Reading Time: 3 mins

భీమదేవరపల్లి బ్రాంచి మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన భీమదేవరపల్లి బ్రాంచి ట్రైలర్ చూడగానే ఏదో విషయముంది అనిపించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు మైత్రీ మూవీస్ వారు డిస్ట్రిబ్యూట్ చేసారు. దాంతో ఎక్సపెక్టేషన్స్ మరింత పెరిగాయి. దాదాపు అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా ఎలా ఉంది  ? మరో బలగం అవుతుందా?రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ :

తెలంగాణ లోని మల్లాపూర్ అనే మారుమూల గ్రామంలోని ప్రజలు కేంద్ర సర్కారు జన్ ధన్ ఖాతా పేరుతో జీరో అకౌంట్ ఉచితంగా ఇస్తున్నారని, ఖాతా ఓపెన్ చేస్తే అకౌంట్లో పదిహేనులక్షలు వేస్తారని చెప్పడంతో అందరూ పోటీలు పడి ఖాతా ఓపెన్ చేశారు. కానీ ఎవరికి డబ్బు రాలేదు. కొన్ని రోజుల తర్వాత అదే ఊళ్ళో కూలి నాలి చేసుకుని బతికే సమ్మక్క అకౌంట్లో సడన్గా పదిహేను లక్షలు పడ్డాయి. కేంద్ర సర్కారు తమ అకౌంట్లో డబ్బులు వేశారని సమ్మక్క కుటుంబం ఆనందంగా ఆ డబ్బులు ఖర్చు చేశారు. ఢిల్లీ పెద్ద సార్కు కృతజ్ఞతలు తెలుపుతూ మెయిల్ కూడా పెట్టారు సమ్మక్క లెక్క మాకు కూడా అకౌంట్లో డబ్బులు పడతాయని ఊర్లో కొందరు ఒక పైరవికారుకు డబ్బులు ఇచ్చి ఎదురుచూస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక సమస్య ఆ సమస్య నుంచి బయటపడాలని ఆశ. నెల రోజుల తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్ బ్యాంకు వాళ్ళు సమ్మక్క ఇంటికీ వచ్చి వేరే వాళ్ళ అకౌంట్లో పడాల్సిన డబ్బులు పొరపాటున మీ (సమ్మక్క)అకౌంట్లో పడ్డాయని. వెంటనే ఆ పదిహేను లక్షలు బ్యాంక్లో కట్టమని సమ్మక్క కుటుంబాన్ని ఒత్తిడి చేస్తారు. నోటీసులు ఇస్తారు. అప్పటికి చేతిలో రూపాయి కూడా లేని ఆ కుటుంబం. దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మాకు కేంద్రం డబ్బులు వేసింది అని మొత్తుకున్నారు.ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది ఇప్పుడు సమ్మక్క డబ్బులు కట్టాలా వద్దా? తప్పు బ్యాంకు వాళ్లదా?, సర్కార్ దా అదే సినిమా.

విశ్లేషణ:

ప్రతీ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవ్వటం కష్టమే కానీ చిన్నసినిమా చిన్న గుంపుని అయినా ఎట్రాక్ట్ చేయగలగాలి. అందుకు తగ్గ కథ కథాంశాలు ఎంచుకోవాలి. దర్శక,రచయిత రమేష్ చెప్పాలి చాలా వరకూ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. . అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే, ప్రభుత్వాలు ఇచ్చాయనుకుని  ఖర్చు చేసేస్తే ఆ తర్వాత తలెత్తిన పర్యవసానాలు ఏమిటన్నది ఈ భీమదేవరపల్లి బ్రాంచి సినిమా మెయిన్ పాయింట్ గా తీసుకున్నారు కానీ తమ ఎక్కౌంట్ లో డబ్బులు పొరపాటున పడితే తప్పు ఎవరిది బ్యాంక్ వాళ్లది. అది హైలెట్ చేయలేకపోయారు. ఆ తప్పుని ఎత్తి చూపలేకపోయారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పధకం తప్పేముంది అది గుర్తించకుండా కథనం రాసుకుంటూ పోయారు. హీరో తనకు సమస్య వస్తే ఏడుస్తూ కూర్చోవటం తప్పించి ఏమీ చెయ్యలేకపోతాడు. ఆ సమస్య నుంచి పుట్టిన బాధల్లో మునిగిపోతాడు. ఏమి చేయలేని నిస్సహాయ స్దితిని చూడటానికి థియేటర్ కు వెళ్లం కదా. ఆ విషయం గుర్తించకోపవంట వల్లే సినిమా సెకండాఫ్ ని దెబ్బ తీసింది. లేకపోతే ఈ సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉండి మరో బలగం అయ్యేది. బలగం బలం అంతా ఆ స్క్రిప్టులో ఉందని గమనించకపోవటం వల్లన వచ్చిన సమస్య ఇది. అయితే బలగం తర్వాత తెలంగాణా పల్లెను రిప్రజెంట్ చేస్తూ వచ్చిన సినిమా భీమదేవరపల్లి బ్రాంచి కావటం మాత్రం సంతోషించతగ్గ విషయం. తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం, ట్రైలర్ చూడగానే మంచి విషయముంది అనిపించడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారనిపిస్తుంది. సరైన పబ్లిసిటీ చేయలేకపోయారు. అలాగే సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లలేకపోయారు.

టెక్నికల్ గా :

సహజత్వానికి పెద్ద పీట వేస్తూ సినిమాలు రాయటం ,తీయటం ఎప్పుడూ కత్తిమీద సామే. అందులోనూ కమర్షియల్ ఫీల్డ్ గా చెప్పబడే టాలీవడ్ లో. ఆ విషయంలో వందశాతం సక్సెస్ అయ్యారు దర్శకుడు. అయితే స్క్రిప్టు మరింత బాగా రాసుకుని ఉంటే బాగుండేది. దర్శకుడుగా అన్ని విభాగాల నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. ఇక  సాకేంతికంగా సినిమా ఓకే అనిపిస్తుంది. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. పాటలు బాగున్నాయి.అయితే అన్ని పాటలు కూడా అనవసరం. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ నాశిగా ఉన్నాయి.

నటీనటుల్లో బలగం సినిమాలో కనిపించిన కొంతమంది ఈ సినిమాలో కనిపిస్తారు. మిగతా వాళ్ళంతా కొత్తవాల్లే ఉన్నంతలో ప్రధాన పాత్ర జంపన్న చేసిన అంజిబాబు బాగా చేసారు.

చూడచ్చా :

సరదాగా ఓ వీకెండ్ కాలక్షేపానికి ఈ సినిమా ఖచ్చితంగా పనికొస్తుంది.

నటీనటులు :

సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప, అంజి బాబు,రాజవ్వ, శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి, పద్మ, ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ తదితరులు

సాంకేతికవర్గం :

బ్యానర్స్: ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రాఫర్: కె. చిట్టిబాబు
ఆర్ట్: టి. మోహన్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
రచన, దర్శకత్వం: రమేష్‌ చెప్పాల
రన్ టైమ్ : 134 నిముషాలు
నిర్మాతలు: బత్తిని కీర్తిలత, రాజా నరేందర్‌ చెట్లపెల్లి
విడుదల తేదీ: జూన్ 23, 2023