బలగం మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
కొన్ని సినిమాలకు నేపధ్యమే బలం. ఈ మధ్య కాలంలో తెలంగాణా సంస్కృతి నేపధ్యంలో, యాష, బాష, వేషం కలగలపి నిజాయితీ గా చెప్పే ప్రయత్నాలు ఎక్కువ అయ్యాయి. నైజాం ప్రాంతంలో నడిచినా ఈ చిన్న సినిమాలు బతికి బట్టకట్టేస్తాయి. అలాంటి ఓ చిన్న సినిమానే ఇది. కమిడయన్ టిల్లు వేణు …దర్శకుడుగా మారి చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓకే చేసి ,నిర్మించటంతోనే ఈ చిన్న సినిమాకు స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమాలో కథేంటి…దిల్ రాజుకు అంతలా నచ్చన అంశం ఏమిటి…కమిడయన్ వేణు ..దర్శకుడుగానూ సక్సెస్ అయ్యాడో లేదో చూద్దాం.
స్టోరీ లైన్:
భారీ బంధువర్గం ఉన్నా కొమురయ్య (సుధాకర్‌రెడ్డి) తాత ఒంటరి. వయస్సు తో సంభందం లేకుండా ఊళ్లో అందరితో పరాచికాలు ఆడుతూ, అవసరమైతే మందలిస్తూ, నవ్విస్తూ..నవ్వుతూ లైఫ్ ని ఈజీగా తీసుకుని బ్రతుకు సాగిస్తూంటాడు. అతని కొడుకులు ఐలయ్య, మొగిలయ్యలు. అలాగే ఓ కూతురు లక్ష్మి. ఈ కూతురు,ఆమె భర్త అంటే కొడుకులకు గిట్టదు. ఎప్పుడూ ఏవో గొడవలు జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే ఐలయ్య కొడుకు సాయిలు(ప్రియదర్శి) అప్పుల్లో మునిగిపోతాడు. సొంతం వ్యాపారం చేసి ఎదగాలని చివరకు ఉన్న ఎకరం భూమిని సైతం అమ్మేస్తాడు. అప్పులు మిగిలుతాయి. దాని నుంచి బయిటపడాలంటే కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. 15 లక్షలకు ఓ సంభందం సెట్ చేసుకుని పెళ్లి పీటలకు ఎక్కడానికి రెడీ అవుతాడు.
రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్. ఈ లోగా తాత చచ్చిపోతాడు. పెళ్లి ఆగిపోతుంది..తను అప్పులు ఎలా తీరుస్తాడు అనే బెంగలో ఉండగా…తన తాత ని చూడటానికి తన మేనత్త కూతురు,మరదలు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) వస్తుంది. ఆమెను లైన్ లో పెట్టి పెళ్లి చేసుకుంటే పెద్ద ఆస్తి సొంతమై ఒడ్డున పడిపోతాడనే ఆశ మళ్లీ చిగురిస్తుంది. ఆ ప్రయత్నాలు మొదలెడతాడు. అయితే ఈ లోగా ఇంట్లో ఓ సమస్య వస్తుంది..తాతకు పెట్టిన పిండం కాకి ముట్టడం లేదు..ఎందుకిలా జరుగుతోంది. తాత చచ్చి ఏం సాధించదలుచుకున్నాడు…. కొమురయ్య మనస్సులో ఏముంది…సాయిలు కు పెళ్లి అయ్యిందా..అప్పులు తీరాయా… చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఆరేడేళ్ళ క్రితం కన్నడంలో తిథి అనే ఆర్ట్ ఫిల్మ్ టైప్ ఓ సినిమా వచ్చింది. చాలా అవార్డ్ లు కొట్టింది. చావు నేపధ్యంలో ఓ పెద్ద కుటుంబంలో జరిగే కథ. ఈ సినిమాలో కూడా దాదాపు అవే పోలికలు,సీన్స్ కనపడతాయి. ఓ రకంగా కన్నడ సినిమాకు తెలుగు నేటివిటి వెర్షన్ లా అనిపిస్తుంది. ఆ విషయం ప్రక్కన పెడితే కమిడయన్ వేణు..తను చూసిన తెలంగాణా పల్లెను,పాత్రలను తెరపై తీసుకురావటానికి చాలా ఇష్టపడి కష్టాపడ్డాడని అర్దమవుతుంది. అయితే ఈ సెల్ ఫోన్ యుగంలో ఇలాంటి కథలు ఇంకా జరుగుతున్నాయా అనే ప్రశ్న ఉదయించకపోతే… తెలంగాణలోని మారుమూల పల్లెటూళ్లో మనుషుల మధ్య బంధాలు, గొడవలను, భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని బలగం’ సినిమాను రూపొందించారు. రెగ్యులర్ కమర్షియల్ హంగులకు పోకుండా ఎమోషన్స్‌తో సినిమాను నడిపించటంలో వేణు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చావింట్లో రాజకీయాలు, ఇగో సమస్యలు మొదలైతే ఎలా ఉంటుందో ప్రతిభావంతంగా చెప్పిన కథ… `బలగం`. సినిమాలో ఇప్పటిదాకా మనం చూడని కొత్త ఎమోషన్స్ కనపడవు. కానీ, కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. అన్నాచెల్లెళ్ళ మధ్య బాండింగ్ చెప్పే సన్నివేశం, పొలం దగ్గర తాతయ్యకు ఇష్టమైన ప్రదేశంలో ప్రియదర్శి ఎమోషనల్ అయ్యే సీన్, ప్రింటింగ్ ప్రెస్‌లో హీరోయిన్ సీన్… ఇలా కొన్ని సీన్స్ హృదయాలను తాకేలా ప్రెజెంట్ చేసారు.
టెక్నికల్ గా:
దిల్ రాజు నిర్మాత అయినప్పుడు టెక్నికల్ గా లోటేముంటుంది. ఈ సినిమా నడవాలంటే కోర్ ఎమోషన్స్ పండాలనే విషయం డైరక్టర్ వేణు గుర్తు పెట్టుకుని చాలా సీన్స్ చేసారు.అందుకు కాసర్ల శ్యామ్ సాహిత్యం & భీమ్స్ సంగీతంలో కలిసి వచ్చింది. తెలంగాణ పల్లె వాతావరణాన్ని, సంస్కృతిని ఆవిష్కరించే లా.. ‘ఊరు పల్లెటూరు…’ పాట బాగుంది. ఆచార్య వేణు సినెమాటోగ్రఫీ ఫెరఫెక్ట్. డైలాగుల్లో తెలంగాణ యాస,నేటివిటి బావున్నాయి. కుటుంబసభ్యుల్లో మార్పు తీసుకురావడానికి బుర్ర కథను నేపథ్యంగా వాడుకున్న సీన్ బాగుంది.
నటీనటుల్లో :
సాయిలు పాత్రకు ప్రియదర్శి ప్రాణం పోసాడు. మొదటి నుంచి తన స్వార్దం తనదే అన్నట్లు కనిపించే ప్రియదర్శి క్లైమాక్స్‌లో తాతయ్యను తలచుకుంటు బాధపడే సీన్లో చక్కగా నటించాడు.కొమురయ్యగా సుధాకర్‌రెడ్డి నటన పెద్ద ప్లస్ కొమురయ్య ఫ్యామిలీ మెంబర్స్‌గా మురళీధర్, కావ్య కళ్యాణ్‌రామ్, జయరాం, రూపలక్ష్మి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
చూడచ్చా :
తెలంగాణా మట్టి వాసన పరిచయమున్న ప్రతీ వారికి నచ్చుతుంది
నటీనటులు :
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు
సాంకేతికవర్గం :
ఛాయాగ్రహణం : ఆచార్య వేణు
పాటలు : కాసర్ల శ్యామ్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సమర్పణ : శిరీష్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత
దర్శకత్వం : వేణు యెల్దండి (వేణు టిల్లు)
Run Time: 2h 11m
విడుదల తేదీ : మార్చి 3, 2023