లవ్ స్టోరీ మూవీ రివ్యూ

Published On: September 24, 2021   |   Posted By:
 
 
లవ్ స్టోరీ మూవీ రివ్యూ
 
చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE) :
 

👌

 
అనేక వాయిదాలు పడుతూ వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా మొత్తానికి థియోటర్స్ లో దిగింది.శేఖర్ కమ్ముల సినిమా అంటే జనాల్లో ఉన్న ఆసక్తి,నమ్మకానికి ఈ సినిమా ఓపినింగ్స్,అడ్వాన్స్ బుక్కింగ్ లు అద్దమై చూపించాయి. దానికి తోడు సాయి పల్లవి హీరోయిన్ కావటం , సారంగధరియా పాట సినిమాపై కలగచేసిన ఇంపాక్ట్ వేరే లెవిల్. ఈ అంచనాలును  మూటగట్టుకుని వచ్చిన ఈ సినిమా అందుకు త‌గ్గ‌ట్టుగా ఉందా? లవర్స్ గా నాగచైతన్య, సాయిపల్లవి పెయిర్ మ్యాజిక్ క్రియేట్ చేసిందా? అసలు ఈ సినిమా కథేంటి? పరువు హత్యలు నేపధ్యం అంటూ ఈ సినిమా కథ గురించి జరుగుతున్న  ప్రచారం నిజమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
 

స్టోరీలైన్

హైదరాబాద్ లో జుంబా డాన్స్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తూంటాడు రేవంత్‌(నాగచైతన్య). తెలంగాణాలోని ఆర్మూరు అనే పల్లె నుంచి వచ్చిన అతనికి కెరీర్ లో ఎదగాలని, తను తక్కువ కులం కావటంతో ఎదుర్కొన్న సమస్యలను అధిగమనించాలంటే డబ్బు బాగా సంపాదించాలని, అందుకు బిజనెస్ చేయాలని అనుకుంటాడు. అదే ఊరు నుంచి వచ్చిన మౌనిక (సాయిపల్లవి) పెద్దింటి పటేల్ కూతురు, డబ్బున్న పిల్ల, బిటెక్ చదువుకుని సాప్ట్ వేర్ జాబ్ చేయాలని సిటీకు వచ్చింది. ఆమెతో పరిచయం రేవంత్ కు కొత్త జీవితానికి ఆహ్వానం  పలికినట్లు అవుతుంది.డాన్స్ పట్ల ఇద్దరికి ఉన్న మక్కువ అందుకు వేదిక అవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమలో పడటం  మొదలు అవుతుంది. ఆ టైమ్ లోనే ఇద్దరి మద్య కులం అనే అడ్డం ఉందని అర్దమవుతుంది.  ఆ కులం సమస్యను ఎలా ఎదుర్కొని తమ ప్రేమ ను అందుకునే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో ఏం జరిగింది.. ఇద్దరి కెరీర్ లు ఎలా ముందుకు సాగాయి అనే విషయాలు చుట్టూ మిగతా కథ తిరుగుతుంది. ఈ క్రమంలో మౌనిక జీవితంలోని ఓ చీకటి కోణం ఆవిష్కారం అవుతుంది. అదేమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎనాలసిస్..

 కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్ ప్రేమ కథ చాలా మంది సినిమా వాళ్లకు ప్రేరణగా మారిందనటంలో సందేహం లేదు. రామ్ గోపాల్ వర్మ మర్డర్, అర్ద శతాబ్దం, ఉప్పెన,నిన్న గాక మొన్న వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ ఈ తరహా కథ,కథనంతోనే వచ్చాయి. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకున్నారు. అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన మార్క్ తో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఆ సినిమాకు ఈ లవ్ స్టోరీకు పూర్తిగా తేడా ఉంది.  హీరో హీరోయిన్‌ మద్య రొమాన్స్ మరియు లవ్‌ ను చక్కగా చూపించడంతో పాటు సినిమాలో అన్ని విషయాలను సమంగా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. కాకపోతే లాస్ట్ ముప్పై నిముషాలు దాదాపు ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా  పూర్తిగా డార్క్ మోడ్ లోకి వెళ్లిపోయింది. కథ ప్రకారం అది కరెక్టే కావచ్చేమో కానీ అప్పటిదాకా చూసిన సినిమా వేరు, ఆ కాసేపు చూస్తన్నది వేరు అనిపించింది. టోన్,మూడ్ మారిపోయింది. అది ఒక్కసారిగా డైజస్ట్ కావటం కష్టమనిపిస్తుంది. అయితే డీసెన్సీగా ఎక్కడా భంగం కలిగించకుండా బోల్డ్ పాయింట్ ని డీల్ చేసారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర ఎప్పటిలాగే శేఖర్ కమ్ముల అద్బుతంగా తీర్చిదిద్దారు. మంచి బాలెన్స్ ఉన్న అమ్మాయిగా, తన మనస్సుకు నచ్చినట్లుగా ముందుకెళ్లగలిగే నేటి తరం యువతిగా డీల్ చేసారు. అలాగే హీరో పాత్రను సైతం ఏదో ప్రేమలో పడిపోయే పాత్రలా కాకుండా ఓ సెల్ఫ్ మేడ్ పర్శన్, కాన్ఫిడెన్స్ తో ఉన్న వ్యక్తిత్వంతో మన ముందు ఉంచుతారు. అలాగే ఫస్టాఫ్ ఎప్పటిలాగే యూత్ కి నచ్చేలా కలర్ ఫుల్ గా డిజైన్ చేసారు. సెకండాఫ్ లోనూ అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి.అయితే సమాజపు డార్క్ ఇష్యూలను  ప్రస్తావించటం మాత్రం శేఖర్ కమ్ముల ధైర్యం చేసినట్లే. ఏదైమైనా శేఖర్ కమ్ముల తప్ప వేరే ఎవరు ఈ కథను డీల్ చేసినా చూడ్డానికి కష్టంగా ఉండేది.
 
 
టెక్నికల్ గా..
 
సినిమాని డార్క్ టోన్ లో డీల్ చేస్తున్నప్పుడు లెంగ్త్  విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ ఎంతకీ అవ్వవు అన్నట్లుగా  సాగతీతగా ఉన్నాయి.   సినిమా రిలీజ్ కు ముందే పాట హిట్టవటం ఈ మధ్యకాలంలో సారంగధరియా పాట విషయంలో జరిగింది. సంగీత దర్శకుడు కొత్త వాడైనా ది బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. చాలా సీన్స్ రియలిస్టిక్ గా అనిపించేలా చేసారు.   డైలాగులు కూడా సినిమాకు బాగా  ప్లస్ అయ్యాయి.ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే..ఇంకొచెం ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది.ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగినట్లుగా కథానుసారంగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోదేముంది.  ఫిల్మ్‌ మేకింగ్ లో మాస్టర్‌.

నటీనటుల్లో ..నాగచైతన్య నటన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్ అని చెప్పాలి.  క్లైమాక్స్ లో అయితే మరీను. నటుడిగా చైతూ నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాడు. ఇక మౌనిక గా సాయి పల్లవి ఫెరఫెక్ట్ ఆప్షన్. అంతకు మించి ఎవరూ చేయలేరేమో అన్నట్లు చేసింది.  ఫిదా భానుమతికు రెండు రెట్లు. మిగతా నటీ నటులలో గంగవ్వ పాత్ర నవ్వించింది. రాజీవ్ కనకాల పాత్ర ఊహించలేము.ఈశ్వరరావు బాగా చేసింది.

నచ్చినవి
నాగచైతన్య ,సాయిపల్లవి క్యారక్టరైజేషన్స్
సారంగధరియా సాంగ్
శేఖర్ కమ్ముల తరహా మూమెంట్స్

నచ్చనవి
ఈ మధ్యకాలంలో బాగా నలిగిన కథ
 స్లో నెరేషన్‌
ముగింపు సరిగ్గా లేని క్లైమాక్స్

చూడచ్చా
శేఖర్ కమ్ముల డైరక్టర్ కదా అని  ఓ ఛీరఫుల్ లవ్ స్టోరీ ని చూడబోతున్నాం అని కాకుండా ఓ సున్నితమైన అంశాన్ని డీల్ చేసిన సినిమా అని ఫిక్సై చూస్తే నచ్చుతుంది.

ఎవరెవరు…

బ్యానర్‌: అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, దేవయాని, రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు తదితరులు
సంగీతం: పవన్‌కుమార్‌ సీహెచ్‌
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి. కుమార్‌
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్
నిర్మాత: నారంగ్‌ దాస్‌ కె నారంగ్‌, పుష్కర్‌రామ్‌ మోహనరావు
రచన, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
రన్ టైమ్: 2గంటల 36 నిముషాలు
విడుదల తేదీ: 23 సెప్టెంబర్ 2021