నేను నా నాగార్జున చిత్రం ట్రైలర్ విడుదల
కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్బంగా “నేను నా నాగార్జున” ట్రైలర్ విడుదల!!
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై తన పంచ్ డైలాగ్స్ తో నవ్వులు పూయించిన మహేష్ ఆచంట ఆ తర్వాత రంగస్థలం, మహానటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 100 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విభిన్నమైన పాత్రలు పోషించిన మహేష్ ఇప్పుడు “నేను నా నాగార్జున’ చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జియన్ఆర్ క్రియేషన్స్ పతాకంపై నవ దర్శకుడు ఆర్.బి. గోపాల్ దర్శకత్వంలో గుండపు నాగేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ మరియు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాతల మండలి ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, కార్యదర్శి కె ఎల్ దామోదరప్రసాద్ ప్రముఖ నిర్మాతలు మళ్ల విజయప్రసాద్, రామసత్యనారాయన, సాయివెంకట్, బసిరెడ్డి, టి.ప్రసన్నకుమార్, బాలాజీ నాగలింగం, దర్శకుడు,నిర్మాత బాబ్జి, డిస్ట్రిబ్యూటర్ శంకర్, నటుడు తోటపల్లి మధు, హీరో మహేష్ ఆచంట తదితరలు వేదికపై ఆశీనులవగా నిర్మాత గుండపు నాగేశ్వరరావు అతిధులకు బొకేలతో స్వాగతం పలికారు.
ఈశ్వర్ పెరావళి సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియోని మళ్ల విజయప్రసాద్ ఆవిష్కరించారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైయింది. చిత్ర ట్రైలర్ ని సి.కళ్యాణ్ రిలీజ్ చేసారు. అలాగే సినిమాలో వున్న పాటలని ఒక్కో అతిధి విడుదలచేశారు.
బి.గోపాల్ అంత ఎత్తుకి ఎదగాలి!
నిర్మాతల మండలి ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ట్రైలర్స్ చూస్తుంటే ఇదొక లో ప్రొఫైల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ట్రయిలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా హిట్ తో దర్శకుడు ఆర్ బి గోపాల్ బి.గోపాల్ అంత ఎత్తుకి ఎదగాలి. అలాగే నిర్మాత నాగేశ్వరరావు కి డబ్బులతో పాటు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు..
ట్రైలర్ చాలా బాగుంది!
మాజీ ఎమ్యల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. దర్శకుడు గోపాల్ మంచి సుపరిచితుడు. ఈ సినిమా షూటింగ్ అంతా విశాఖపట్నంలోనే జరిగింది. నేను షూటింగ్ కి రెండు మూడు సార్లు వెళ్ళాను. గోపాల్ చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అంతగా బాగాలేదు. అహర్నిశలు ఎంతో కస్టపడి నిర్మాతలు సినిమాలు తీస్తుంటే ఫైనల్ గా వారికీ సరైన థియేటర్స్ దొరకడంలేదు ఇది చాలా బాధాకరం. నిర్మాత బాగుంటేనే వేల మందికి పని దొరుకుతుంది. ఇండస్ట్రీ పెద్దలు చిన్న సిని మాలకు థియేటర్స్ ఇప్పించవలిసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. అన్నారు.
అవగాహనతో వస్తే బాగుంటుంది!
నిర్మాతలమండలి కార్యదర్శి కె ఎల్ దామోదరప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రావాలనుకొనేవారు ప్యాషన్లతోనే వస్తారు. కానీ దాని గురించి ముందుగా అవగాహనచేసుకొని వస్తే మరింత బాగుంటుంది. చిన్న నిర్మాతలకు లాభం చేకూరేలా మాయావన్తు కృషి చేస్తున్నాం.. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతకు లాభాలు రావలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు..
సైకిలు షాప్ కుర్రాడి కథ!
హీరో మహేష్ ఆచంట మాట్లాడుతూ.. జబర్దస్త్ పోగ్రామ్ ఆపేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే నేను ఏ అవకాశం వస్తే ఆ సినిమా చేశాను.. రంగస్థలం కి ముందే ఈ చిత్రం చేశాను. ఇప్పటివరకు వంద చిత్రాల్లో మంచి పాత్రలు పోషించాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఒక సైకిలు షాప్ కుర్రాడి కథ ఇది.. కథావినగానే బాగా నచ్చింది. మావూరిలో రాంబాబు అనే సైకిలు షాప్ కుర్రాడు చేసిన పనులన్నీ గుర్తుకువచ్చాయి.. అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ చిత్రంలో నటించడం జరిగింది. సినిమా అంతా చాలా ఫన్నీగా ఉంటుంది.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు..
వారందరికీ నా థాంక్స్!
నిర్మాత గుండపు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఎన్నో అష్టకష్టాలు పడి చిత్ర నిర్మాణం పూర్తి చేసాం. ఎంతో మంది నటీ నటులు,సాంకేతిక నిపుణులు నాకు సాయం చేసారు. అందరి సహకారంతోనే ఈ చిత్రాన్ని పూర్తిచేయగలిగాను. వారందరికీ నా థాంక్స్. త్వరలనే మంచి డేట్ చూసుకొని సినిమా రిలీజ్ చేస్తాం అన్నారు.. నేను నా నాగార్జున చిత్రం మంచి సక్సెస్ అయి నిర్మాతకు డబ్భులు, టీమ్ అందరికి మంచి పేరు రావాలని రామసత్యనారాయన, సాయివెంకట్, బసిరెడ్డి, టి.ప్రసన్నకుమార్, బాలాజీ నాగలింగం, దర్శకుడు,నిర్మాత బాబ్జి, కోరుకున్నారు..!