మహాసముద్రం మూవీ రివ్యూ

Published On: October 14, 2021   |   Posted By:

మహాసముద్రం మూవీ రివ్యూ

శర్వా, సిద్దార్ద్ ల ‘మహాసముద్రం’ రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) :  

👎

అదిరిపోయే స్టార్ క్యాస్టింగ్,  ఫస్ట్ సినిమానే ‘ఆర్‌ఎక్స్‌ 100’  వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్, ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్‌ రావడం ఇవన్నీ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో తీసుకెళ్ళాయి. అలాగే ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేసారు.  ఈ నేపధ్యంలో సినిమా ఎలా ఉంటుంది.. అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన సినిమా మహాసముద్రం. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది, ఈ సినిమాకు ఇద్దరు హీరోలా? లేక ఒకరు హీరో? మరొకరు విలనా? ఏంటి.. అసలు సినిమా కథలో ఉన్న ట్విస్ట్..  పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సిద్దార్ద్ కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకూ ఉపకరిస్తుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

 అర్జున్‌(శర్వానంద్‌), విజయ్‌(సిద్ధార్థ్‌) ఇద్దరు క్లోజ్ ప్రెండ్. అర్జున్‌ కు  ఏదైనా బిజినెస్‌ చేసి సెటిలవ్వాలని ఉంటుంది. విజయ్‌ కు పోలీస్ ఎస్సై అవ్వాలని జీవితాశయం. అందుకోసం ట్రై చేస్తుంటాడు. ఇక అదే వైజాగ్ లో ఉండే మహాలక్ష్మీ అలియాస్‌ మహా(అదితిరావు హైదరీ) ..విజయ్ తో ప్రేమలో ఉంటుంది‌.  ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరో ప్రక్క అర్జున్‌ తనకు పరిచయమైన లా స్టూడెంట్‌ స్మిత(అను ఇమ్మాన్యుయేల్‌)తో ప్రేమలో ఉంటాడు.  ఇక అదే సిటీలో ధనుంజయ్(గరుడ రామచంద్రరావు) అనే స్మగ్లర్. సముద్రం మీద బ్రతికే అతని అరాచకాలకు అంతం ఉండదు. దాంతో అతనంటే అందరికి భయం. అయితే అనుకోని  పరిస్దితుల్లో విజయ్..అతన్ని చంపేస్తాడు. అతని మనుష్యులు చంపేస్తారనే భయంతో పారిపోతాడు. తన ప్రేయసిని కూడా తీసుకెళ్లడు. అయితే నాలుగేళ్ళ తర్వాత మళ్లీ వైజాగ్ కు వస్తాడు. అప్పటికే చాలా పరిణామాలు జరిగిపోతాయి. అప్పటికీ అర్జున్‌ డ్రగ్స్‌ మాఫియా డాన్‌గా ఎదుగుతాడు.  ప్రాణంగా ప్రేమించిన మహా..తన ప్రెండ్ అర్జున్ తోనే ఉంటుంది. అవన్నీ చూసిన విజయ్ ఏం చేసాడు? ఈ కథలో చుంచు మామ (జగపతిబాబు), గూని బాబ్జీ (రావు రమేష్) పాత్రలు ఏమిటి…?  అర్జున్‌ తో ప్రేమలో ఉన్న స్మిత ఏమైంది,  అర్జున్‌ డ్రగ్స్‌ మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

కొన్ని ప్రధాన పాత్రలు అనుకుని వాటితో కథను నేరేట్ చేసే ప్రయత్నం చేసారు దర్శకుడు అజయ్ భూపతి. ఇలా డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో జరిగే కథల్లో ఇమేజ్ లేని ఆర్టిస్ట్ లు ఉంటే పని ఈజీ అవుతుంది. అలాకాకుండా ఇద్దరు హీరోలు అని సినిమా మొదట నుంచి ప్రొజెక్టు చేస్తూ వచ్చి …తెరపై వాళ్లు కేవలం ప్రధాన పాత్రలే అని తేల్చేయటంతో ఇబ్బంది వచ్చింది. శర్వా, సిద్దార్ద్ లలో ఎవరిని ఫాలో అయ్యి, కథలోకి వెళ్లాలో తెలియని కన్ఫూజన్ ఏర్పడింది. మొదట శర్వా పాయింటాఫ్ తో మొదలెట్టినా పాత్రల పరిచయం అనే సెటప్ పూర్తయ్యే సరికి అది డైరక్టర్ పాయింటాప్ వ్యూలోకి షిప్ట్ అయ్యిపోయింది. రెండు క్యారక్టర్స్ గా హీరోలను చూడాలని డైరక్టర్ ఆలోచన. కానీ అది కుదరలేదు. ఇద్దరి హీరోలకు చెరో లవ్ స్టోరీ పెట్టారు. కానీ రెండు రొటీన్ ట్రాక్ లే కావటంతో  రెండు ప్రేమ‌క‌థ‌ల్లో దేనితోనూ ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవ‌లేని ప‌రిస్థితి. పోనీ ఎంతో ఆర్బాటంగా ఇంట్రడ్యూస్ చేసిన ధ‌నుంజ‌య్‌గా( రామ‌చంద్ర), గూని బాబ్జీ (రావు ర‌మేష్)‌, చుంచు మామ‌(జ‌గ‌ప‌తిబాబు) పాత్ర‌లు కూడా కథని ముందుకు తీసుకెళ్లవు. కాస్త పవర్ ఫుల్ గా ఉన్న ధనుంజయ్ పాత్రను ఇంటర్వెల్ కే చంపేసారు. దాంతో హీరోలకు లేదా కథకు థ్రెట్ లేకుండా పోయింది. అలాగే హీరోలకు కథలో కాంప్లిక్ట్ లేదు. సిద్దార్ద్ పాత్ర సమస్యను డీల్ చేయలేక పారిపోతుంది. సెకండాఫ్ లో వస్తుంది కానీ ఎమోషన్ అయ్యి వృధా అయ్యిపోతుంది. శర్వా  పాత్రకు అయితే అసలు సంఘర్షణే ఉండదు. అన్ని అతనికి అనుకూలంగా జరుగుతాయి.

సెకండాఫ్ లో సిద్దార్ద్ తిరిగి వచ్చాక కథ కాంప్లిక్ట్ లోకి ప్రవేసిస్తుందికానీ అప్పటికే ఎండ్ కార్డ్ కు దగ్గర పడిపోతాం. అలాగే ఫస్టాఫ్ చూసి…విషయం ఏమీ లేదే అనుకుంటాం. కానీ సెకండాఫ్ చూసాక..ఫస్టాఫే బెస్ట్…అంతో ఇంతో క‌థ నడిచింది అనిపిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ అయితే విసుగెత్తించేస్తాయి. టీవి సీరియల్ చూస్తున్న ఫీల్ కలగ చేస్తాయి. ఇంత దారుణమైన స్క్రీన్‌ప్లే ఈ మధ్యకాలంలో చూడలేదనిపిస్తుంది. ఇవి చాలదన్నట్లు ఆ క్యారక్టర్స్ కు కూడా స్దిరత్వం ఉండదు.  ఓవైపు హీరో శర్వా మ‌రో హీరోయిన్ అను ఇమ్మ‌న్యుయేల్‌ తో ప్రేమ‌లో ఉంటే., ఓ బిడ్డ‌కు తల్లిగా ఉన్న మ‌రో హీరోయిన్ అదితి రావు హైదరీ..శర్వాను ఊహిస్తూ డ్యూయెట్ పాడేసుకుంటుంది. ఇలాంటివే కదా సినిమాని చంపేసేవి. ఇక క్లైమాక్స్ లో  శర్వా, సిద్దార్ద్ కు మధ్య వార్ ఓ రేంజిలో ఉంటుందేమో అనుకుంటాం. కానీ పరమ బోరంగ్ గా, చాలా పేల‌వంగా ముగించారు. అన్నిటికన్నా ముఖ్యం తన స్నేహితుడైన సిద్దార్ద్ ఊరు వదిలేసి పారిపోతే, అదీ తన గర్ల్ ప్రెండ్ ని వదిలేసి మరీ..అలాంటివాడుని వెతకాలనే ఆలోచన హీరో శర్వాకు అసలు రాదు. విలన్ రావు రమేష్ వెతుక్కుంటూ వెళ్తాడు కానీ శర్వా ఆ దిశగా ఆలోచన చేయకపోవటం విచిత్రంగా అనిపిస్తుంది.

  నచ్చినవి

ఇంటర్వెల్ ఫైట్
 రావు రమేష్ నటన
సినిమాటోగ్రఫీ
 ఫస్టాప్ లో వచ్చే సీన్స్

నచ్చనవి
సెకండాఫ్
వీక్ గా ఉన్న కథ,కథనం
ఎంటర్టైన్మెంట్ అసలు లేకపోవటం
పాటలు

టెక్నికల్ గా…
ఈ సినిమాకు కథ,కథనమే సక్సెస్ కు అడ్డం పడ్డాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు,ఎమోషన్స్ ఏమీ పండలేదు. అయితే అలాంటి బోర్ సీన్స్ కు కూడా చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసే ప్రయత్నం చేసింది. పాటలు అయితే బాగోలేవు. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట‌ సినిమాలో విజువల్స్ ని బాగా ప్రెజెంట్ చేసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బాగుందనిపించినా, సెకండ్ హాఫ్ లో సహన పరీక్షకు కారణమైంది. కొన్ని సీన్లను ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గిస్తే  బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

ఇక నటీనటుల్లో …

కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్ లో శర్వానంద్ తన ఈజ్ ని ప్రదర్శించారు. సిద్ధార్థ్‌ లుక్స్ ఓల్డ్ గా ఉన్న ఫీల్ ఇచ్చాయి.  హీరోయిన్ అదితిరావు హైద‌రీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనూ నటన తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా ఓకే. జ‌గ‌ప‌తిబాబు, రావు రమేష్ లు క్యారక్టరైజేషన్స్,నటన గుర్తుండిపోయేలా ఉన్నాయి.  
 
చూడచ్చా
ఓటీటి రిలీజ్ అయ్యేదాకా ఆగటం మేలు

 
తెర వెనక, ముందు

నిర్మాణం: ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, జగపతి బాబు, శరణ్య తదితరులు
 సంగీతం: చేతన్ భరద్వాజ్,
 కెమెరా: రాజ్‌ తోట,
ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్,
పాటలు: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్‌, కిట్టు విస్సాప్రగడ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి
రన్ టైమ్:2h గంటల36 నిముషాలు
విడుదల తేదీ: 14-10-2021