నందమూరి రామకృష్ణ నిర్ణయం

Published On: May 28, 2021   |   Posted By:
నందమూరి రామకృష్ణ నిర్ణయం
 
అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం: నందమూరి రామకృష్ణ
 
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి మే 28. అన్నగారి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఎంతో మంది ఎన్టీయార్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించడం ఆనవాయితీ.
 
అయితే ఈ సారి కరోనా మహమ్మారి దృష్ట్యా నాన్నగారి ఘాట్ వద్దకు వెళ్లలేకపోతున్నామని ఆయన తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ చెప్పారు. ‘‘ఈ రోజు నాన్నగారి 98వ జయంతి. ప్రతిసారీ ఆయన ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. అయితే ఈసారి కరోనా తీవ్రత వల్ల వెళ్లలేకపోతున్నాం. ఇది ఆయన అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా, ధైర్యంగా ఉండండి. ఇక నాన్నగారి గురించి మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడినా తనివితీరదు. ఆయన గురించి రెండు మాటల్లో చెప్పాలంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ. నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహాపురుషులవుతారు అనే మాటను ఆయన నిజం చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు కానీ వారి రూపాల్లో మనందరినీ అలరించి మనకు దేవుడయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారు. యవత్ తెలుగు ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారిదే. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత ఆయనదే. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఆయనే. ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే. ఆ యుగపురుషుడిని అందరూ ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలని నందమూరి అభిమానులకు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తున్నా. జోహార్ ఎన్టీయార్, జై తెలుగు తల్లి, జోహార్ హరికృష్ణ’’ అని అన్నారు  నందమూరి రామకృష్ణ .