యండమూరి దర్శకత్వంలో నల్లంచు తెల్లచీర చిత్రం
Published On: June 11, 2021 | Posted By: ivs

నల్లంచు తెల్లచీర నేసేందుకు మళ్లీ మెగాఫోన్ పట్టిన మెగా రైటర్ యండమూరి వీరేంద్రనాధ్
తనదైన కాల్పనిక సాహిత్యంతో ఇప్పటికీ లక్షలాదిమందిని ఉర్రూతలూగిస్తూ వ్యక్తిత్వ వికాస రచనలతో’ వేలాది జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “నల్లంచు తెల్లచీర”.
ఈ పేరుతో యండమూరి కలం నుంచి జాలువారిన ఓ నవల ‘దొంగ మొగుడు’ పేరుతో మెగాస్టార్ చిరంజీవితో రూపొంది అసాధారణ విజయం సాధించడం తెలిసిందే. చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన ‘అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం, రాక్షసుడు” చిత్రాల రచయిత యండమూరి అనే విషయం ప్రత్యేకంగా పేర్కొనాల్సిన పనిలేదు.
యండమూరి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న “నల్లంచు తెల్లచీర” చిత్రాన్ని ‘ఊర్వశి ఓటిటి’ సగర్వ సమర్పణలో.. సంధ్య స్టూడియోస్-భీమవరం టాకీస్ పతాకాలపై రవి కనగాల- తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.అమర్ కార్యనిర్వాహక నిర్మాత. “స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు” చిత్రాల అనంతరం యండమూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నల్లంచు తెల్లచీర’ కావడం గమనార్హం.
యండమూరి శైలిలో వినూత్నమైన కథ-కథనాలతో ముస్తాబవుతున్న “నల్లంచు తెల్లచీర” ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం: అమీర్, కూర్పు: మీర్, సంగీతం: తాళ్ళూరి నాగరాజు, కార్యనిర్వాహక నిర్మాత: సి.అమర్, సమర్పణ: ఊర్వశి ఓటిటి, నిర్మాతలు: రవి కనగాల-తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్.