పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ

Published On: July 1, 2022   |   Posted By:

పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ

Pakka Commercial:గోపీచంద్  ‘పక్కా కమర్షియల్’ రివ్యూ

Emotional Engagement Emoji

👍

మ్యాచో హీరో గోపీచంద్  వరస సనిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ అందుకోవటంలో తడబడుతున్నాడు. తాజాగా పక్క కమర్షియల్(Pakka Commercial)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచే మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతోన్న గోపీచంద్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా? చిత్ర కథేంటి, రాశి ఖన్నాక్యారక్టర్ ఏమిటి…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

నీతికి,నిజాయితీకి మారు పేరు జడ్డి సూర్య నారాయ‌ణ మూర్తి (స‌త్య‌రాజ్‌)  .అయితే… తను ఇచ్చిన ఓ  త‌ప్పుడు తీర్పు వ‌ల్ల ఓ అమాయ‌కురాలు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకుని కుమిలిపోతాడు. దాంతో ఉద్యోగం వదిలేసి పచారి కొట్టుపెట్టుకుని సాదాసీదాగా బ్రతుకుతూంటాడు. అయితే ఆయన కొడుకు ల‌క్కీ (గోపీచంద్‌)కు ఇది నచ్చదు. అతనో లాయిర్. తండ్రి లా తను ఉంటే బ్రతకటం కష్టమని, పక్కా కమర్షియల్ లాయిర్ గా ప్రాక్టీస్ చేస్తూంటాడు. అతని దగ్గరకు కేసు వెళితే ఎలాగైనా గెలుస్తాడు..గెలిపిస్తాడు. అయితే తండ్రికి ఈ విషయాలు ఏమీ తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూంటాడు. అతని దగ్గర ఝాన్సీ (రాశిఖన్నా) అసెస్టెంట్ గా జాయిన్ అవుతుంది. ఆమె గతంలో టీవి సీరియల్ స్టార్. కొన్ని పరిస్దితుల్లో కోర్టుకు వెళ్లి అక్షింతలు వేయించుకుని లక్కి దగ్గర అసెస్టెంట్ గా జాయిన్ అవుతుంది. అయితే ఆమె అమాయకత్వంతో చేసిన కొన్ని పనుల వల్ల తండ్రికి లక్కీ నిజ స్వరూపం తెలిసిపోతుంది. తన   తను ఎవరి వల్ల అయితే ఉద్యోగం వదిలేయాల్సి వచ్చిందో అక్కడే తన కొడుకు పర్శనల్ లాయిర్ గా చేస్తున్నాడని అర్దం చేసుకుంటాడు. అతనే   వివేక్‌(రావు రమేష్‌) . ఇప్పుడు వివేక్ వ్యతిరేకంగా వాదించటానికి నల్లకోటు వేసుకుని  కోర్టుకు వెళ్తాడు.. అప్పుడేం జరిగింది…  వివేక్‌ వల్ల మాజీ జడ్జికి జరిగిన అన్యాయం ఏంటి? అనేది తెరమీద చూడాల్సిందే.
ఈ తండ్రీ కొడుకుల పోరు ఏ స్థాయికి చేరుకుంది? క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించే కొడుకు గెలిచాడా, నాన్ క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించే నాన్న గెలిచాడా?   వివేక్‌(రావు రమేష్‌) కు సత్యరాజ్ కు మధ్య ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …

టైటిల్‌కి తగ్గట్టే కమర్షియల్‌గా తీసే ప్రయత్నం చేసారు మారుతి. అయితే కమర్షిల్ సినిమా అంటే అర్దం..సరైన స్టోరీ లైన్ లేకపోవటమా లేక పేలవమైన కథ,కథనం ఉండటమా…ఎక్కడ ఎప్పుడు పడితే అక్కడ జోక్స్ వేయటమా అనే డౌట్ వస్తుంది.  అయితే ఒకటి మాత్రం అర్దమవుతుంది. అది డైరక్టర్ మారుతి దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే పక్కా రొటీన్ కథతో తయారైన సినిమా అని. తండ్రి కష్టాన్ని చూసి బాధపడటం, ఆయన్ని బాధకు గురి చేసిన వారిపై పగ తీర్చుకోవాలనుకోవటం కమర్షియల్ హీరో లక్షణం అని తేల్చారు. పగ ప్రతీకారం ఈ కథాంశం అని కొంతదూరం వెళ్లాక అర్దమయ్యి మనం పశ్చాత్తాపపడతాము. అయితే మారుతి ఇంటర్వూలలో ముందే చెప్పేసాడు ఈ సినిమాలో లాజిక్స్ వెతకద్దు అని..కాబట్టి అవి వెతికే ప్రయత్నం చేస్తే  ఆయన మాట తీసేసినట్లే. నేను ముందే చెప్పాను కదా మీరే వినలేదు అన్నట్లుంటుంది. అయితే మారుతి మంచి రైటర్. అది ఆయన మొదట సినిమా నుంచి మనకు అర్దమైన విషయం. దాన్ని బేస్ చేసుకునే ఆయన సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ సారి గోపిచంద్ ఇమేజ్ ముందు ఆయన రైటింగ్ స్కిల్స్ కనపడలేదు. ఆ మ్యాజిక్ జరగలేదు.  ఇది పక్తు రివేంజ్ కథ. దాన్ని ఏ రూపంలో చెప్పాలి? న‌వ్విస్తూ చెప్పాలా? ఎమోష‌న‌ల్ గాచెప్పాలా? లేదంటే ప్రేక్ష‌కుల్ని కూడా థ్రిల్ చేస్తూ సినిమా తీయాలా? అనే విష‌యాల్లో ద‌ర్శ‌కుడికి ఓ క్లారిటీ ఉండి తీరాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు సినిమాలు హిట్ట‌య్యాయంటే కార‌ణం.. ఆ సినిమాల్లో చూపించిన లోపం వ‌ల్ల కాదు. ఆ లోపం చుట్టూ పండిచిన స‌న్నివేశాల వ‌ల్లే. ఈ క‌థ‌ల్ని కామెడీగా చెప్పాలి.. అని మారుతి ఫిక్స‌యి రాసుకున్న క‌థ‌లు అవి. కాబ‌ట్టి.. ఆ కామెడీలో లాజిక్కులు కూడా కొట్టుకుని వెళ్లిపోయాయి. `పక్కా కమర్షియల్ `లో కాన్సెప్ట్ ఉంది. కానీ… దాన్ని ఎలా చెప్పాలి? అనే విష‌యంలో ద‌ర్శ‌కుడికి క్లారిటీ లేకుండా పోయింది. అదే దెబ్బకొట్టింది.  ల‌వ్ ట్రాక్ అయినా కొత్త‌గా ఉందీ అనుకుంటే, అదీ జ‌ర‌గ‌లేదు. అలాగే క్లైమాక్స్  సీన్‌, దానికి లీడ్ గా వ‌చ్చే స‌న్నివేశాలు.. ఇవ‌న్నీ పేల‌వంగా న‌డిచాయి. తండ్రి,కొడులు మధ్య ఎమోషన్ ట్రాక్ బ‌లంగా లేదు.అయితే కొన్ని జోక్స్ పండాయి కాబట్టి ఓకే ..ఛల్తా హై అనుకుంటూ ముందుకు వెళ్లిపోవటమే.

హైలెట్స్

మారుతి మార్క్ ఫన్నీ సీన్స్
రాశి ఖన్నా క్యారక్టరైజేషన్

మైనస్
కథ,కథనం రొటీన్ గా నడవటం
చివర్లో వచ్చే ట్విస్ట్  ఊహించేగలగటం.

టెక్నికల్ గా …

రైటర్ గా  మారుతి ఈ సినిమాలో నిరాశపరచాడు. అలాగని డైరక్టర్ గానూ మరో మెట్టు ఎక్కలేదు. కాన్సెప్టు ఏదైనా స‌రే, దాన్ని నిల‌బెట్టేది క‌చ్చితంగా స‌న్నివేశాలే. ఆ స‌న్నివేశాల లోపం.. అడుగ‌డుగునా కొట్టచ్చినట్లు  క‌నిపించింది. అందుకే చాలా సీన్స్ లో పక్కా కమర్షియల్  నిరాశ ప‌రిచింది. సంగీతంలో టైటిల్ ట్రాక్ పాట విన‌డానికి బాగున్నా.. చూడ్డానికి యావ‌రేజ్ స్థాయి ద‌గ్గ‌రే ఆగిపోయింది. నేప‌థ్య సంగీతం చూస్తే.. ఓ లో బడ్జెట్ కామెడీ సినిమా  ఫీలింగ్ వ‌చ్చింది. డైలాగులు బాగున్నాయి. సినిమా చివర్లో వెబ్ సైట్లు రివ్యూులు అంటూ చెప్పించిన డైలాగులు పండలేదు. ఎడిటింగ్ సోసోగా ఉంది. ఫైట్స్ స్టైలిష్ గా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు లుక్ తెచ్చిపెట్టాయి.

నటీనటుల్లో …

గోపీచంద్  కొత్త‌గా చేసిందేం లేదు. ఎమోష‌న్ సీన్ల‌లో ప‌ట్టీబ‌ట్టి న‌టించిన‌ట్టు అనిపించింది. గోపీ ఫైట్స్ బాగా చేయ‌గ‌ల‌డు. డాన్సులు బాగుంటాయి. ఆ బ‌లాల్నీ స‌రిగా వాడుకున్నారు. రాశిఖన్నా సినిమాకు గ్లామర్ .. న‌ట‌న అంతంత మాత్ర‌మే. తండ్రి  పాత్ర‌లో సత్యరాజ్ మ‌రోసారి ఒదిగిపోయాడు. త‌ండ్రి కొడుకుల సెంటిమెంట్ కాస్త పండిందంటే కార‌ణం త‌నే. స‌ప్త‌గిరి లౌడ్ కామెడీ ఈసారి వ‌ర్క‌వుట్ కాలేదు. తారాగ‌ణంలో చాలామందే ఉన్నా – ఎవ‌రికీ చెప్పుకోదగ్గ పాత్ర ద‌క్క‌లేదు.

చూడచ్చా

జస్ట్ ఓకే సినిమా..ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్తే బాగుందనిపిస్తుంది.

నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి, శియ, చిత్రా శుక్లా తదితరులు
సినిమాటోగ్రఫీ: క‌ర్మ్‌ చావ్లా
సంగీతం: జేక్స్ బిజాయ్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: ‘బన్నీ’ వాసు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి
Running time: 151 minutes.
విడుదల తేదీ: జూలై 1, 2022