Reading Time: 2 mins

యాక్షన్‌ మూవీ రివ్యూ 

నో కట్..ఓన్లీ యాక్షన్ (విశాల్ ‘యాక్షన్’ రివ్యూ !)
 
 Rating : 3/5  


ఇస్తాంబుల్ లో ఓపెన్ అయ్యే ఈ సినిమాలో తమన్నా ఓ మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తూంటే ..న్యూస్ లో విశాల్, తమన్నా మోస్ట్ వాంటెండ్ లిస్ట్ లో ఉన్నారని వార్త వస్తుంది. వెంటనే కాసేపటికి విశాల్ ని, తమన్నా ని కొంతమంది అక్కడ ఇస్తాంబుల్ జనం తరుముతూంటే వాళ్లనుంచి తప్పించుకుంటూ ఉంటారు. అసలు వీళ్లిద్దరు ఎవరు..వాంటెడ్ లిస్ట్ లోకి ఎలా ఎక్కారు అంటే.. ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి.

ఆర్మీ ఆఫీసర్ సుభాష్ (విశాల్‌) డేరింగ్ గా దూసుకుపోయే మనస్తత్వం. ఆయన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్న (రాంకి) కాబోయే ముఖ్యమంత్రి. తన మరదలుని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామనుకుంటాడు. కానీ పాకిస్దాన్లో  ఉన్న టెర్రరిస్ట్ మాలిక్ వల్ల ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలమైపోతుంది. అన్న ఆత్మహత్య చేసుకుంటాడు. మరదల్ని ఓ బాంబ్ బ్లాస్ట్ లో చంపేస్తారు. కుటుంబంపై ఈ బాంబు పేలుళ్లతో సంభందం ఉందని ఆరోపణలు వస్తాయి. ఈ క్రమంలో మాలిక్ ని పట్టుకుని భారతదేశం తీసుకుని వచ్చి శిక్షించి, తన కుటుంబం పై పడిన మచ్చని తొలిగించాలని సుభాష్ ఆలోచన. అందుకోసం తన తోటి ఆర్మీ ఆఫీసర్ తమన్నాతో కలిసి ఓ మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఇస్తాంబుల్ వెళ్తాడు. అక్కడ ఇరుక్కుంటాడు. చివరకు మాలిక్ ని ఎలా చేరుకున్నాడు.  సుభాష్ విషయం తెలిసిన మాలిక్ ఏం చేసాడు. తను అనుకున్న మిషన్ ని విజయవంతంగా ఎలా సుభాష్ సాధించాడు.. అనేది మిగతా కథ.
 
ఎలా ఉంది..

సెటప్ మొత్తం ఇంట్రస్టింగ్ గానే ఉంది. యాక్షన్ సీన్స్, థ్రిల్స్ హాలీవుడ్ స్దాయిలోనే ఉన్నాయి. అందులో సందేహం లేదు. తమన్నా కూడా సూపర్ హాట్ గా ఉండటానికి ప్రయత్నించింది. ఉందా లేదా అన్నది తర్వాత విషయం. అయితే యాక్షన్ సీన్స్ కు తగ్గ అల్ల లేక పోయారు. ఇక డైరక్టర్ సుందర్ సి. అనగానే మనకు బ్రాండ్ తమిళ అతి కామెడీలు గుర్తు వస్తాయి.  అయితే ఆయనకీ తన కామెడీలు చూస్తే నవ్వు వచ్చి ఉండక ఏమో…ఈ సారి యాక్షన్ ట్రై చేద్దామనుకున్నారు. అయితే ఏది చేసినా తన బ్రాండ్ అతి ఉండాలని నమ్మే ఆయన ఈ సినిమాలోనూ దాన్ని అవకాసం వచ్చినప్పుడల్లా ప్రయోగిస్తూ వచ్చారు. కాకపోతే యాక్షన్ సీన్స్ ని యాక్షన్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేయటం వల్ల కొన్ని చోట్ల వావ్ అనిపిస్తాయి. మరికొన్ని చోట్ల ఆహా అనిపిస్తాయి. అయితే ఆ యాక్షన్ సీన్స్ కు తగ్గ నేపధ్యం మాత్రం పరమ రొటీన్ గానే రాసుకున్నారు సుందర్. తన ప్రేయసిని,అన్నని పోగొట్టుని పగ, ప్రతీకారంతో రగిలిపోయో పాత్రను ఎంచుకున్నారు.

 ముఖ్యంగా సినిమా చివరి అరగంటా అయితే రొటీన్ గా బాగా ప్రెడిక్టబుల్ గా సాగింది. పాకిస్దాన్ లో దాక్కొన్న టెర్రరిస్ట్ ని ఇండియాకు తీసుకురావట అనేది గతంలో చాలాసార్లు చూసాం. రీసెంట్ గా గోపిచంద్ చాణుక్యలో సైతం చూసాం. కాబట్టి కథగా గొప్పగా అనిపించలేదు. లాజిక్స్ చూసుకుంటే డిప్యూటీ సీఎం ఇంట్లోకి అంత సెక్యూరిటీ తప్పించుకుని ఒకరు వచ్చి హత్య చేయటం…ఓ పెద్ద టెర్రరిస్ట్ ఇంట్లోకి విశాల్, తమన్నా ఈజీగా వెళ్లిపోవటం వంటవి ఎంత సినిమాటెక్ గా అయినా గొప్పగా అనిపించవు.  అలాగే ‘బేబీ’ వంటి బాలీవుడ్ సినిమాల ప్రేరణ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.   మాలిక్‌ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే ఎపిసోడ్ మొత్తం ఆ సినిమాని పోలి ఉంటుంది.
 
నటీనటులు, మిగతా క్రాఫ్ట్ లు
విశాల్ ఇలాంటి క్యారక్టర్స్ గతంలో బోలెడు చేసేసాడు. కాబట్టి పెద్దగా అతని కష్టం గురించి మాట్లాడుకునేదేం లేదు. విలన్ క‌బీర్ సింగ్…ఎంతకాలం ఉన్నా అదే బ్లాంక్ ఫేస్. తమన్నా కు ఇలాంటి పాత్ర కొత్త. యాక్షన్ తో కూడిన సినిమా ఇంతకు ముందు చేయలేదు కాబట్టి కొత్తగా అనిపించింది.  ఐశ్వర్య ల‌క్ష్మి ని కాసేపు ఓ పాటకు,కొన్ని సీన్స్ కు పరిమితం చేసారు. ప్రొఫెషనల్ కిల్లర్ గా చేసిన… ఆకాంక్షా పూరి మాత్రం అదరకొట్టింది. రాంకీ జస్ట్ ఓకే పాత్ర.

టెక్నికల్ గా చూస్తే.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కే ప్రయారిటీ కాబట్టి ఆ పని యాక్షన్ కొరియోగ్రాఫర్స్ చేసేసారు. వాళ్లకే పూర్తి మార్కలు పడతాయి. కెమెరా వర్క్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలెట్. నిర్మాణపరంగా ఖర్చు తెరపై బాగా కనపడుతుంది.  

చూడచ్చా
ఈ వీకెండ్ కు ….మంచి కాలక్షేపం.

తెర ముందు..వెనక
నటీనటులు: విశాల్‌, తమన్నా, ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్షా పూరి, ఛాయా సింగ్‌, యోగిబాబు, ఆనందరాజ్‌ తదితరులు
దర్శకుడు: సి. సుందర్‌
నిర్మాత: ఆర్‌. రవీంద్రన్‌
కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌
సంగీత దర్శకుడు: హిప్‌హాప్‌ తమిళ
విడుదల తేదీ: 15-11-2019