భీష్మ మూవీ సక్సెస్ మీట్
‘భీష్మ’ను ఆద్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.. అందుకే ఇంత పెద్ద హిట్టయ్యింది -‘భీష్మ’ సక్సెస్ మీట్ లో దిల్ రాజు
ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, వాటి వివరాల్లోకి వెళితే….
ఈ సందర్భంగా ముందుగా గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “క్లైమాక్స్ ముందు వచ్చే ‘వాటే బ్యూటీ’ పాట రాశాను. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసింది. మహతి సాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘భీష్మ’ ఇంత పెద్ద హిట్ కావడం చాలా ఆనందాన్నిస్తోంది” అన్నారు. ఇది ‘హాసమ్’ సక్సెస్ అని మరో గేయరచయిత శ్రీమణి అన్నారు. ఈ బ్యానర్ తో ‘జులాయి’ సినిమా నుంచి అనుబంధం ఉందని చెప్పారు.
సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ మాట్లాడుతూ, “మా తండ్రులు గర్వపడేలా ‘భీష్మ’ను వెంకీ రూపొందించారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా ఆనందాన్నిస్తోంది” అన్నారు. ‘భీష్మ’ సక్సెస్ తనకు చాలా ఆనందాన్నిచ్చిందని సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ చెప్పారు. అందరూ సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారని అన్నారు.
నటుడు సంపత్ రాజ్ మాట్లాడుతూ, “నాకు ‘తియ్యరా బండి’ అనే డైలాగ్ చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. ఈ సినిమాలో దానికి భిన్నమైన క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్. దానికి ప్రశంసలు రావడం హ్యాపీ. అందరూ ఈ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సినిమా తీసిన, నన్ను ఇందులో తీసుకున్న నిర్మాతలకు థాంక్స్. నితిన్ చాలా బాగా చేశారు. ఆయనకు మరెన్నో హిట్లు రావాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ, “ప్రి రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. తొలి సినిమా ‘ఛలో’తో హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా ‘భీష్మ’తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ విజన్ పర్ఫెక్టుగా ఉంటే ‘భీష్మ’కు వచ్చిన ఫలితమే వస్తుంది. రష్మికలో అసాధారణ ఎనర్జీ ఉంది. హీరోలతో పోటీపడుతూ డాన్స్ చేస్తుంది. చక్కగా నటిస్తుంది. నితిన్ తో మేం ‘శ్రీనివాస కల్యాణం’తో హిట్ కొట్టాలనుకున్నాం కానీ, కుదరలేదు. సినిమాలో మంచి కామెడీ ఉంటే, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ఇప్పుడు ‘భీష్మ’ నిరూపించాయి. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. యూత్ బాగా ఆదరిస్తున్నారు” అని చెప్పారు.
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, “నిర్మాతలు చినబాబు, వంశీ గార్లు, నితిన్.. నా స్క్రిప్టును నమ్మి ‘భీష్మ’ను చేసే అవకాశం ఇచ్చారు. వాళ్లకు థాంక్స్. నా టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తియ్యగలిగాను. తను ఇదివరకు చేసిన పాత్రలకు చాలా భిన్నమైన పాత్రను ఈ మూవీలో సంపత్ రాజ్ చాలా బాగా చేశారు. అనంత్ నాగ్, జిషుసేన్ గుప్తా తమ పాత్రలకు జీవం పోశారు. ‘దిల్’ సినిమా నుంచి నేను నితిన్ ను అభిమానిస్తూ వస్తున్నా. ఆయనను అభిమానించేవాడిగానే ఈ సినిమా తీశాను. కలిసి పనిచేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా. నా ఊహకు భిన్నంగా కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని రష్మిక ఈ సినిమా చేసింది. తను స్నేహానికి విలువ ఇచ్చింది” అన్నారు.
హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ, “ఈ మూవీని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. క్రిటిక్స్ మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీకి రుణపడి ఉంటాను. ‘భీష్మ’ పాత్రలో నితిన్ ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డాను. మంచి మ్యూజిక్, చక్కని సినిమాటోగ్రఫీతో అన్నీ చక్కగా కుదిరిన సినిమా ఇది. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ, “సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది. నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్ తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ఇచ్చిన రీరికార్డింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. రష్మికతో కంటే సంపత్ రాజ్ తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. కాసర్ల, శ్రీమణి చాలా మంచి పాటలు ఇచ్చారు. ‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. ‘అ ఆ’తో నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్టిచ్చిన బ్యానర్ లోనే నాకు మళ్లీ హిట్ వచ్చింది. ఈ సంస్థలో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
ఈ విజయోత్సవ వేడుకలో సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ చిత్ర బృందం పాల్గొన్నారు.