Reading Time: 3 mins

బ్రోచేవారెవరురా  మూవీ రివ్యూ

బ్రో… అదరకొట్టావురా!! (”బ్రోచేవారెవరురా”  మూవీ రివ్యూ)

Rating:3

కొత్త నీరు తెలుగు పరిశ్రమను చుట్టుముడుతోంది. కొత్త ఆలోచన …సరికొత్త ప్రయోగం…సాలీడ్ హిట్ అనే సినీ సూత్రంతో దూసుకుపోతోంది. అందుకు చిన్న సినిమా వేదిక కావటం చాలా మందిని ఆనందపరిచే అంశం. స్టార్స్ తో చేయలేని చాలా కథలు ఇప్పుడు చిన్న సినిమాకు ప్లస్ అవుతున్నాయి. మొన్నవారం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వస్తే ఈ వారం బ్రోచేవారెవరురా వచ్చింది. రెండూ క్రైమ్,కామెడీని మిక్స్ చేస్తూ స్క్రిప్టునే నమ్ముకుని సరదాగా నవ్విస్తూ హిట్ కొట్టేసాయి. ఇంతకీ ‘బ్రోచేవారెవరురా” లో అంతగా జనాలకు నచ్చే అంశాలేమిటి…స్టోరీ లైన్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్ ఏంటి

రాహుల్ (శ్రీ విష్ణు), రాకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్ రామకృష్ణ)  ముగ్గరూ ఇంటర్ చదివే బేవార్స్ బ్యాచ్.  వాళ్ల  ప్రిన్సిపాల్ కూతురు మిత్ర (నివేదా థామన్) కూడా అదే కాలేజీలో చేరి ఈ బ్యాచ్ లో జాయిన్ అవుతుంది.  ఈమెకి కూడా చదువు మీద ఇంట్రస్ట్ ఉండదు కానీ డాన్సర్ అవ్వాలనే కోరిక ఉంటుంది. కానీ దాదాపు అందరి తండ్రులు లాగానే ఆమె తండ్రికు కూడా ఆమె గొప్పగా చదివేయాలి, ఈ డాన్స్ లు అవీ జాన్తానై అంటూంటాడు. దాంతో ఇది టార్చర్ గా భావించి ఇంట్లోంచి వెళ్లిపోవాలనుకుంటుంది. అందుకు డబ్బులు కావాలి. దానికి సెల్ఫ్ కిడ్నాప్ ప్లాన్ వేస్తారు. ఈ ముగ్గురు కుర్రాళ్లు కలిసి ఆమెతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడి ఎనిమిది లక్షలు వసూల చేస్తారు. అయితే అక్కడే ట్విస్ట్ పడుతుంది. ఈ డబ్బుని తీసుకుని వాళ్లు హైదరాబాద్ వెళ్లేసరికి వీళ్లని రియల్ గ్యాంగ్ మిత్రను  కిడ్నాప్ చేసి పది లక్షలు ఇవ్వమంటుంది. దాంతో వాళ్లు సమస్యలో పడతారు.
 
ఇదిలా ఉంటే అదే సమయంలో మరో కథ జరుగుతూంటుంది.  విశాల్ (సత్యదేవ్) అనే  డైరక్టర్ అయిపోయి వెలిగిపోదామనుకునే అప్ కమింగ్ దర్శకుడు… కష్టపడి  షాలిని (నివేదా పేతురాజ్) అనే హీరోయిన్ ని పట్టుకుని ఆమెకథ విన్పిస్తూంటాడు. కథను ఇష్ట పడటం తో  పాటు పనిలో పనిగా విశాల్ ను కూడా ఇష్టపడుతుంది షాలు. అయితే ఈ లోగా  విశాల్ తండ్రికి యాక్సిడెంట్ జరగడంతో కథ మలుపుతుంది. ఇలా సమాంతరంగా సాగుతున్న ఈ రెండు కథలు  ఓ చోట కలుస్తాయి..అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది? ఫైనల్ గా మిత్ర కిడ్నాప్ డ్రామా  ఏమైంది? విశాల్ తండ్రికి ఎలా యాక్సిడెంట్ అయింది?   నిజాలు తెలుసుకున్న మిత్ర తండ్రి ఏం చేశాడు?…అనేది మిగతా తెరపై చూడాల్సిన ఇంట్రస్టింగ్ కథ.
ఇదీ మిగతా కథ.

 స్క్రీన్ ప్లేనే …

ఇలాంటి సెల్ఫ్ కిడ్నాప్ కథలు గతంలో బోలెడు చూసి ఉన్నా…ఈ సినిమా ప్రెష్ గా అనిపించటానికి కారణం …కిడ్నాప్ థ్రెడ్ కు సినిమా లింక్ కలపటమే. అలాగే ఫస్టాఫ్ ఫన్ తోనూ, సెకండాఫ్ థ్రిల్లింగ్ గానూ నడపాలని స్క్రీన్ ప్లే రాసుకోవటం కలిసివచ్చింది. కామెడీ థ్రిల్లర్ జానర్ లో నడిపించిన ఈ కథను ఎక్కడా పక్క దారులు పట్టించకపోవటమే ఈ దర్శకుడు చేసిన తెలివైనపని. దానికి తోడు డైలాగులు సైతం ఇంటిలిజెంట్ గా ఉండటమే కాక నవ్విస్తాయి. సెకండాఫ్ లో కథ సీరియస్ అయ్యాక కూడా మనకు నవ్వు వస్తుంది.  కామెడీ కు సస్పెన్స్ కలవటం మరీ నచ్చేస్తుంది. హైదరాపబాద్ వెళ్లాక రెండు కథల్లో స్పీడు పెరుగుతుంది. రొమాన్స్ లేకపోయినా ఆ తేజా ఏమీ అనిపించదు. అలాగే సందేశాలు వంటి సామగ్రి పెద్దగా లేకపోవటం మరో రిలీఫ్.


మైనస్ లు

ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలాగే అక్కడక్కడ వచ్చే  కొన్ని లెంగ్తీ ఎపిసోడ్స్ కథనానికి అడ్డుపడతాయి.  ఫస్టాఫ్ లో రన్ టైమ్ ను బాగానే మెయింటైన్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్ లో మాత్రం కొద్దిగా గ్రిప్ మిస్సయ్యాడు. అందుకేనేమో ఫస్టాఫ్ తో పోలిస్తే, సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.  మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి.

నటీనటుల్లో

గతంలో సీరియస్ గా  కనిపించిన  శ్రీ విష్ణు ఈ సినిమాలో చాలా ఉషారుగా నటించాడు. కొంటె  కుర్రాడిగా అతని నటన ఆకట్టుకుంటుంది. నివేదా థామస్‌ మరో ప్లస్. సెకండాఫ్ లో ఆమె పాత్రను కట్టేసినప్పటికీ ఫస్టాఫ్ ఇంపాక్ట్ తో ఆమె జోష్ గా అనిపిస్తుంది. సత్యదేవ్, నివేదా పేతురాజ్‌లది  ట్రాక్ చాలా నాచురల్ గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ గా చేసిన    ప్రియదర్శిని, రాహుల్‌ రామకృష్ణ ఈ సినిమాకు కావాల్సిన జోష్ ని నింపారు. అమాయకపు ఎస్సైగా హర్షవర్థన్‌ అదరకొట్టారు.

టెక్నికల్ గా ..

 కామెడీ సీన్స్ ను అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ కంటెంట్ ను దర్శకుడు వివేక్ ఆత్రేయ బాగా తెరకెక్కించి నిలబెట్టారు. అలాగే  వివేక్ సాగర్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.   సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు పిల్లర్ లా నిలబెట్టింది.   రవితేజ గిరజాల ఎడిటింగ్  బాగుంది. నిర్మాత విజయ్ కుమార్ మాన్యం పాటించిన  నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చూడచ్చా…

 ఫన్, సస్పెన్స్, థ్రిల్, యాక్షన్, లవ్.. ఇలా అన్నీ  కలిసిన ఈ సినిమా అందరికి నచ్చుతుంది.

ఎవరెవరు..

నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, శివాజీ రాజా తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
కూర్పు: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
సమర్పణ: సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాతలు: విజయ్‌ కుమార్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ