నూతన చిత్రాలు ప్రకటించిన విశ్వక్ సేన్
పుట్టినరోజు సందర్భంగా నూతన చిత్రాలు ప్రకటించిన విశ్వక్ సేన్
తొలి చిత్రం `ఈ నగరానికి ఏమైంది`లోనే తన మార్క్‌ను క్రియేట్ చేసిన నటుడు విశ్వక్ సేన్. ఆ తర్వాత భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఫలక్నామా దాస్ నుంచి దాస్ కా ధమ్కీ వరకు భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. యంగ్ ఏజ్‌లోనే నిర్మాతగానూ, దర్శకుడిగానూ మల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పుట్టినరోజు వేడుక మంగళవారం రాత్రి అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకకు విశ్వక్ సేన్ తో చిత్రాలు తీస్తున్న రచయితలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్పై విడుదల చేసిన స్పెషల్ పాట ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విశ్వక్సేన్ రెండు కొత్త చిత్రాలను వెల్లడించారు. ఇప్పటికే `ముఖ చిత్రం`లో పవర్ఫుల్ లాయర్‌గా కనిపించబోతున్నాడు. యువి.క్రియేషన్స్‌లో `గామి` అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ, లేడీస్ నైట్ అనే చిత్రాలు చేస్తున్నాడు.
ఇవి కాకుండా ఫలక్ నామా దాస్ 2`, `స్టూడెంట్ జిందాబాద్` అనే రెండు నూతన చిత్రాలను విశ్వక్ ప్రకటించారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ, గత ఏడాదినుంచి నేను పుట్టినరోజు చేసుకుంటున్నా. `ఈ నగరానికి ఏమైంది`లో నటించినప్పుడు 22 ఏళ్ళే. ఇప్పుడు 27 ఏళ్ళు వచ్చేశాయి. అప్పుడే కాలం ఇంత త్వరగా మారిపోయిందా అనిపిస్తుంది. నా డైలాగ్ ఒకటుంది. `ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు` అలా నా చిత్రాలుంటాయి. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం అరిటాకుమీద భోజనంలా వుంటుంది. అందులో నాన్‌వేజ్ కూడా వుంటుంది. టీజర్లో చూపించినట్లు బాటిల్ పగలగానే కథ మరో మలుపు తిరుగుతుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ సినిమా. సూర్యాపేట కుర్రాడు గోదావరి వెళితే అక్కడ జరిగే కథ ఈ సినిమా. దర్శకుడు విద్యాసాగర్ అద్భుతంగా తీశాడు. `ఓరి దేవుడా` సినిమా కూడా రెడీగా వుంది. అది కూడా చూస్తే మీరంతా లవ్‌లో పడతారు. అందులో దేవుడి పాత్రను స్టార్ హీరో చేయబోతున్నాడు. అది ఒక ఫీస్ట్‌లా వుంటుంది. ఇక దాస్ కా ధమ్కీ సినిమా చాలా గొప్పగా వుండబోతోంది. ఆ తర్వాత స్టూటెండ్ లీడర్‌గా `స్టూడెంట్ జిందాబాద్` అనే సినిమా చేయబోతున్నా. ఇక వచ్చే ఏడాది మార్చి 29న ~ఫలక్ నామా దాస్ 2` చిత్రాన్ని ప్రసాద్ల్యాబ్లోనే ప్రారంభం చేసుకుందాం. పాన్ ఇండియా కాదు కానీ హైదరాబాద్‌కూ ముంబైకు లింక్ వున్న కథ. నాన్నగారు మంచి నిర్మాత. చిన్నప్పటినుంచి నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర అన్ని రకాల వనరులున్నాయి. అందుకే బాగా తీయగలను. ప్రసన్న ధమ్కీ కథను బాగా రాశాడు. ఆ కథ చెప్పినప్పుడు నాకు మైండ్ పోయినట్లు అనిపించిది. అందుకే `మైండ్ పోతుంది లోపల` అనే టైటిల్ పెడదామనుకున్నా. కానీ ఫైనల్‌గా దాస్ కా ధమ్కీ అనే చక్కటి టైటిల్ పెట్టాం అని అన్నారు.
నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ, మా అబ్బాయి విశ్వక్ సేన్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా అబ్బాయినుంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. మీడియాకు ప్రత్యేక కృతజ్థతలు తెలియజేస్తున్నా. మా అబ్బాయికి ఎప్పుడూ మీడియా, అభిమానుల సపోర్ట్ వుంటుంది. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
లక్కీ మీడియా అధినేత నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, విశ్వక్సేన్ చాలా మందికి స్పూర్తి. ఐదేళ్లనుంచి విశ్వక్‌ను పరిశీలిస్తున్నా. సినిమా అనే తపన కనిపించింది. అది క్రమంగా పెరుగుతుంది. బాధ్యత కూడా పెరిగింది. కష్టపడే తత్త్వంతోనే నువ్వు పైకి ఎదిగావు. నీతో`పాగల్` సినిమాతో జర్నీ చేయడం మొదలయింది. నాకు హిట్ సినిమా వచ్చింది. విశ్వక్ అభిమానులు గర్వంగా వుండేలా సినిమాలు వుంటాయని తెలిపారు.
ధమ్కీ చిత్ర కథా రచయిత ప్రసన్న మాట్లాడుతూ, దాస్ కా దమ్కీ నాకు స్పెషల్.. హీరోగా విశ్వక్‌కు ఓ కథ చెప్పాను. అది విన్నాక నిర్మాతగా చేస్తానన్నాడు. చిన్న వయస్సులో అన్ని పనులు చేస్తున్నాడంటే ఆశ్చర్యం కలిగింది. నేను మంచి కథ చెప్పాననే నమ్మకం కూడా ఏర్పడింది. ఈ కథ చెప్పిన రాత్రి నాకు ఫోన్ చేసి `మైండ్ పోతోంది లోపల` అని మెసేజ్ పెట్టారు. రచయితగా ఆరోజే నేను హిట్ అనే నమ్మకం కలిగింది. ఈ సినిమా చూస్తే థియేటర్లో అంతా నవ్వుతూ వుంటారని తెలిపారు.
`ఓరి దేవుడా` చిత్ర దర్శకుడు అశ్వథ్ మాట్లాడుతూ, అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది. ఇక మాస్‌ను ఆకట్టుకునే చిత్రంగా ధమ్కీ వుండబోతోందని అన్నారు.
సంగీత దర్శకుడు జీవీ మాట్లాడుతూ, విశ్వక్ కథల ఎంపిక భిన్నమైనవిగా తీసుకుంటారు. సినిమా పట్ల తపన ఆయనలో వుంది. సుభాష్ నారాయణ్ గీతరచయిత సహకారంతో.. `ఆ గయరే..మాస్ కా బాస్.. బన్ గయారే దిల్ కా బాస్..` అనే పాటకు మంచి ట్యూన్ ఇవ్వగలిగాను. విశ్వక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని అన్నారు.