Reading Time: 3 mins

బొంభాట్ మూవీ రివ్యూ

హాంఫట్ :’బొంభాట్’ రివ్యూ

Rating:1/5
 
 
రోజు రోజుకీ అభివృద్ది చెందుతున్న టెక్నాలిజీని బేస్ చేసుకుని కథలు అల్లి శభాష్ అనిపించుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు. హాలీవుడ్ ఆ విషయంలో ముందుంటే మన వాళ్లు వాటి వెనక పడుతూ లోకల్ ఎమోషన్స్ జతకూర్చి ఆ పాయింట్స్ తో సినిమాలు అప్పుడప్పుడూ తీస్తూంటారు. మరీ ముఖ్యంగా రోబో ల చుట్టూ కథలు అల్లటంలో మనవాళ్లు బాగా వెనక పడ్డారనే చెప్పాలి. ఆ మధ్య ఎప్పుడో శంకర్ రోబో, ఆ తర్వాత రోబో 2, మొన్నీ మధ్య మళయాళంలో ఆండ్రాయిడ్ కట్టప్ప వంటి కథలు మనని పలకరించాయి. అయితే వీటి మధ్య మరికొన్ని ఆ తరహా సినిమాలు వచ్చినా అవేమీ గుర్తుండే ప్రయత్నాలులాగ కూడా మిగలలేదు. ఇప్పుడు అలాంటి మరో ప్రయత్నం మన తెలుగులో దిగింది. ఓటీటిలో రిలీజైన ఈ సినిమా మరోసారి రోబో ని తెరపైకి తెచ్చింది.  ‘బొంభాట్’ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది. అసలు ఈ చిత్రం కథేంటి..మరోసారి మన తెరమీదకు వచ్చి మన ల్యాప్ టాప్ లలో పలకరించిన ఈ రోబో కు ఈ టైటిల్ కు సంభందం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

విక్కీ(సాయి సుశాంత్) పుట్టు దురదృష్టవంతుడు. అతని కన్నా అతని దురదృష్టం అరడుగు ముందే ఉంటుంది. ఇలా తన దురదృష్టంతో రాజీ పడుతూ..క్రింద పడుతూ లేస్తూ జీవితంలో ఒంటిరిగా మిగులుతాడు విక్కీ. అయితే అతని నిరాశామయ జీవితం …ఫ్రొఫిసర్ ఆచార్య (శిశిర్ శర్మ) పరిచయంతో ఇంట్రస్టింగ్ గా మారుతుంది.  ఆయన స్నేహంలో సేద తీరుతూ..ఆయన సలహాతో చైత్ర (చాందిని చౌదరి)తో ప్రేమను పొందుతాడు. అయితే ఆ తర్వాత బ్రేకప్ కూడా అవుతుంది. మరోసారి బాధలో ఉన్న అతనికి అంతకు మించిన విషాదం జీవితంలో చోటు చేసుకుంటుంది. తనను ఇష్టపడే ప్రొఫెసర్ చనిపోతాడు. దాంతో ఆయన కుమార్తె మాయ(సిమ్రాన్ చౌదరి) బాధ్యత విక్కీ తీసుకుంటాడు. అయితే ఆయన మరణం వెనక ఓ సీక్రెట్ ఉందని అర్దమవుతుంది. ఈ లోగా జైలునుంచి వచ్చిన మరో పిచ్చి సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) ఆ ప్రొఫెసర్ కుమార్తె మాయ వెనుక పడతాడు. ఈ లోగా మాయ గురించిన మరో నిజం రివీల్ అయ్యి విక్కీని షాక్ కు గురి చేస్తుంది. అప్పుడు విక్కీ ఏం చేసాడు. ఆయన మరణానికి, ఆ పిచ్చి సైంటిస్ట్ కు సంభందం ఏమిటి…అసలు మాయ గురించిన ఆ నిజం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే,ఎనాలసిస్

ఈ సినిమా కథ చూస్తూంటే శంకర్ రోబో కు, ఇంకాస్త వెనక్కి వెళితే.. 2004లో వచ్చిన I, Robot  ఓ వెర్షన్ లా అనిపిస్తుంది.  అలాగే ఈ కథకు యుఎస్ పి అయిన హ్యూమనాయిడ్ రోబో విషయం చివరి దాకా రివీల్ చేయడు దర్శకుడు. ఎక్కడో ఇంట్రవెల్ దగ్గర టర్న్ తీసుకోవాల్సిన కథ క్లైమాక్స్ దాకా సాగుతుంది. దాంతో ఈ గ్యాప్ లో చాలా బోర్ సీన్స్ వచ్చి మనను భోరుమనేలా చేస్తాయి. కథలో ప్రధానమైన మలుపు రాకుండా ఎంతసేపు అని హీరో లవ్ స్టోరీ, ప్రొఫెసర్ తో ఫ్రెండ్షిప్ వంటి విషయాలు చూడగలం. దానికి తోడు హీరో లవ్ స్టోరీ పరమ బోరింగ్ గా ఉంటుంది. చైత్ర ..వచ్చి వచ్చి ఈ బ్యాడ్ లక్ హీరోకు ఎందుకు పడిందో, ఆ తర్వాత ఎందుకు బ్రేకప్ తీసుకుందో స్పష్టత ఉండదు. పేరుకు సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా, ఆ యాంగిల్ ని సినిమాలో ఎక్కడా పొరపాటున కూడా కనపడనివ్వడు. అసలు హీరో స్వంత తల్లి తండ్రులు కూడా అతని దురదృష్టం చూసి దూరం జరగటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత సినిమాటెక్ అనుకున్నా కథలో ఆ సీన్స్ కొట్టివచ్చినట్లు కనపడుతూంటాయి. ఇక పిచ్చి సైంటిస్ట్ క్యారక్టర్ కూడా సింక్ అవ్వదు. ఏదో చేద్దామని అదేదో చేసేసినట్లు అనిపిస్తుంది.

దర్శకత్వం,మిగతా విభాగాలు

ఈ సినిమా ద్వారా పరిచయం అయిన దర్శకుడు తన తొలి సినిమాకు రోబో బడ్జెట్ దొరకలేదు కాబట్టి ఇలాంటి సినిమా తీసాను అన్నట్లు బిల్డప్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. డైరక్టర్ గానూ ఏమీ ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఇక టైటిల్ కు సినిమాకు ఏ మాత్రం సంభంధం ఉండదు. మిగతా డిపార్టమెంట్స్ అయిన కెమెరా, ఆర్ట్ వర్క్ సినిమాని నిలబెట్టడానికి ప్రయత్నం చేసాయి. కానీ వారి వర్క్ ని కూడా ఈ బ్యాడ్ స్క్ర్రిప్టు కిల్ చేసేసింది. గౌతమ్ రాజు వంటి సీనియర్ చేసిన ఎడిటింగ్ కూడా ఏ మాత్రం మెప్పించదు. ఉన్నంతలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఈ కాన్సెప్టు విని తాము ఓ గొప్ప సినిమా చేస్తున్నామన్న ఫీల్ లో పెట్టుబడి పెట్టేసినట్లున్నారు. స్క్రిప్టు చెత్తగా ఉన్నా డైలాగులు అక్కడక్కాడా బాగానే పడ్డాయి. సంగీతం అయితే ఇక చెప్పుకోనక్కర్లేదు. దారుణంగా ఉంది.

హీరోగా చేసిన సుశాంత్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. అతనితో పోలిస్తే సిమ్రాన్ చౌదరి, చాందినిచౌదరి చాలా బెస్ట్, తణికెళ్ల భరణి వంటి సీనియర్స్ ఉన్నా  పెద్దగా సినిమాకు ఉపయోగపడలేదు. ప్రియదర్శి వంటి ఫెరఫార్మర్ కూడా కూడా వేస్ట్ అయ్యిపోయాడు.
 

చూడచ్చా

ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అని తెలుసుకోవటానికి ఈ సినిమా చూడాలి.


బ్యానర్: సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం
నటీనటులు: సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి, ప్రియదర్శి,మకరంద్ దేశ్ పాండే తదితురులు
సంగీతం: జోష్ బి
ఎడిటర్: గౌతం రాజు
సమర్పణ :దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ
నిర్మాత :విశ్వాస్ హన్నూర్ కార్
రన్ టైమ్: 2 గంటల 12 నిముషాలు
విడుదల తేదీ: డిసెంబర్ 03, 2020
ఓటీటి:  అమెజాన్ ప్రైమ్‌