మేక సూరి 2 మూవీ రివ్యూ

Published On: November 28, 2020   |   Posted By:

మేక సూరి 2 మూవీ రివ్యూ

Image

మరోతూరి: ‘మేక సూరి 2’ మూవీ రివ్యూ
రేటింగ్: 2.5/5

సాధారణంగా ఓ సినిమా హిట్టైతే ..దాని సీక్వెల్ తీస్తూంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా సినిమాలు,వెబ్ సీరిస్ లు సీక్వెల్స్ ,ప్రీక్వెల్స్ తో పలకరిస్తున్నాయి. స్క్రిప్టు రాసుకునేటప్పుడే సెంకండ్ పార్ట్ కు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి ఓ ప్రయత్నమే  ‘మేక సూరి 2’. మొదట పార్ట్ అద్బుతం కాకపోయినా బాగానే ఉందనిపించుకోవటంతో ఇదిగో ఈ సెకండ్ పార్ట్ ని వదిలారు. ఫస్ట్ పార్ట్ కు ఈ లేటెస్ట్ స్పార్క్ కు ఉన్న లింక్ ఏమిటి… సెకండ్ పార్ట్ తీసెటంత విషయం ఉన్న సబ్జెక్టేనా…ఇప్పుడు రెండో పార్ట్ లో ఏమి చూపించారు…మేక సూరి జీవితంలో వచ్చే కొత్త మలుపులు మనల్ని ఆకట్టుకుంటాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్

 మేక మాంసం విక్రయించడం సూరి(అభిన‌య్‌) వృత్తి. అందుకే అతన్ని అందరూ మేక సూరి అని పిలుస్తుంటారు. అతను ఆ ఊరిలో రాణి(సుమ‌య‌)అనే ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారి జీవితాలు అంతా సాఫీగా సాగిపోతున్నాయన్న తరుణంలోనే రాణి హత్యకు గురవుతుంది. రాణి ని అప్ప‌ల‌నాయుడు స‌హా మ‌రికొంత మంది క‌లిసి మాన‌భంగం చేసి హ‌త్య చేస్తారు. తన ప్రేయసి హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవడం కోసం సూరి కొంతమంది న‌క్స‌లైట్స్‌తో క‌లుస్తాడు. మరో ప్రక్క ప్ర‌తీకార హ‌త్య‌ల‌ను ఆపే క్ర‌మంలో పోలీసులు సూరిని ఎన్‌కౌంట‌ర్ చేస్తారనే వ‌ర‌కు ఫస్ట్ పార్ట్ లో ఉంది.   ఇక సెకండ్ పార్ట్  విష‌యానికి వ‌స్తే లైంగిక నేరాలు చేసేవారిని, వారిని స‌మ‌ర్ధించే వారిని సూరి చంపుతుంటాడు. అత‌న్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఏసీపీ(ప్ర‌మోద్‌)ని నియ‌మిస్తుంది. అత‌ను సూరిని ఎన్‌కౌంట‌ర్ చేసిన పోలీస్ అధికారుల‌ను విచారిస్తాడు. అందులో త‌న‌కి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అవేంటి? ఈ క్రమంలో పోలీస్ వీరభద్రంకు సూరి పై ఉన్న పగ కారణం ఏమిటి ? అతనెందుకు సూరిని చంపాలనుకుంటున్నాడు ? చివరకి వీరభద్రం సూరికి చేసిన సాయం ఏమిటి ? మొత్తంగా మేక సూరి కథ ఎలా ముగిసింది ? అనేదే మిగిలిన కథ.

 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్

దర్శకుడు ఈ సినిమాని పూర్తి రా తీయాలనుకున్నారు. అందుకు తగ్గ సన్నివేశాలనే ఎంచుకుని హైలెట్ చేసుకుంటూ వచ్చారు. అయితే మేక సూరి పాత్రకు హెవీ బిల్డప్ ఇవ్వటం మాత్రం సహజత్వాన్ని దెబ్బ తీసింది. సినిమాకు ఉన్న ఫోకస్ ని, అవుట్ లుక్ ని మార్చేసింది. ముఖ్యంగా మేక సూరి నక్సలైట్స్ లో చేర‌డం, వారు అత‌నికి సాయం చేసే స‌ీన్స్ ఎక్కడా కన్వీసింగ్ గా అనిపించవు. సరికదా చాలా చోట్ల సిల్లీగా అనిపిస్తాయి. దానికి తోడు మరో కామెడీ ఏమిటి అంటే.. సూరి.. పోలీసుల‌తో ఆడే మైండ్ గేమ్స్ . అవి చూస్తూంటే నవ్వు వస్తుంది. చాలా సీన్స్ స్లోగా, సాగతీసినట్లుగా ఉండి సహనానికి పరీక్ష పెడతాయి. పోనీ డైలాగ్స్ ఏమన్నా బాగున్నాయా అంటే చాలా వరకూ అవి వినలేము. రా ముసుగులో పచ్చిగా డైలాగులు రాసారు. పాతకాలం సినిమాల్లో ఉండే డైలాగుల్లా ఉన్నాయి. అయితే ఫస్ట్ పార్ట్ మూడ్ ని ఈ సెకండ్ పార్ట్ లోనూ కంటిన్యూ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. సూరి ఇంట్రడక్షన్ సీన్ అయితే ఈ పార్ట్ లో హెలెట్. నిర్లక్ష్యంగా ఉండటం…ఓ రకమైన సైకో లుక్ తో కలగలిపిన సూరి పాత్ర ఫస్ట్ పార్ట్ ని బాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. అలాగే స్క్రీన్ ప్లే కూడా ట్విస్ట్ లతో బాగానే రాసుకున్నారు.

టెక్నికల్ గా…
మేకసూరి2 సినిమాకు ప్లస్ పాయింట్ ప్రజ్వల్ క్రిష్ అందించిన సంగీతం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని డల్ గా ఉండే సీన్స్ ని సైతం లేపి నిలబెట్టింది. పార్థూ సైనా అందించిన సినిమాటోగ్రఫి కూడా సినిమాకు సహజ వాతావరణం క్రియేట్ చేసింది. నటీనటుల్లో  సూరిగా అభినయ్ స్వీక్వెల్‌లో కూడా బాగా చేసాడు. లుక్, గెటప్ క్యారక్టర్ ని బాగా ఎలివేట్ చేసింది.  ఇక వీరభద్రం (నరేష్ బైరెడ్డి) క్యారక్టర్, జర్నలిస్టు రఘురాం (శ్రవణ్) క్యారక్టర్ సినిమాకు మరో ప్లస్. రఘురాం క్యారక్టర్ ట్విస్టు బాగా పేలింది. మిగతా విభాగాలు సోసోగా ఉన్నాయి. ఎడిటింగ్ విభాగం కూడా మరింత గా కష్టపడి ఉంటే కాస్త నేరేషన్ స్పీడు అయ్యేది. కాకపోతే డైరక్టర్ అదే కోరుకుంటే ఎడిటరేం చేయగలుగుతాడు.

చూడచ్చా

ఫస్ట్ ఫార్ట్ నచ్చిన వారికి ఎక్కుతుంది. వాళ్లు చూడచ్చు.

తెర వెనక..ముందు
బ్యానర్ : సింబా ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు : అభినయ్, సమయ, శ్రావణ్, నరేష్ బైరెడ్డి, ప్ర‌మోద్‌ తదితరులు
ఛాయాగ్రహణం: పార్ధు సైనా
సంగీతం:  ప్రజ్వల్‌ క్రిష్‌
నిర్మాత : కార్తీక్ కంచెర్ల
రన్ టైమ్ : 120 నిముషాలు
ఎడిటర్: సురేష్ కే కసుకుర్తి
 కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : త్రినాధ్ వెలిశిల
 విడుదల తేదీ : నవంబర్ 27th,2020
స్ట్రీమింగ్ ఓటీటి: జీ5