నెపోలియన్ ట్రయిలర్ రివ్వ్యూ

Published On: August 16, 2017   |   Posted By:

నెపోలియన్ ట్రయిలర్ రివ్వ్యూ

కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ ఎవరో కూడా మనకు తెలీదు. అప్పటివరకు ఆ సినిమా ఒకటుందనే విషయం కూడా చాలామందికి తెలీదు. సడెన్ గా అలాంటి సినిమాలు కొన్ని వెలుగులోకి వస్తాయి. ఫస్ట్ లుక్ లేదా ట్రయిలర్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంటాయి. సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది నెపోలియన్ మూవీ. టీజర్ తో ఇప్పటికే టాలీవుడ్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ చిన్న సినిమా, ఇప్పుడు ట్రయిలర్ తో కూడా ఓ చిన్న సైజు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

సినిమాలో హీరోకు నీడ ఉండదు. వినడానికి కాస్త కొత్తగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ స్టోరీలైన్ ఇదే. పుట్టినప్పట్నుంచి తనతోనే ఉన్న నీడ ఈమధ్య కాలంలో కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు హీరో. ఇక అక్కడ్నుంచి కథ మొదలవుతుంది. దీనికి ఓ సామాజిక కోణాన్ని, చిన్న సందేశాన్ని కూడా జోడించాడు దర్శకుడు ఆనంద్ రవి. ఇక్కడ చమక్కు ఏంటంటే.. ఈ సినిమాకు కథ రాసుకొని డైరక్ట్ చేసిన ఆనంద్ రవే..  ఇందులో హీరోగా కూడా నటించాడు. అవును.. తెరపై కనిపిస్తున్న హీరోనే ఆనంద్ రవి. ఇతడు గతంలో ప్రతినిథి, కేవో2 లాంటి సినిమాలకు కథలు అందించాడు.

ట్రయిలర్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న నెపోలియన్ సినిమాకు మంచి రేటు పలికే ఛాన్స్ ఉంది. అటు థియేట్రికల్ ట్రయిలర్, ఇటు శాటిలైట్ రైట్స్ పరంగా నెపోలియన్ సేఫ్ వెంచర్ అనిపించునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రవివర్మ, కోమలి, కేదార్ శంకర్.. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.