మేజర్ మూవీ రివ్యూ

Published On: June 4, 2022   |   Posted By:

మేజర్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji
👍

బయోపిక్కులు ఎప్పుడూ కత్తి మీద సామే. అయితే జాతి కోసం జీవితం అంకితం చేసిన వ్యక్యుల గురించి అయితే ఎప్పుడూ తెలుసుకోవాలని ఉంటుంది. వారి జీవితాల్లో వివాదాలకు తావు ఉండదు. దేశం,త్యాగం అనే రెండు విషయాలకే ప్రయారిటీ ఉంటుంది. వివాదమే కాంప్లిక్ట్స్ అనుకుంటే ఈ బయోపిక్ లను తెరకెక్కించలేరు. జనం చూడలేరు. ఓ ఎమోషన్ తో వీటిని తీయాలి..చూడగలగాలి. అటువంటి చిత్రమే ‘మేజర్’ . ఈ సినిమాని రెగ్యులర్ విధానంలో రివ్యూ చేయలేము. రేటింగ్ లు ఇవ్వలేము. ఎందుకంటే ఇది నచ్చటం ..నచ్చకపోవటం అనేది వారి ప్రయారిటీస్ మీద ఆధారపడి ఉంటుంది.

స్టోరీ లైన్

‘నా కొడుకు జీవితం ఆ రోజు జరిగిన ఎటాక్స్ మాత్రమే కాదమ్మా! సందీప్ కంటూ ఒక జీవితం ఉంది’ – ‘మేజర్’ ట్రైల‌ర్‌లో సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి పాత్ర పోషించిన రేవతి చెప్పే మాట. ఇదే సినిమా స్టోరీ లైన్. ఇస్రో ఆఫీసర్ ఉన్నికృష్ణన్ కుమారుడు సందీప్ (అడివి శేష్). తన కొడుకు బాగా చదువుకుని డాక్టరో ఇంజినీరో సెటిలవ్వాలనేది ఉన్నికృష్ణన్ కోరిక. అయితే సందీప్ మాత్రం ఎయిర్ ఫోర్స్ లో చేరాలని నిర్ణయించుకుంటాడు. ఆ అవకాసం రాకపోయేసరికి ,ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా.. తాను కోరుకున్నట్లే సైన్యంలో చేరతాడు. కాస్త సెటిల్ అయ్యాక తాను కాలేజీ రోజుల్లో ప్రేమించిన ఇషా (సయీ మంజ్రేకర్)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే మొదటి నుంచి సందీప్ కు ఒకటే లక్ష్యం..ఆలోచన. కుటుంబం కంటే కూడా దేశమే గొప్పది. ఈ క్రమంలో సందీప్ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. తన భార్యకు దూరం అవుతుంది. అదే సమయంలోనే ముంబయిలో తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి జరుగురుంది. హోటల్లో వందల మందిని బందీలుగా తీసుకున్నారని తెలుసుకున్న సందీప్ తన టీంతో కలిసి అక్కడకు వెళ్లి ఉగ్రవాదులతో ఎలా పోరాడాడు.. బందీలను ఎలా రక్షించాడు.. ఈ పోరాటంలో అతను ఎలా వీరమరణం పొందాడు అన్నది తెరపై చూడాల్సిన ఎమోషనల్,యాక్షన్ ఎపిసోడ్స్ కూడిన సినిమా.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …

26/11 ముంబయి దాడుల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.దాంతో అదే విషయం మీద సినిమా తీస్తే అంతకు మించి తీయకపోతే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఆ విషయం డైరక్టర్ గుర్తు పెట్టుకోవాలి. వాటిని మించి అత్యంత ఉత్కంఠభరితంగా ఆ ఎపిసోడ్ ను తెరపై ప్రెజెంట్ చేయాలి. సందీప్ వీర మరణాన్ని ఎమోషనల్ గా చూపించడం మీదే శేష్-శశికిరణ్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ముంబై దాడిని సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు. ఇప్పటికే ఈ నేపధ్యంలో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. వర్మ తెరకెక్కించిన “ది ఎటాక్స్ ఆఫ్ 26/11”, ఇటీవల వచ్చిన “తాజ్ హోటల్” & అమెజాన్ ప్రైమ్ సిరీస్ “ముంబై డైరీస్ 26/11″లో చూపించిన డీటెయిలింగ్ “మేజర్”లో మిస్సయ్యిందనే చెప్పాలి. అలాగే చాలా సీన్ కంపోజిషన్స్ జీ5 సిరీస్ “స్టేట్ ఆఫ్ సీజ్ 26/11″ను గుర్తు చేస్తాయి.

ఫస్టాప్ సందీప్ పర్శనల్ లైఫ్ తో సోసోగా నడిచినా…సెకండాఫ్ లో ఎప్పుడైతే ముంబయి తాజ్ హోటల్ మీద ఉగ్రదాడి.. దీన్ని ఎదుర్కోవడానికి స్పెషల్ కమాండోలు చేసిన ఆపరేషన్.. అందులో సందీప్ వీరోచిత పోరాటాలు ఆసక్తి కలిగించాయి. దాదాపు గంటన్నర నిడివితో సాగే ఈ ఎపిసోడ్ సినిమాకు కీలకమైన నిలిచింది. యాక్షన్ & ఎలివేషన్స్ కోసం రియాలిటీను సైతం గాలికొదిలేసి సినిమాటిక్ లిబర్టీని భారీగా వాడుకోవడం కాస్త ఇబ్బందికరమైన విషయం. ఈ విషయంలో శశికిరణ్ స్క్రిప్టు వైజ్ మరింత కసరత్తు చేయాల్సింది. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆయన తండ్రి పాత్ర (ప్రకాష్ రాజ్) చేత చెప్పించటం కలిసి వచ్చింది. కొన్నిసార్లు స్క్రీన్ ప్లే కథ నుంచి డైవర్ట్ అయ్యేలా చేస్తుంది.

టెక్నికల్ గా ..
సినిమా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలగటం.. డ్రామా ఎక్కువ కావటం విషయంలో డైరక్టర్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. స్క్రిప్టు వైజ్ గా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ సినిమా హైలెట్స్ లో ఒకటి. శ్రీచరణ్ పాకాల అందించిన పాటల కన్నా యాక్షన్ సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అబ్బూరి రవి మాటలు ఓకే అన్నట్లు ఉన్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది.

నటీనటుల్లో …సందీప్ పాత్రలో అడివి శేష్, అతని తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయారు. సందీప్… స్కూల్ లైఫ్, ఆర్మీ ట్రైనింగ్, ఎటాక్స్… జీవితంలో వివిధ దశలకు తగ్గట్టు తనను తాను మలుచుకుంటూ నటించటం నచ్చుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో ప్రాణాలకు తెగించి పోరాడే సన్నివేశంలో అడివి శేష్ నటన గుర్తు ఉంటుంది. . సయీ మంజ్రేకర్ జస్ట్ ఓకే. తల్లి పాత్రలో రేవతి, ఆర్మీ అధికారిగా మురళీ శర్మ, హోటల్‌లో చిక్కుకున్న మహిళగా శోభితా ధూళిపాళ చక్కటి నటన కనబరిచారు.ప్రకాష్ రాజ్ క్లైమాక్స్ సన్నివేశాల్లో స్పీచ్ అయితే మర్చిపోలేము.

చూడచ్చా…
అమరవీరుడికి ఘన నివాళిగా భావించి చూస్తే ..ఓ ఎమోషన్ తో మనకు మిగులుతుంది.

నటీనటులు: అడివి శేష్-సయీ మంజ్రేకర్-ప్రకాష్ రాజ్-రేవతి-మురళీ శర్మ-శోభిత ధూళిపాళ్ల తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
మాటలు: అబ్బూరి రవి
కథ-స్క్రీన్ ప్లే: అడివి శేష్
నిర్మాతలు: మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్-అనురాగ్ రెడ్డి-శరత్ చంద్ర
దర్శకత్వం: శశికిరణ్ తిక్కా
రన్ టైమ్: 2h 10min
విడుదల తేదీ : 03, జూన్ 2022