బందోబస్త్ మూవీ రివ్యూ

స్క్రీన్ ప్లే మరింత బందోబస్త్ గా ఉండాలి (‘బందోబస్త్’ మూవీ రివ్యూ)
Rating: 2.0/5
తమిళ హీరో సూర్య నటించిన సినిమాలు ఏమీ ఈ మధ్యకాలంలో వర్కవుట్ కావటం లేదు. వచ్చినవి వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఈ నేపధ్యంలో మళయాళ మార్కెట్ సైతం కలిసిరావాలన్నట్లుగా మోహన్ లాల్ ని వెంటేసుకుని బందోబస్తుగా భాక్సాఫీస్ ముందు నిలబడ్డాడు. రంగం వంటి పొలిటికల్ థ్రిల్లర్ చేసిన దర్శకుడుని తోడు తెచ్చుకున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వాళ్లు సర్లే ఇంతమంది సెట్ అయ్యారు కదా అని భారీగానే ఖర్చుపెట్టారు. మాస్ నచ్చే ఫైట్స్ ఉన్నాయని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దం వచ్చేలా ట్రైలర్స్ వదిలారు. అవన్ని కలిసి సూర్యకు హిట్ ఇచ్చారా, వీళ్ల కాంబినేషన్ కు సెట్ అయ్యిన కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీలైన్
మిలటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రవికాంత్(సూర్య) మంచి ధైర్య సాహసాలు ఉన్నవాడు. అతను టెర్రరిస్ట్ ఎటాక్ నుంచి ప్రధాని చంద్రకాంత్(మోహన్‌లాల్)ని సమర్ధవంతంగా కాపాడతాడు. దాంతో రవిని తన పర్శనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్.ఎస్.జి కమాండోగా నియమించుకుంటాడు ప్రధాని. అంతా బాగానే ఉందనుకున్న టైమ్ లో ప్రధాని పై మరోసారి దాడి జరుగుతుంది. ఈ సారి విక్రమ్ అనే ఓ టెర్రరిస్ట్ ప్లాన్ ప్రకారం కాశ్మీర్లో ప్రధాని చంద్రకాంత్‌ను బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తాడు.దాంతో చంద్రకాంత్ కుమారుడు అభిషేక్(ఆర్య) ఆయన స్థానంలో ప్రధాని అవుతాడు. రవికాంత్ పర్శనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గానే కొనసాగుతాడు. అతను పదవిలోకి వచ్చి మహదేవ్ కంపెనీస్ అధినేత మహదేవ్(బోమన్ ఇరాని) పనులకు అడ్డుపడతాడు. అతని ప్రాణాలకు కూడా ముప్పు వస్తుందేమో అని సెక్యూరిటీ పెంచుతారు. ఈ లోగా రవికాంత్ తనను ఎంకరేజ్ చేసిన మాజీ ప్రధాని మర్డర్ వెనక ఉన్నదెవరు అనే ఎంక్వైరీ చేస్తూంటాడు. ఆ ఇన్విస్టిగేషన్ లో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి. అవి ఏమిటి..అసలు ప్రధానని చంపింది ఎవరు…వారి ప్లాన్ ఏమిటి..కొత్త ప్రధాని అభిషేక్ తన తండ్రి ని చంపినవారిని శిక్షిస్తాడా …అలాగే ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
అప్పట్లో యాక్షన్ కింగ్ అర్జున్, విజయ్ కాంత్, అరుణ్ పాండ్యన్ వంటి హీరోలు తమిళంలో, తెలుగులో రాజశేఖర్ .. దేశభక్తి సినిమాలు చేస్తూండేవారు. ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రి పై ఓ కుట్ర జరుగుతుంది.దాన్ని ఎదుర్కోవటం వీళ్ల లక్ష్యం అన్నట్లుగా ఈ సినిమాలు సాగుతాయి. మళయాళంలోనూ సురేష్ గోపి ఈ తరహా సినిమాలు చేసేవారు. అయితే ఇప్పుడెవరూ ఆ సినిమాలు చేయటం లేదు. అందరూ ఆ సినిమాలు మర్చిపోతున్నారు. అది గమనించినట్లున్నారు దర్శకుడు విఐ ఆనంద్. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టుకుని సినిమాని ఆ టైప్ సినిమాకు ఓ ఆర్డర్ వేసేసాడు. అయితే ఆ ట్విస్ట్ కూడా ఏ మాత్రం థ్రిల్ ఇవ్వలేదు. అందుకు కారణం ఆ క్యారక్టర్ లో తమిళ నటుడు ఆర్యని పెట్టడమే. ఆర్య వంటి స్టార్ ని తీసుకువచ్చారు అంటేనే కథలో ఏదో మెలిక ఉందని సాధారణ ప్రేక్షకుడు సైతం అర్దం చేసేసుకుంటాడు. దాంతో ఆ ట్విస్ట్ సైతం పాత వాసనే కొట్టింది. దాంతో సినిమాలో ఓ ఆర్డనరీ వ్యవహారంగా మారిపోయింది. సెకండాఫ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ తేలిపోయాయి. సూర్య వంటి హీరో నుంచి ఇలాంటి సినిమా అసలు ఎక్సపెక్ట్ చేయలేం.
టెక్నికల్ ఏస్పెక్ట్స్
యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు. సినిమాటోగ్రఫీ ఎమ్ ఎస్ ప్రభు బాగా ఇచ్చారు. పెద్ద స్క్రీన్ పై ఆ విజువల్స్ కన్నుల వేడకగా ఉన్నాయి. సంగీతం మాత్రం సినిమాకు పెద్ద మైనస్. ఎడిటింగ్ కూడా మరింత క్రిస్ప్ గా చేయాల్సింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నటీనటుల్లో సూర్య ఎన్.ఎస్.జి కమాండో రవి పాత్రలో ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యారు. లుక్, ఫిజిక్ సింక్ అయ్యాయి. ప్రధాని చంద్రకాంత్ వర్మ అనే పాత్రలో మోహన్ లాల్ తన నటనతో ఈ సినిమాలో మంచి నటనను కనబర్చారు.
ఈ సినిమా కంటే ముందే కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య `వీడొక్కడే`, `బ్రదర్స్` చిత్రాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. కెవి ఆనంద్..స్టోరీ లైన్ దాకా ఇంట్రస్టింగ్ గానే తీసుకున్నా ..దాని ప్రెజంటేషనే బాగోలేదు. ఫస్టాఫ్ డీసెంట్ గానే ఉన్నా ప్రొసీడింగ్స్ సినిమాను బాగా స్లో చేసేసాయి. ఇంటర్వెల్ తర్వాత అయినా పుంజుకుందా అంటే అదీ లేదు. దానికి తోడు సినిమాలో ఎక్కడా ఫన్ కానీ రిలీఫ్ కానీ లేదు. ఇవన్నీ చాలదన్నట్లు రైతులు సమస్యలను భుజాన ఎత్తుకున్నారు. మహేష్ చేసిన భరత్ అనే నేను,మహర్షి లో కొన్ని సీన్స్ వాడేసారు. ఇక హీరోకి హీరోయిన్లకు మధ్య వచ్చే సీన్స్ సైతం బోర్ కొట్టేస్తాయి.
చూడచ్చా…
కథను పట్టించుకోకుండా యాక్షన్ సినిమాలు చూసే వాళ్లకు మంచి ఆప్షన్.
తెర ముందు..వెనక
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్
నటీనటులు: సూర్య, మోహన్‌లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు
రైటర్స్: పి.కె.పి, శ్రీరామకృష్ణ
పాటలు: వనమాలి, చంద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె.కిరణ్
ఎడిటర్: ఆంటోని
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు
సంగీతం: హేరీష్ జైరాజ్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: కె.వి.ఆనంద్