటం నేపథ్యంలో నడుస్తుంది. ‘ముస్లిం అమ్మాయి మనింట్లో ఉండడానికి వీల్లేదనడమే కాకుండా తనపై చేయి చేసుకున్న భర్తతో పాటు.. అతనికి వత్తాసు పలికిన అత్తమామలు.. చివరికి ముస్లిం బాలికను హృదయాలకు హత్తుకోవడం వెనుక గల హృద్యమైన కథేంటో తెలియాలంటే… ‘ది హ్యుమానిటీ’ చూడాల్సిందే’ అంటున్నారు దర్శక నిర్మాత మరియు నటుడు అయిన బహుముఖ ప్రతిభాశాలి సయ్యద్ హుస్సేన్.
పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ‘ది హ్యుమానిటీ’ ఎంపిక కావడం గర్వంగా ఉందని, త్వరలోనే తెలుగు-డెక్కన్-హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సయ్యద్ హుస్సేన్ తెలిపారు.