Reading Time: 3 mins

రామబాణం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

గోపిచంద్ కు కొంతకాలం క్రితం వరకూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు ఎక్కువగా యాక్షన్ కు ప్రయారిటీ ఇస్తూండటంతో మాస్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే సక్సెస్ ఆయనతో దోబూచిలాడటం మొదలెట్టాక ఏ తరహా సినిమాలు చేయాలి, ఫ్యామిలీలకు నచ్చేవి చేయాలా, లేక యాక్షన్ సినిమాలు చేయాలా అనే సందిగ్దం రెండు కలిపి మళ్లీ లక్ష్యం సినిమా రోజుల నాటికి వెళ్దామనే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే అదీ బెడిసికొట్టిందనే చెప్పాలి. సినిమా అనుకున్న స్దాయిలో లేదనేది నిజం. కథ పాత వాసనలు కొడుతోందని అంటున్నారు. అయితే ఇంతకీ ఈ చిత్రం కథేంటి.సినిమాలో గోపిచంద్ క్యారక్టర్ ఏమిటిఎక్కడ దెబ్బ తింది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ :

14 ఏళ్ల వయసులో అన్న రాజారామ్ (జగపతిబాబు) మీద కోపంతో ఇల్లు వదిలి కోల్ కత వెళ్తాడు విక్కీ (గోపీచంద్) ని అక్కడ మాఫియాకి సంబంధించిన గుప్తా చేరదీస్తాడు. గుప్తాకి కుడిభుజంలా ఉంటూ, మరో డాన్ అయిన ముఖర్జీ నుంచి తన బాస్ ను కాపాడుతూ విక్కీ భాయ్ గా ఎదుగుతాడు. అలాగే అక్కడే పరిచయమైన భైరవి ( డింపుల్ హయతి) తో ప్రేమలో పడతాడు. అయితే భైరవి తండ్రి శుక్లా (సచిన్ ఖేడేకర్) తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయటానికి ఓ కండీషన్ పెడతాడు. విక్కీ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాతనే అతనికి తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. అప్పుడు తన ఊరుకి బయిలు దేరి వెళ్తాడు. తన కుటుంబ సభ్యులను కలుసుకుంటాడు. తాను మాఫియాలో పనిచేస్తున్న విషయం అన్న రాజారామ్ కి తెలియకుండా దాచాలని విక్కీ భావిస్తాడు. మరో ప్రక్క జేకే ద్వారా తనకి ఎదురవుతున్న ఇబ్బందులను గురించి చాలా కాలం తర్వాత వచ్చిన తమ్ముడికి తెలియకుండా చూడాలని రాజారామ్ భావిస్తాడు. కానీ రాజారామ్ ను జేకే రెచ్చగొడుతూ ఉంటాడు. మరో ప్రక్క కోల్ కత మాఫియా విక్కీని వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు ఏమైంది.చాలా కాలం తర్వాత తన ఊరు వచ్చిన విక్కీ తన కుటుంబానికి ఏం చేసాడు అస‌లు క‌థ‌.

ఎలా ఉంది :

ఇలాంటి కథలు తెలుగు తెరకే కాదు ఇండియన్ తెరకు కొత్తకాదు. ఇప్పటికే బోలెడు వచ్చేసాయి. అయితే ఇలాంటి పాత కథను కొత్తగా చెప్తారని ఆశిస్తాం. అయితే దర్శకుడు శ్రీవాసు ఆ విషయం పట్టించుకోలేదు. అదే పాత దారిలో ఈ కథను నేరేట్ చేసుకుంటూ వెళ్లాడు. కథలో ఈ జనరేషన్ కు వాళ్లని ఆకట్టుకునే ఎక్కడా ఊహించని మలుపులు ట్విస్టులు పెట్టుకోలేదు. జగపతిబాబు – గోపీచంద్ పాత్రలను బాగా రొటీన్ గా డిజైన్ చేసారు. పోనీ గోపీచంద్ క్యారక్టర్ లో ఎమోషన్ ఏమన్నా పండుతుందా అదీ ఉండదు. యాక్షన్ సీన్స్ పైనే గోపీచంద్ దృష్టి అంతా. ఇవన్నీ ప్రక్కన పెడితే కథలో విలన్ క్యారక్టర్ చాలా వీక్ గా ఉంటుంది. పవర్ఫుల్ విలన్ గా తరుణ్ అరోరా పాత్రను శ్రీవాస్ సరిగ్గా డిజైన్ చేయలేకపోయాడు. సేంద్రీయ ఉత్ప‌త్తులు, సంప్ర‌దాయ ఆహారం అంటూ ఓ కొత్త నేప‌థ్యాన్ని ఎంచుకున్నా అదేమీ కథలో కలసి జనాలను ఎట్రాక్ట్ చేసే విషయం అసలు కాదు. మొదటి నుంచి చివ‌రి వ‌ర‌కూ ప్రతీ సీన్ ఇంతకు ముందు చూసినట్లే ఉంటుంది. ఎక్కడా కొత్త‌ద‌నం లేదు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, డ్రామా అన్నీ ఉన్నాయి కానీ వాటిని కలిపే సరైన నేపధ్యం కల స్టోరీనే లేదు. కొన్న‌ి సీన్స్ అయితే మ‌రీ అతిగా అనిపిస్తాయి. హీరో ఫోన్‌లోనే రూ.50 కోట్లు స‌ర్దుబాటు చేసి పెళ్లికి ఒప్పిస్తూంటే మనం తెల్ల మొహం వేసుకుని చూస్తాం. కామెడీ సీన్స్, ఫైట్స్, సాంగ్స్‌ అంటూ కథ సాగుతుంది. పెద్దగా మనకు ఇబ్బంది ఉండదు. స్క్రీన్ ప్లే ఇంత నీరసంగా ఉన్న కథ ఈ మధ్యలో ఇదేనేమో అన్నట్లుంది.

ఎవరరెవరు ఎలా చేసారంటే :

గోపీచంద్ ఏమీ కొత్తగా అనిపించడుగతంలో చూసిన, చేసిన హావభావాలతో మెప్పించే ప్రయత్నం చేసాడు. జగపతిబాబుగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుంది ఆయన పాత్ర. ఇక జగపతిబాబు భార్య పాత్రలో ఖుష్బూ ఫరావాలేదు అనిపిస్తుంది. వెన్నెల కిశోర్  అలీ  సప్తగిరి  సత్య  గెటప్ శీనులు నవ్విస్తారు. కానీ మనకే నవ్వురాదు. ఉంటుంది. హీరోయిన్ డింపుల్ హయతి ఓవర్ మేకప్ ఇబ్బంది పెడుతుంది. నటించటానికి ఆమె పాత్రకి స్కోప్ లేదు. పాటల్లో వచ్చి వెళ్లిపోతుందంతే.

టెక్నికల్ గా :

ఈ సినిమా టెక్నికల్ గానూ అంత స్టాండర్డ్స్ కనపడవు. మిక్కీ జె మేయర్ ఇచ్చిన పాటల్లో. జానపద బాణీలో సాగే పాట మాత్రమే కాస్త బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అన్నట్లుంది. వెట్రి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. ఫైట్స్ ను బాగా డిజైన్ చేసారు. కనల్ కన్నన్ – రామ్ లక్ష్మణ్ ఫైట్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అలా అలా నడిచిపోతుంది. మధుసూదన్ డైలాగులు కొన్ని బాగున్నాయి. దర్శకుడుగా శ్రీవాస్ మేజిక్ ఈ సినిమాలో ఎంతమాత్రం కనిపించలేదు. ఈ సినిమా నిర్మాణ విలువలనుమాత్రం టాప్ లో ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు, ఖర్చుకు వెనుకాడలేదు.

ప్లస్ పాయింట్స్ :

ప్రొడక్షన్ వాల్యూస్
భారీ యాక్షన్ సీన్స్
ఫొటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

పాత కథ,కథనం
విసుగెత్తించే కామెడీ ట్రాక్
పండని ఎమోషన్స్.

చూడచ్చా :

గోపీచంద్ సినిమా వస్తే ఖచ్చితంగా చూడాలని అని ఫిక్సైన వాళ్లు తప్పించి ,మిగతా వాళ్లు భరించటం కష్టమే.

న‌టీన‌టులు :

గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా త‌దిత‌రులు;

సాంకేతికవర్గం :

సంగీతం: మిక్కీ జె మేయర్;
ఛాయాగ్ర‌హ‌ణం: వెట్రి పళనిసామి;
సంభాష‌ణ‌లు: మధుసూదన్ పడమటి;
క‌ళ‌: కిరణ్ కుమార్ మన్నె
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్;
రన్ టైమ్ : 142 మినిట్స్
దర్శకత్వం: శ్రీవాస్;
సంస్థ‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ;
విడుద‌ల‌: 05-05-2023