నర్మద`చిత్రం షూటింగ్ ప్రారంభం
జెమిని, సౌమిక _ సంహిత్ సిల్వర్ స్క్రీన్స్ బేనర్స్ పై మోహన్ వడ్లపట్ల సమర్పణలో డా.ఎమ్ ఆర్ సి చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నర్మద`.
ఈ చిత్రంతో శుభాకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. జో శర్మ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఫిలించాంబర్ లో లాంఛనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సమర్పకుడు మోహన్ వడ్లపట్ల క్లాప్ కొట్టగా నటుడు కాదంబర్ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. జెమిని రమేష్, పద్మిని నాగవల్లి, రమ్య శ్రీ, పూజిత తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎమ్ ఆర్ సి చౌదరి మాట్లాడుతూ…“దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నేను, ఆళ్ల రాఘవ, జెమిని వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాం. అమెరికాలో పలు చిత్రాల్లో నటించిన జో శర్మ `నర్మద` టైటిల్ పాత్రలో నటిస్తోంది. ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించాక జో శర్మ అయితే మా సినిమాలో పాత్రకు పర్ఫెక్ట్ అని ఆమెను తీసుకున్నాం. నర్మదా అనే అమ్మాయి తన ఊరిలో జరుగుతోన్న అన్యాయాలను ఎదిరించాలనుకుంది.కానీ అందుకు తన స్థాయి సరిపోదని తెలుసుకున్న ఆమె సినిమా రంగంలోకి వచ్చి ఒక పెద్ద హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత తన ఊరి సమస్యను ఎలా సాల్వ్ చేసింది…ఈ క్రమంలో తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అన్నది కథాంశం. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి రాజమండ్రిలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తాం. 12 రోజుల పాటు అక్కడ షూటింగ్ చేసి సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే పాటలను విదేశాల్లో చిత్రీకరించాలన్న ఆలోచన ఉంది. నూతన తారాగణం నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
చిత్ర సమర్పకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ…“ దర్శకుడు గతంలో ఒక ఓటీటీ సినిమా చేశాడు. ఫ్యూచర్ ఫిలింగా ఇది మొదటిది. మంచి స్టోరీతో పాటు టైటిల్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. జో శర్మ, అమెరికాలో పలు చిత్రాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. తెలుగులో ఇది ఫస్ట్ ఫిలిం. ఇందులో టైటిల్ రోల్ లో నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
నటి జో శర్మ మాట్లాడుతూ…“నేను అమెరికాలో ఉంటున్నా.తెలుగు అమ్మాయినే. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మోహన్ వడ్లపట్ల గారికి మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నర్మద రోల్ చేస్తున్నా. స్టోరి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది“ అన్నారు.
దర్శకుడు శుభాకర్ మాట్లాడుతూ…“ప్రతిభ ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకుని అవకాశాలు కల్పించడంలో మా నిర్మాతలు ముందుంటారు. నర్మద చిత్రాన్ని డైరక్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేయడానికి మా నిర్మాతలు పూర్తి స్వేచ్ఛనిచ్చారు“ అన్నారు.