ప్రజాకవి కాళోజీ బయోపిక్ మూవీ సెప్టెంబర్ 9 విడుదల
సెప్టెంబర్ 9న ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన ప్రజాకవి కాళోజీ బయోపిక్!
తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు ప్రభాకర్ జైనీ. గతంలో క్యాంపస్ అంపశయ్య, ప్రణయ వీధుల్లో, అమ్మా! నీకు వందనం! సినిమాలు తీసిన ఆయన ప్రస్తుతం స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. కాళోజీ నారాయణరావు బయోపిక్ ప్రజాకవి కాళోజీ చిత్రీకరణ పూర్తి చేశారు.
ప్రజాకవి కాళోజీ చిత్రాన్ని జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. టైటిల్ పాత్రలో, కాళోజీగా మూలవిరాట్ నటించారు. కాళోజీ నారాయణరావు భార్యగా పద్మ, కొడుకుగా రాజ్ కుమార్, కోడలుగా స్వప్న నటించారు. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు వెల్లడించారు.
సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ చిత్రీకరణ చేసేటప్పుడు మూలవిరాట్ ను చూసి నిజంగా కాళోజీ గారు వచ్చినట్లు ఉందని చాలా మంది చెప్పారు. పోలికలు అంతలా అచ్చుగుద్దినట్లు ఉంటాయి. కాళోజీ గారి కుటుంబ సభ్యులతో పాటు చూసిన వారంతా కాళోజీయే బ్రతికి వచ్చి తమ కళ్ళ ముందు నడయాడుతున్నట్టుగా ఫీలయ్యారు. మేం ఈ సినిమాను కాళోజీ గారు జీవించిన, ఆయన తిరిగిన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. విశాఖలో ఓ సన్నివేశం చేశాం. శ్రీ శ్రీ, కాళోజీ, రామేశ్వరరావు కలిసి ఉన్న దృశ్యాలు, విశాఖలో కృష్ణబాయమ్మ గారి ఇంట్లో కాళోజీ ఉన్న దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి. అమృతలత గారి ఇంటిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ఆయన నివసించిన ఇంట్లోనే సన్నివేశాలు తీశాం. కాళోజీ గారు వాడిన కళ్ళజోడు, చేతి కర్రను ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో ఉపయోగించాం.
కాళోజీ జీవితం ఒక అనంత ప్రయాణం. ఆయనకు రెండు రాష్ట్రాల్లో అనేక మంది మిత్రులు ఉన్నారు. వారి జీవిత చరిత్ర చదువుతుంటే, వారి సన్నిహిత మిత్రులు నుంచి వింటుంటే, పది సినిమాలకు సరిపడినంత కంటెంట్ లభించింది. దానిని ఒక సినిమా పరిధిలోకి కుదించడం, దాదాపు అసాధ్యం. అందుకే, కాళోజీ ఔన్నత్యాన్ని, కాళోజీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుని వారి జీవితం స్ఫూర్తి పొంది, కథ రాసుకున్నాను.
కాళోజీ జీవితం మీద సినిమా తీయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించి, అనేక కారణాల చేత నిష్క్రమించారు. ఈ సినిమాకు ఏ సంస్థ గానీ, ప్రభుత్వం గానీ సహాయం చేయలేదు. రెండు సంవత్సరాల రీసెర్చి అనంతరం, కథ ఫైనల్ చేసుకుని, ఆయా సంఘటనలను సృష్టించుకుని, స్క్రీన్ ప్లే రాసుకున్నాను. ఇది రెగ్యులర్ సినిమా కాదు ఒక జీవితం! ఇటువంటి గొప్ప సినిమా తీయడం సాహసమే అని చాలా మంది ప్రముఖులు చెప్పారు. సెప్టెంబర్ 9న సినిమా విడుదల చేయాలని శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. ప్రేక్షకుల అంచనాల మేరకు సినిమా వస్తుందని, భగవంతుని ఆశీస్సులతో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను.
ఈ చిత్రంలో ముఖ్యంగా నాలుగు పాటలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే గోరటి వెంకన్న, రెండు వందేమాతరం శ్రీనివాస్, ఒకటి మాళవిక, భూదేవి పాడారు. ఈ పాటలలో కాళోజీ కవితల సారాంశాన్ని పొందు పరిచాము. పాటలు ఈ సినిమాకు ఒక ఔన్నత్యాన్ని ఆపాదిస్తాయి అని చెప్పారు.
కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్ తదితరులు ఈ సినిమాలో వారి పాత్రల్లో నటించారు. పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు నటించారు. ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్ వంటి అనేక మంది నూతన, స్థానిక నటీనటులు ఇతర పాత్రల్లో నటించారు. జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు.
సాంకేతికవర్గం :
ఎడిటింగ్: రవి కుమార్
కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల
సంగీతం: యస్.యస్.ఆత్రేయ
బ్యానర్: జైనీ క్రియేషన్స్
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.