Reading Time: 3 mins

విరూపాక్ష మూవీ రివ్యూ

 సాయి తేజ్  “విరూపాక్ష” రివ్యూ

Emotional Engagement Emoji

చాలా కాలం తర్వాత హారర్  ఎక్సపీరియన్స్ ని  టీజర్, ట్రైలర్ ద్వారా ఇచ్చిన చిత్రం ‘విరూపాక్ష’.సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా ఇది. సుకుమార్ స్క్రీన్ ప్లే ఇచ్చిన సినిమా కావటం, పెద్ద బ్యానర్ నుంచి సినిమా రావటం వంటి వాటితో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఆ ఎక్సపెక్టేషన్స్ ని సినిమా రీచ్ అయ్యిందా…సినిమా కథేంటి వంటి విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

1979 లో రుద్రవరం ఊళ్లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ జంటను సజీవ దహనం చేసేస్తారు ఆ ఊరి జనం. వాళ్ళు చనిపోతూ ఆ ఆక్రోశంలో …ఊరు మొత్తం 12 సంవత్సరాల తర్వాత వల్లకాడు అవుతుందని, అందరూ చనిపోతారని శాపం పెడతారు. అనుకున్నట్లుగానే పుష్కర కాలం తర్వాత ఆ ఊళ్లో చావులు మొదలౌతాయి. ఊరిని మంత్రాలతో అష్ట  దిగ్బంధనం చేసినా ఫలితం ఉండదు. అదే సమయంలో జాతరకు  త‌న త‌ల్లితో క‌లిసి బంధువుల ఇంటికి వ‌చ్చిన సూర్య (సాయిధ‌ర‌మ్ తేజ్‌) అక్కడ ఆ ఊరి అమ్మాయి నందిని (సంయుక్త‌) (Samyuktha)పై మనస్సు పడతాడు. ఆ ఊరి పరిస్దితులు చూసి వెళ్లిపోదామనుకున్నా తన ప్రేమించిన అమ్మాయి ఆపదలో పడటంతో ఆమెను  కాపాడ‌టం కోసం మ‌ళ్లీ ఊళ్లోకి తిరిగొస్తాడు. దాంతో అసలు మరణాలు వెనక ఉన్న మిస్టరీని  ఛేదించ‌డానికి న‌డుం బిగిస్తాడు.  అప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయిటకు వస్తాయి. అవే ఏమిటి… ఆ ఊరిలో మరణాలను సూర్య ఆపగలిగాడా.. ఆ మరణాలకు కారణం అప్పటి శాపమేనా లేక మరేదన్నానా ?అన్నది మిగ‌తా క‌థ. (Virupaksha Review).

ఎనాలసిస్ :

తెలుగులో ఎక్కువగా చేతబడి లేదా దెయ్యం కథలు చేసింది రామ్ గోపాల్ వర్మనే. ఆ కాన్సెప్టులను చిన్న లో బడ్జెట్ స్దాయికి తెచ్చేసారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కన్నా హారర్ కు ప్రయారిటీ ఇచ్చి అవుట్ డేటెడ్  వ్యవహారంగా ఈ సినిమాలను మార్చేసారు. దాంతో పెద్ద హీరోలు ఎవరూ వాటి జోలికి పోరు. కానీ సుకుమార్ అండతో సాయి తేజ అటు అడుగులు వేసారు. హారర్ కు ప్రయారిటి తగ్గించి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెంచి సినిమాని ఒడ్డున పడేసారు. ఖచ్చితంగా ఇది స్క్రిప్టుతో చేసిన మ్యాజిక్కే. అదే సమయంలో టెక్నికల్ గా కూడా మంచి స్టాండర్డ్స్ లో సినిమా తీయటం కలిసొచ్చిన అంశం.

ఇక సాధారణంగా మనలో ఉన్న అతి పెద్ద భయాలను, తట్టుకోలేని పీడకలలను బయిటకు తెచ్చి ఉద్వేగానికి లోను చేయటం హారర్ చిత్రాలు రెగ్యులర్ గా చేసే పని. అయితే అవి జెన్యూన్ హారర్ చిత్రాలా లేక ఆ ముసుగులో ఉన్న థ్రిల్లర్ చిత్రాలా అనే దాన్ని బట్టి ఆ ఎక్సపీరియన్స్ ఆధారపడి ఉంటుంది.  మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ చిత్రాలు చేసే పని విజువల్స్ ని చూపెట్టడం,  డైలాగుల్లో చెప్పటం కాదు. ఓ చిత్రమైన వాతావరణం ఎస్టాబ్లిష్ చేసి అందులోకి మనని లాగుతారు. ఆ విషయంలో వందశాతం ఈ సినిమా సక్సెస్ అయ్యింది.  కథను మెల్లి మెల్లిగా వేడిక్కిస్తూ ఒక్కసారిగా సర్పైజ్ చేసే ప్రయత్నం ఈ సినిమాలో జరిగింది.

అందుకోసం ఫస్టాఫ్ లో లవ్ స్టోరీని, కథా సెటప్ ని మాత్రమే చూపించారు. హీరోని ప్యాసివ్ గా కేవలం తన చుట్టూ జరిగే సంఘటనలకు సాక్షి భూతుడుగానే ఉంచి..సెకండాఫ్ లో అతన్ని ఎడ్వెంచర్ లోకి తోసి వెనుక మిగతా పాత్రలు చోద్యం చూసేలా చేసారు. ఇది సక్సెస్ ఫుల్ స్క్రీన్ ప్లే సెటప్ అనే చెప్పాలి. మొదటే భారీగా చేసేస్తే ఆ తర్వాత ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయి..వాటిని రీచ్ అవటం కోసం తిప్పలు పడటం తప్ప ఏమీ జరిగేది కాదు. హఠాత్తుగా పెద్ద శబ్దాలు, ఊహించని ఇమేజ్ లు వాడి కొంత హారర్ ని క్రియేట్ చేసారు కానీ పూర్తి స్దాయిలో భయపెట్టలేదు. కథా లక్ష్యం మిస్టరీని విప్పటంగా పెట్టుకున్నారు కాబట్టి దానికే ప్రయారిటి ఇచ్చినట్లున్నారు.అన్నిటికన్నా అతి ముఖ్యంగా కథలో కీలకమైన ప్లాష్ బ్యాక్ ని సమర్ధవంతంగా డీల్ చేసారు.

టెక్నికల్ గా చూస్తే :

టెక్నికల్ గా ఈ సినిమా పూర్తి స్కిల్ ఫుల్ గా  slick గా స్టైలిష్ గా ఉంది.  అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపించినా  ప్రేక్ష‌కుల‌కి ఓ మంచి థ్రిల్ల‌ర్‌ని చూసిన అనుభూతి క‌లుగుతుంది.  ముఖ్యంగా సౌండ్ డిజైన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బి. అజ‌నీష్ లోక్‌ నాథ్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్.  ష్యామ్ ద‌త్ సైనుద్దీన్‌  సినిమాటోగ్రఫీ  మామూలుగా లేదు. మామూలు షాట్స్ ని కూడా నెక్ట్స్ లెవిల్ లో నిలబెట్టింది.విఎఫ్ ఎక్స్ వర్క్ అంత గొప్ప అని చెప్పలేం కానీ తీసి పారేయలేం. . ఎడిటింగ్ ఫెరఫెక్ట్.` నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్  చాలా బాగున్నాయి. రైటింగ్ కూడా సినిమా ఎస్సెట్స్ లో ఒకటి.

నటీనటుల్లో :

సాయిధ‌ర‌మ్ తేజ్ ని డిఫెరెంట్ గా చూపించారు. సెకండాఫ్ లో  తేజు ఎప్రోచ్ బాగుంది. నేచురల్ గా చేయించారు. యాక్ష‌న్ సీన్స్ కూడా రొట్టకొట్టుడు కాకుండా కొత్తగా ఉన్నాయి. సంయుక్త నటన మరోసారి గొప్పగా అనిపించింది.  అజ‌య్‌, రాజీవ్ క‌న‌కాల‌, బ్ర‌హ్మాజీ, సాయిచంద్‌, సునీల్, శ్యామ‌ల త‌దిత‌రుల పాత్ర‌ల‌కి మంచి ప్రాధాన్యం ద‌క్కింది. సునీల్ పాత్ర‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్నా ఎలివేట్ చేయలేదు. ర‌వికృష్ణ‌, సోనియా సింగ్‌… ఇలా మ‌రికొంద‌రు పోషించిన‌వి చిన్న పాత్ర‌లే అయినా బాగా వర్కవుట్ చేసారు.

చూడచ్చా:

తెలుగులో  ఓ మంచి థ్రిల్లర్స్ రావటం లేదనుకునే వారికి ఆ లోటు తీరుస్తుంది.

నటీనటులు :

సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సోనియా సింగ్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు

సాంకేతికవర్గం :

స్క్రీన్ ప్లే : సుకుమార్
ఛాయాగ్రహణం : ష్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం : బి. అజ‌నీష్ లోక్‌ నాథ్‌
నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్
సమర్పణ : బాపినీడు .బి
నిర్మాత : బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌
Run Time 2h 25m
కథ, దర్శకత్వం : కార్తీక్ దండు
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022