మనం సైతంకు చంద్రబాబు ప్రశంస
తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు మనం సైతం చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. తిత్లీ ప్రభావిత ఆరు గ్రామాలైన భర్తుపురం, కందులగూడెం, సవరనీలాపురం, మల్లివీడు, సాగరం పేట, నాయుడు పోలేరు గ్రామాల్లో మనం సైతం బృందం పర్యటించి, అక్కడి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించింది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మనం సైతం సభ్యులు కలిసి తమ సేవా కార్యక్రమాలను వివరించారు. వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి మనం సైతం సేవా దృక్పథాన్ని అభినందించారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు మనం సైతం సారథి కాదంబరి కిరణ్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ పేదలకు అవసరం ఉన్నా తమవంతు సహాయం అందించేందుకు మనం సైతం సిద్ధంగా ఉందని కాదంబరి చెప్పారు. కాదంబరి కిరణ్ వెంట ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, వినోద్ బాలా, సురేష్ తదితరులు ఉన్నారు.