లవ్ టుడే మూవీ రివ్యూ

Published On: November 25, 2022   |   Posted By:

లవ్ టుడే మూవీ రివ్యూ

రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లవ్ టుడే’ రివ్యూ
Emotional Engagement Emoji

👍

డబ్బింగ్ సినిమాలు మనకు కొత్తేమీ కాదు కానీ..కొన్ని సినిమాలు వాటి హై సక్సెస్ మనని ఆ సినిమా లు ఖచ్చితంగా చూసేలా ప్రేరేపిస్తూంటాయి. అదే సినిమాకు ప్రమోషన్ లాంటిది కూడా. ఆ క్రమంలో కొద్ది రోజుల క్రితం ప్రదీప్ రంగనాధన్ హీరోగా  స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “లవ్ టుడే”. తమిళనాట ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. మరి డబ్బింగ్ వెర్షన్ కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో లేదో రివ్యూలో  చూద్దాం..!!

స్టోరీలైన్

కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్ర‌దీప్ (ప్ర‌దీన్ రంగ‌నాథ‌న్‌), నిఖిత (ఇవానా)  పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఈ లోగా వీరి ప్రేమ విషయం తెలిసిన నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) ఇద్దర్నీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఓ కండీషన్ పెడతాడు.  అదేమిటంటే..వీళ్లు పెళ్లి జ‌ర‌గాలంటే ఒక‌రి ఫోన్‌ను మ‌రొక‌రు ఒక్క‌రోజు మార్చుకోవాల‌ని . తప్పక ,వేరే దారి లేక ఓకే చేస్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఫోన్‌లో ఒక‌రిగురించి మ‌రొక‌రికి తెలియ‌ని చాలా డార్క్ సీక్రెట్స్ ఉండ‌టంతో అవి ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయో అని ఇద్ద‌రు భ‌య‌ప‌డుతుంటారు.

ఆ క్రమంలో ఈ  ఫోన్ మార్పిడి వ‌ల్ల నిఖిత అంత‌కుముందు మ‌రో యువ‌కుడిని ప్రేమించింద‌నే విష‌యం ప్ర‌దీప్‌కు తెలుస్తుంది. అలాగే ప్ర‌దీప్ ఇత‌ర అమ్మాయిల‌తో చాటింగ్ చేయ‌డం, అత‌డి బ్రేక‌ప్‌ల‌కు సంబంధించిన అన్ని నిజాలు నిఖిత‌కు తెలిసిపోతాయి. అలాగే నిఖిత చెల్లికి అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌లు కూడా ప్ర‌దీప్ యూజ్ చేసే ఇన్‌స్టాగ్రామ్ ఆకౌంట్ నుంచి వెళ్తూంటాయి. ఈ క్రమంలో ఫోన్ మార్చుకోవ‌డం వ‌ల్ల ప్ర‌దీప్‌, నిఖిత‌ విడిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది. అప్పుడేం జ‌రిగింది? అసలు ఒక‌రి ఫోన్‌ను మ‌రొక‌రు మార్చుకోవాల‌ని వేణుశాస్త్రి కండీష‌న్ ఎందుకు పెట్టాడు?చివరకు విడిపోయిన వాళ్లిద్దరూ ఎలా  ఒక్క‌ట‌య్యారు?  ఈ కథలో స‌ర‌స్వ‌తి (రాధికా శ‌ర‌త్‌కుమార్‌) పాత్ర ఏమిటి అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

ఎలా ఉంది…

ఇది ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామెడీ…  ప్రాప‌ర్ న్యూఏజ్ సినిమా.  ట్రైలర్ లోనే ఈ సినిమాలో అసలు విషయం ఏమిటనేది రివీల్ చేసేసారు. దాంతో ఈ పాయింట్ ని ప్రదీప్ ఎలా ట్రీట్మెంట్ ఇచ్చి, జనాలకు నచ్చేలా తెరకెక్కించారనేదే ముఖ్యం. ఈ సినిమాలో ప్రదీప్ చేసింది మంచి జోక్స్ తో సినిమాను నింపటం. ఎందుకంటే తెలిసున్న కథను చాలా తెలివిగా చెప్పకపోతే దొరికి పోతానని అతను తెలుసు. కాబట్టి ఎక్కడా బోర్ కొట్టకుండా మాగ్జిమం కథను చిన్న చిన్న ట్విస్ట్ లతో, చివర్లో ఓ ఎమోషన్ తో ముడిపెట్టి ముగించాడు.  ఫేస్బుక్, ట్విట్వర్ వంటి సోష‌ల్ మీడియా యాప్స్ ప్రపంచంలో , ఫోన్ లోకంగా బ‌తుకుతున్నయుత్ లైఫ్ స్టైల్ ని ఈ సినిమా  ఎంట‌ర్‌టైనింగ్‌గా  ప్రెజెంట్ చేయగలిగింది. సోష‌ల్ మీడియా ద్వారా మొగ్గ‌తొడిగిన ప్రేమ‌ల్లో ఉండే నిజాయితీని ఈ సినిమా ప్రశ్నిస్తుంది. న‌మ్మ‌కంతో నిల‌బ‌డాల్సిన ప్రేమ బంధాల‌ను అనుమానాల‌తో ఎలా తుంచేసుకుంటున్నారనే విషయం చెప్తున్నారు.  నేటి తరం ఎదుర్కొంటున్న అనేక అంశాలతో ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమా ద్వారా ఆవిష్క‌రించారు. అలాగే ఈ సినిమా కథలోకి త్వరగా వెళ్లిపోవటం కూడా కలిసొచ్చింది. హీరో,హీరోయిన్స్ ఇంట్రడక్షన్, సత్యరాజ్, ఆయన ప్రెండ్స్ బ్యాచ్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసి, స్టోరీలో మెయిన్ ప్లాట్ లోకి తీసుకెళ్ళాడు. ఇక సత్యరాజ్ పెట్టే కండీషన్ తో సినిమా ఫన్ మొదలవుతుంది. ముఖ్యంగా ఆమె నుంచి ఫోన్ తిరిగి తెచ్చుకోవడానికి వేసిన ప్లాన్స్,  తంటాలు, నిఖిత పాత బాయ్ ఫ్రెండ్‌ వాయిస్ మెసేజు అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుని చేసారు. సిల్లీగా అనిపించే చాలా సీన్స్ బాగున్నాయనిపించాయంటే అదే కారణం.

టెక్నికల్ గా చూస్తే..

లవ్ టుడే చిత్రానికి మంచి మార్కులు పడతాయి. ఫన్ మూడ్ ని ఎలివేట్ చేస్తూ చాలా మంచి విజువల్స్ ని రాబట్టుకున్నారు.  సౌండ్ డిజైన్ కూడా బావుంది. ఎడిటింగ్ కాస్త పదునుగా ఉండాల్సింది. దర్శకుడు  ఫన్  కోసం మంచి నేపధ్యాన్ని తీసుకున్నాడు. అయితే దాన్ని ప్రజంట్ చేయడంలో ఒక్కోసారి గీత దాటాడు అనిపిస్తుంది కానీ కాసేపటికే సర్దుకుంటూంటాడు. కాక‌పోతే ఈ మ‌ధ్య వ‌చ్చిన యూత్  సినిమాల‌తో పోలిస్తే.. లవ్ టుడే కాస్త కొత్త‌గా అనిపిస్తుంది. రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌ని ఇష్ట‌ప‌డేవాళ్లు ఓసారి ఇటు ఓ లుక్కు వేయొచ్చు.

లవ్ టుడే లో అసలు విషయం అయ్యిపోయాక   తర్వాత.. కథ ముగించాలి. కానీ ఈ కథ ముగించిన విధానం మాత్రం చాలా లేజీగా వుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఫన్ బాగుంది  కాబట్టి సెకండ్ హాఫ్ లో అంత అవసరం లేదని అనుకున్నారేమో.. క్లైమాక్స్ కు వెళ్లేసరికి ఎమోషనల్ గా మారిపోతుంది. అప్పటిదాకా చూసిన  విధానం ,మోడ్ మారటంతో  సహనానికి పరీక్ష పెడుతుంది.  అలాగే కొన్ని  చూస్తున్నపుడు ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ మర్చిపోయారా ? అనిపిస్తుంది.  డైలాగలు బాగున్నాయి. డబ్బింగ్ పై మరింత శ్రద్ద తీసుకుంటే బాగుండేది.

నటీనటుల్లో …

హీరో,హీరోయిన్స్ పాత్రలని బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా డైరక్టర్ ,హీరో అయిన ప్రదీప్  నటన చాలా సహజంగా వుంటుంది.  హీరోయిన్ గా చేసిన ఇవాన నటన కూడా బావుంది. సత్య రాజ్, రాధికా శరత్ కుమార్  మిగతా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి.

ఎవరికి నచ్చుతుంది?

2K జనరేష్ కు ఇది బాగా నచ్చే చిత్రం. ఓ ఏజ్ దాటిన వాళ్లకు ఇందులో ఏముంది ..నాలుగు జోక్స్..ఓవర్ యాక్షన్ తప్ప అనిపిస్తుంది.

బ్యాన‌ర్‌: ఎ.జి.ఎస్‌.ఎంట‌ర్‌టైన్మెంట్
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఇవానా, యోగిబాబు, సత్యరాజ్, రాధిక తదితరులు
ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
తెలుగులో రిలీజ్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
Run Time: 2h 35m
విడుదల తేదీ: నవంబర్ 25, 2022