బెలూన్  సినిమా రివ్యూ

Published On: July 13, 2020   |   Posted By:

బెలూన్  సినిమా రివ్యూ

రేటింగ్: 2/5

ఆ మధ్య కాలంలో హారర్ కామెడీలు తెగ వచ్చేవి. అయితే అవి మొదట్లో ఇచ్చినంత కిక్ తర్వాత కాలంలో ఇవ్వలేకపోయాయి. అందుకు కారణం సినిమాల్లో వచ్చే దెయ్యాలకు, వాటికుండే చీకి పారేసిన తాటిటెంక లాంటి ప్లాష్ బ్యాక్ లకు విసుగెత్తిపోయాం. అయితే ప్రతీ హారర్ కామెడీ రిలీజ్ అయ్యినప్పడల్లా… ఈ సారైనా కాస్తంత నవ్వుకోవచ్చు.. భయపడచ్చు అని వెళ్లినవాళ్లకు నిరాశే మిగులుతోంది. ఓ టైమ్ లో ఇక తెలుగు ప్రేక్షక జనం ఇక హారర్ సినిమాలపై బ్యాన్ పెట్టేద్దామనుకునే టైమ్ లో వాటంతట అవే తగ్గటం మొదలైంది. అయితే అడపా దడపా  ఇంకా ఇక్కడ అదే ట్రెండ్ నడుస్తోందేమో అని భ్రమపడే బ్యాచ్ ఈ తరహా తమిళంలో వచ్చిన సినిమాలను డబ్బింగ్ చేసి వదులుతోంది. ఈ క్రమంలో వచ్చిన చిత్ర రాజం బెలూన్. ఇంతకీ ఈ బెలూన్ లో గాలి ఉందా..లేక తుస్సమందా చూద్దాం.

కృష్ణ అలియాస్ కిట్టు (జై) కి ఒకటి జీవితాశయం అది సినిమా డైరక్టర్ అవుదామని. ఆ మధ్యన వచ్చిన గీతాంజలి సినిమాలో శ్రీనివాస రెడ్డిలాగ ఓ కథ పట్టుకొని నిర్మాత చుట్టూ తిరుగుతుంటాడు. ఈ లోగా ఓ రోజు ఆ నిర్మాత ఇప్పుడు హారర్ కథల సీజన్ నడుస్తోంది. ఆ కథ తెచ్చుకో.. చేసేద్దాం అని అభయమిస్తాడు. సర్లే అసలే సిని ప్రపంచంలో నిర్మాతల కొరత ఎక్కువగా ఉంది. కాస్త నాలెడ్జ్ వస్తే ఆ నిర్మాతే ఓ కథ రాసుకుని, డైరక్షన్ చేసి పాడేస్తున్నాడు. కాబట్టి ఏదో దొరికిన నిర్మాతని సరిగ్గా వాడుకుని సినిమా చేసేయాలని హీరో ఉత్సాహపడతాడు. దీంతో తనకు ఇష్టం లేకపోయినా హారర్ కథ రాసేందుకు సిద్దపడతాడు క్రిష్ణ. ఏదో నాలుగు హారర్ సినిమాలు, నలభై తెలుగు హారర్ కామెడీ లు చూసి కథ రెడీ చేసుకోక… లైవ్ గా దెయ్యాలను ఎక్సపీరియన్స్ చేసి మరీ సినిమా చేద్దామనుకుంటాడు.

అందుకోసం ఫేస్ బుక్ లో చూసిన ఓ పాడుబడిన గృహం పట్టుకుంటాడు. ఇక అక్కడ నుంచి  అరకులో ఉన్న ఆ పాడుబడిన ఇంటికి వెళ్తే తన కథకు ఓ దారి ఏర్పడుతుందని ప్రెండ్స్, , భార్య జెన్నిఫర్ (అంజలి), అన్నయ్య కొడుకు పప్పుతో కలిసి అక్కడికి వెళ్తాడు.  అక్కడే ఓ ట్విస్ట్ ….కృష్ణ ఏ దెయ్యం గురించి రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడో అదే దెయ్యం, అతడి భార్యని, పప్పుని ఆవహిస్తుంది. అక్కడనుంచి కథ మలుపు తిరుగుతంది. ఇంతకీ ఏంటా పాడుపడిన ఇల్లు మ్యాటర్, పెళ్లాన్ని పట్టుకున్న దెయ్యం వదిలేసిందా..ఆ దెయ్యం కథేంటి..ఈ దెయ్యాన్ని వదిలించుకుని మన డైరక్టర్ ఇంతకీ సినిమా ఏమన్నా తీయగలిగాడా వంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటే తప్పనిసరిగా ఈ సినిమా చూసేయండి..

ఎలా ఉందంటే..

ఇక సినిమా ఫస్టాఫ్ బాగానే ఎంగేజ్ చేస్తుంది. కామెడీ కూడా అడపదడపా బాగానే నవ్విస్తుంది. కొద్దిపాటి థ్రిల్స్ ని కూడా స్క్రీన్ ప్లే లో బాగానే మిక్స్ చేసారు. ఇంటర్వల్ సీన్ షాకింగ్ వాల్యూ ఉంది. అయితే సెంకండాఫ్ కే ఈ సినిమాలో బోర్ దెయ్యం పట్టింది. అందులోనూ 2017లో తమిళంలో వచ్చిన ఈ సినిమా ..ఈ కాలం కరోనా ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే. అందులోనూ మనవాళ్లు ఇంతకన్నా దారుణమైన హారర్ కామడీలు చూసేసారు. ఇంక ఆ కుళ్లు జోక్ లకు నవ్వే ఓపిక లేదు. డైరక్టర్ ఏమో …అసలు పాయింట్ వదిలేసి … ముక్కు ఎక్కడ ఉందీ అంటే తల చుట్టూ తిప్పి చూపినట్లు చిన్న విషయాన్ని సాగ తీసి చంపుతాడు. పోనీ కథకు కీలకమైన ప్లాష్ బ్యాక్, మెయిన్ ప్లాట్ లో ఏమన్నా మ్యాటర్ ఉందా …అది సినిమా ప్రారభం రోజుల నాటి రివేంజ్ డ్రామా. దానికి ఎంత కామెడీ పూత పూస్తే మాత్రం మనం చూడగలం.

టెక్నికల్ గా

డైరక్టర్ …ఈ హారర్ కామెడీని సోసోగా తెరకెక్కించాడు. చెప్పుకుని మెచ్చుకోవటానికి ఏమీ లేదు. ఇక యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఉన్నంతలో బాగుంది అనిపిస్తుంది. శరవణన్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అంతకుముంచి బెలూన్ లో ఏమీ లేదు. గాలి మొత్తం తీసేసాడు. ఇక మన తెలుగు హీరో  రాజ్ తరుణ్  కాస్త సర్ ప్రైజ్  వచ్చినప్పటికీ.. ప్రత్యేకంగా కలిసి వచ్చిందేమీలేదు.

చూడచ్చా

ఏ సినిమాలు లేవు, కొత్తగా ఏదో ఒకటి చూడాలనుకుంటే ఓ ఆప్షన్ ఈ సినిమా..అంతకు మించి ఎక్సపెక్ట్ చేయద్దు

నటీనటులు: జై, అంజలి, యోగిబాబు, నాగినీడు, జాయ్‌ మాథ్యూ, మాస్టర్ రిషి

తదితరులు

సినిమాటోగ్రాఫర్: ఆర్‌. శరవణన్‌
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత: మహేష్ గోవిందరాజg
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శినీష్ శ్రీధరన్
రన్ టైమ్: 2 గంటల 13 నిమిషాలు
రిలీజ్ డేట్: జులై 10, 2020
ఫ్లాట్ ఫామ్: జీ5