ప్లే బ్యాక్ మూవీ రివ్యూ
సైన్స్ ఫిక్షన్ ట్రిక్: `ప్లే బ్యాక్` రివ్యూ
Rating:2.5/5
తెలుగులో సినిమా కథలు, అవి సృష్టించే పాత్రలు.. అన్నీ కమర్షియల్ గేమ్ ఆడుతూంటాయి. అందులో తప్పేమిలేదు.డబ్బు రావటమే సినిమా అల్టిమేట్ గోల్. కళ అనేది కాసులు తర్వాతే అనేది నేటి నిర్మాతలకు అర్దమైన అర్ద సత్యం. అందుకే మన దర్శక,నిర్మాతలకు సైన్స్ ఫిక్షన్ జానర్ అంటే భయం. ఆ జోనర్‌కి కమర్షియల్ టచ్ ఇవ్వడం అంత తేలికైన విషయం కాదని వారి అభిప్రాయం. అదీ కొత్తవాళ్లను ప్రధాన పాత్రలుగా పెట్టి. అయితే ఈ విషయంలో ఈ చిత్ర డైరక్టర్ ఓ అడుగు ముందుకేసాడు. సైన్స్ ఫిక్షన్ కు థ్రిల్లర్ ని కలిపి.మర్డర్ మిస్టరీ గా మార్చి ముందుకెళ్లాడు. తన ఎత్తుకున్న జోనర్‌లోనే ఉంటూ.. కమర్షియల్ గా ఓ సినిమా తీయాలనుకున్నాడు. అలా ఈ రెండింటినీ మిక్స్ చేస్తూ చేసిన సినిమా `ప్లే బ్యాక్`. మరి ఈ కాక్టైల్ కుదిరిందా, లేదా? `ప్లేబ్యాక్` లెక్కేంటి? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
జర్నలిస్ట్ కార్తి (దినేష్ తేజ్)కు తన కొత్తగా మారిన అద్దె ఇంట్లో ఓ లాండ్ లైన్ కు ఫోన్ ఉండటం చూస్తాడు. యాంటిక్ పీస్ గా ఉన్న ఆ ఫోన్ కు ఓ రోజు ఫోన్ వస్తుంది. ఎవరు చేసారా అని ఆసక్తిగా ఎత్తిన అతనికి అవతలనుంచి సుజాత (అనన్య నాగేళ్ల)అనే అమ్మాయి మాట్లాడుతుంది. ఆ తర్వాత అదే ఫోన్ కు చాలా సార్లు ఆమే ఫోన్ చేస్తుంది. తను ఎవరికి ఫోన్ చేసినా అదే ఫోన్ కు వెళ్లటం ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ విషయం కార్తికు వింతగానే ఉంటుంది. మరికొద్ది రోజులకు ఆమెను కలుసుకుందామని ప్రయత్నించగా మరో విషయం రివీల్ అవుతుంది. అవతల మాట్లాడే అమ్మాయి 1993లో ఉంది. తనేమో 2019లో ఉన్నాడు. అదెలా సాధ్యం. అతనికి అర్దం కాదు.
కానీ తర్వాత తన గర్ల్ ప్రెండ్ ప్రొఫెసర్ సాయింతో అది ఫోన్స్ క్రాస్ టాక్ వల్ల వేర్వేరు టైమ్ లైన్స్ లో ఉన్నవారు మాట్లాడుకోవటం జరుగుతుందని అర్దం చేసుకుంటాడు. అక్కడ నుంచి మరింత క్యూరియాసిటీతో ఆమెతో స్నేహం చేస్తాడు. ఆ క్రమంలో ఆమె త్వరలో హత్యకు గురి కాబోతోందని తెలుసుకుంటాడు. అక్కడ నుంచి తనకన్నా పాతికేళ్ళు వెనక ఉన్న ఆమెను ఎలా సేవ్ చేసాడు. అసలు ఆమెను కలుసుకోగలిగాడా..ఆమెకు, అతనికి ఏమన్నా రిలేషన్ ఉందా..అసలు ఆమెను చంపుదామనుకున్నది ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్…
తెలుగులో ఇప్పటికీ సైన్స్ ఫిక్షన్ సినిమా అనగానే ..‘ఆదిత్యా 369’ సినిమాయే చెప్పుకోవాలి. టైమ్ మిషన్ ఆధారంగా అల్లుకున్న ఈ కథలో హీరో టైమ్ మిషన్‌లో రాయలవారి కాలానికి వెళతాడు. ఆ తర్వాత అత్యంత రేడియేషన్ ఉండే భవిష్యత్ కాలానికి కూడా వెళతాడు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత 24 అనే మరో టైమ్ మిషన్ మూవి వచ్చింది. అదీ తెలుగు దర్శకుడు కాదు..తెలుగు హీరో కాదు. మరి మనకు తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు రావా అంటే …మొన్నామధ్య డైరక్టర్ సంకల్ప్ రెడ్డి…అంతరిక్షం 9000 అంటూ ఓ సినిమా తీసాడు. కానీ అది అంతరిక్షంలోనే ఉండిపోయింది. క్రిందకు దిగి సామాన్యుడుని అందుకోలేక పోయింది. సైన్స్ ఫిక్షన్ అంటే ..సామాన్యుడుకు కూడా ఆ ఫిక్షన్ అర్దమవ్వాలి. ఆ విషయం అర్దం చేసుకున్న ఈ దర్శకుడు స్క్రిప్టులో ఆ పనితనం చూపెట్టాడు.
తన మేధస్సుతో, తన తెలివితో గతం కాలంలో ఉన్న ఒక అమ్మాయిని ప్రాణాపాయం నుంచి సేవ్ చేయటం ఇదీ ఈ అనే కథ పుట్టడానికి ఉత్ప్రేతరకంగా పనిచేసిన ఆలోచన. నిజంగా ఐడియా చాలా బాగుంది. అయితే ఇది సొంత ఐడియా అయితే మరింతమంది మెచ్చుకునేవారు. 2016లో సౌత్ కొరియాలో సిగ్నల్ అనే టీవీ సీరిస్ ఇలాంటి పాయింట్ తో వచ్చింది. తర్వాత అది చైనా,జపాన్ వంటి భాషల్లోకి రీమేక్ అయ్యింది. ఆ పాయింటే ఇక్కడ మన తెలుగులోనూ ఇలా ప్రవహించింది. అయితే కాపీ అని ఈ కథని అనలేము. ఎందుకంటే మెయిన్ పాయింట్ ని ప్రేరణగా తీసుకుని ఇక్కడ మన తెలుగు నేటివిటి అద్ది అందించిన సినిమా ఇది. సినిమా చూడాలనుకునేవాడికి ఇది కాపీనా కాదా అనేది ప్రశ్న ఉండదు. తనను ఎంగేజ్ చేసిందా లేదా అనేదే చూసుకుంటాడు. అంతవరూ ఈ సినిమా సక్సెస్.
ఇక క్లైమాక్స్ పై… డైరక్టర్ చాలా నమ్మకం పెట్టుకున్నాడని అర్దమవుతుంది. అయితే రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్లంతా.. ఆ ట్విస్ట్ ని ఊహించేస్తారు. అయితే… ఆ ట్విస్ట్ కి అనుసంధానంగా మరో ట్విస్టు వేసుకున్నాడు దర్శకుడు. అది క్లిక్కయ్యిందా లేదా అనేది సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించిందా లేదా అనే పాయింట్ పై ఆధారపడుతుంది.
టెక్నికల్ గా …
బడ్జెట్ ప్లాబ్లమో ఏమో కానీ టెక్నికల్ డిపార్టమెంట్ వీక్ గానే ఉంది. అలాగే డైరక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే కమర్షియల్ యాంగిల్ కోసం ఐటం సాంగ్ లు, కామెడీ ట్రాక్ లు పెట్టకపోవటమే బాగుంది. ఇక ఎడిటర్ మాత్రం ఈ సినిమాకు బాగా కష్టపడినట్లు అర్దమవుతుంది. కెమెరావర్క్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ చెప్పుకోదగిన కృషి చేశాయి. అక్కడక్కడా కొన్ని డైలాగులు బాగున్నాయి. రీరికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. పాటలు లేవు కొంతలో కొంత సేఫ్. హీరోగా చేసిన దినేష్ తేజ్ తన పరిధి మేరకు మెప్పించాడు. అయితే తనలోని అన్ని కోణాల్నీ బయటపెట్టే పాత్ర ఇది. అలాగే సుజాత గా చేసిన అనన్య కూడా తన పెద్ద పెద్ద కళ్ళతో మంచి ఎక్సప్రెషన్స్ పలికించింది. విలన్ గా చేసిన టీఎన్ ఆర్ మాత్రం ఆ పాత్రకు యాప్ట్ కాదు.
చూడచ్చా
ఫ్యామిలీతో చూడచ్చు. ఎక్కడా ఏ విధమైన అసభ్యత, జుగుప్స కలిగించే సన్నివేశాలు లేవు. చివరి దాకా ఎంగేజింగ్ గానే ఉంది.
తెర వెనక ముందు.
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
నటీనటులు: దినేష్ తేజ్, అనన్య నాగళ్ల , అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో
సంగీతం : కమ్రన్
సినిమాటోగ్రఫీ :బుజ్జి.కే
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
ఆర్ట్; జెవి,
పిఆర్ఓ; వంశీ శేఖర్, హరిణి సజ్జ,
డిజిటల్ పీఆర్వో: శివ వీరపనేని, విష్ణుతేజ్ పుట్ట
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:హరి ప్రసాద్ జక్కా
నిర్మాత : ప్రసాదరావు పెద్దినేని
రన్ టైమ్:2గం|| 25ని|
విడుదల తేది :: మార్చ్ 5 , 2021