‘విశ్వదర్శనం’కి దాదాసాహెబ్ పురస్కారం
విశిష్ట దర్శకుడు, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వదర్శనం’. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ట్యాగ్‌లైన్. కె.విశ్వనాథ్ లీడ్ రోల్లో పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి దర్శకుడు. ఇటీవల ‘సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్) ‘విశ్వదర్శనం’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. అదేంటంటే.. దాదాసాహెబ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక కథ విభాగంలో ఈ చిత్రానికి పురస్కారం లభించింది. డిల్లీలో ఈ అవార్డు అందుకున్న జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో ఇది ఎంతో మరపు రానిది. కె. విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఈ పురస్కారం రావడం నా ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రం మరెన్నో జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇక నుంచి ప్రదర్శించబడుతుంది’’ అని తెలిపారు.