మాలిక్(మళయాళO) మూవీ రివ్యూ
గాడ్ ఫాధర్’ కు గ్రాండ్ డాటర్: ‘మాలిక్’ రివ్యూ
Rating:3/5
ఫహద్ ఫాజిల్ ఇంతకు ముందు వరకూ సంగతేమో కానీ ఓ ప్రక్కన అల్లు అర్జున్ సినిమా పుష్పలో విలన్ గా చేయటం, మరో ప్రక్క ఓటీటిలో వరస పెట్టి అతను నటించిన మళయాళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవటంతో మెల్లిమెల్లిగా ఇక్కడవాళ్లకు బాగా తెలిసిపోయాడు. ముఖ్యంగా అతను సినిమా ఒకటి చూసినా అతని విలక్షణ నటన గుర్తుండిపోతుంది. ఆ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటిలో విడుదలయ్యింది. ముందు నుంచే కేరళలో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమాని మనవాళ్ళు కూడా ఆసక్తి చూపించారు. అలాగే ఇంతకు ముందు ఫహద్‌తో ‘సీయూ సూన్’ తీసిన మహేశ్ నారాయణన్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా ఓటీటిలో వచ్చింది. చాలా విభిన్న చిత్రం. అదే కాంబినేషన్ లో వచ్చిన ‘మాలిక్’ మనకు నచ్చుతుందా? కథేటి…చూడదగ్గ సినిమాయేనా రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
కేరళ కోస్టల్ విలేజ్ రామడపల్లి లో వయస్సు మీద పడ్డ గ్యాంగస్టర్ అలీ అహ్మద్ సులేమాన్ మాలిక్ (ఫహద్ ఫాజిల్). అతను హజ్ యాత్రకు బయిలుదేరే సమయంలో కేరళ పోలీస్ లు వచ్చి టాడా యాక్ట్ ప్రకారం కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఆ కేసు ఏళ్ల క్రితం జరిగిన ఓ మత ఘర్షణ కేసు. దాన్ని ప్రెష్ గా రీ ఓపెన్ చేసి.. హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న సులేమాన్ని జైలుకి పంపిస్తారు. అంతేకాదు జైల్లోనే అతడిని చంపేయాలని ప్లాన్ చేస్తారు. అసలు ఎవరీ సులేమాన్..అతన్ని జైల్లోనే పోలీస్ లు అంతమొందిస్తారా..అసలు జరిగిందేమిటి…ఓ సామాన్యుడుగా జీవితం మొదలెట్టిన సులేమాన్ ..ప్రభుత్వాలని భయపెట్టే గ్యాంగస్ట్రర్ స్దాయికి ఎలా ఎదిగాడు వంటి విషయాలు చుట్టూ తిరిగే కథే ఇది.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …
ఇది ఇప్పటి కథా కాదు.కొత్తది అసలూ కాదు..అన్ని దేశాల్లో..అన్ని చోట్లా ఉన్నదే. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ హయాంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నైతిక సంక్షోభానికి నిదర్శనం. ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణం. రాజకీయ నాయకుల దాష్టీకానికి ఒక వేపు జనం మరణిస్తుంటే, బలైపోతూ ఉంటే ప్రభుత్వాల వైఖరి చీదర కలిగిస్త్తూంటుంది. అధికారంలో ఉన్న నాయకులు, తమ నాయకత్వం ఎంత పటిష్ఠమైందో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూంటారు. పొరపాటున తమ హక్కుల కోసం నిరసన తెలియజేస్తే ఒదిరిపెట్టరు. వారి మీద అఘాయిత్యాలకు పాల్పడినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం కనబరచడం లేదు. ఇలాంటప్పుడే ఓ నాయకుడు పుట్టుకొస్తాడు. తన కోసం మొదలెట్టిన పోరాటం తన వారి కోసం పోరాటం గా మారుస్తాడు.
ఈ కథ ఎన్నో సార్లు తెరకెక్కింది. గాఢ్ ఫాధర్, నాయకుడు, క్షత్రియపుత్రుడు, అభిమన్యు ఇలా ఎన్నో సినిమాలు, కథలు. ఇదిగో ఇప్పుడు మరోసారి అదే కథ. ఇందులో హీరో అలీ తన చుట్టూ ఉన్న వెనుకబడిన వర్గాల అవసరాలు తీర్చడం కోసం తప్పుదారి పడతాడు. కానీ ఇలా చేసుకుంటూ వెళ్లే కొద్దీ తాను చేస్తున్నది సరైనది కాదని తెలుసుకుంటాడు. ఈలోగా సామజిక రాజకీయ అవసరాలు అలీని నీడలా వెంటాడటం మొదలుపెడతాయి. మరి అలీ చివరికి ఏ మజిలీ చేరుకున్నాడు అనేది ఆసక్తికరమైన విషయం. ఇలాంటి కథలను స్క్రిప్టుగా చేయాలంటే చాలా కష్టం. అయితే ఓ ఫార్మెట్ ఉంటుంది కాబట్టి కొంతలో కొంత ఈజీ. కానీ ఫార్మెట్ ని అనుసరించి వెళ్లటం వల్ల మళ్లీ అదే సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాకూ అదే సమస్య. మళ్లీ నాయకుడు చూస్తున్నామని మధ్య మధ్యలో అనిపిస్తుంది.
దర్శకత్వం, మిగతా విభాగాలు
దర్శకుడు మహేష్ నారాయణన్ తీసుకున్న పాయింట్ లో కొత్తదనం లేదని అర్దమవుతుంది. పాపులర్ ఫిల్మ్ లు అయిన గాడ్ ఫాదర్, నాయకుడు, సత్య, కంపెనీ ఇలా చాలా సినిమాల నుంచి తీసుకున్న స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇందుకు మతం అనే లేయిర్ కలపటం తో కొత్తదనం వచ్చింది. అలాగే 2009 కేరళలోని ఓ ఊరిలో సాధారణ పౌరుల మీద రాజకీయ ప్రోద్బలంతో పోలీసులు కాల్పులు జరిపిన ఉదంతం చుట్టూ ఈ డ్రామాను అల్లుకోవడం మాలిక్ ని కొంత ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పాలి.
స్క్రిప్టు వైజ్ గా ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నా దాని తర్వాత ఈ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే విధంగా టేకింగ్ తో మెప్పించాడు.. కేవలం ఫహద్ కోసమే చివరిదాకా చూడొచ్చనేలా మాలిక్ సాగింది. ఇక రెగ్యులర్ గా మళయాళ సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్లకు ఫాజిల్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఒరిజినల్ వెర్షన్ కేవలం ఇతని యాక్టింగ్ వల్లే పెద్ద స్థాయిలో ఆడిందనేది అందరికీ తెలిసున్న విషయమే.
సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్…సింగిల్ టేక్ లో తీసిన షాట్స్ సినిమాకు కొత్తదనం తెచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని చాలా చోట్ల లేపింది. స్లో నేరేషన్ ని ఇబ్బంది లేకుండా చేసింది. అలాగే కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్టమెంట్ కష్టం కనిపిస్తుంది.
చూడచ్చా
మంచి టైప్ పాస్,టెక్నికల్ గా బ్రిలియన్సీ నచ్చుతాయి.ఓకే వాచ్ గా ట్రై చేయొచ్చు
తెర వెనక..ముందు
నిర్మాణ సంస్థ: ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ;
నటీనటులు: ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్రట్, జోజూ జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రాన్స్, పార్వతి కృష్ణ, సనల్ అమన్ తదితరులు
సంగీతం: సుషిన్ శ్యామ్;
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్;
ఎడిటింగ్: మహేశ్ నారాయణన్;
నిర్మాత: ఆంటో జోసెఫ్;
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్ నారాయణన్;
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
తేదీ: 15-07-2021
రన్ టైం: 2గంటల 42 నిమిషాలు