Reading Time: 4 mins
వి. మధుసూదనరావు శతజయంతి వేడుకలు
ఘనంగా వి. మధుసూదనరావు శతజయంతి వేడుకలు
తెలుగు సినిమా స్వర్ణయుగానికి మెరుగులు దిద్దిన మహోన్నతులైన దర్శకుల్లో వీరమాచినేని మధుసూదనరావు అలియాస్‌ విక్టరీ మధసూదనరావు ఒకరు. ఆత్మబలం, గుడిగంటలు, కల్యాణమంటపం, లక్షాధికారి, భక్తతుకారం, పదండి ముందుకు, ఆరాధన, మనుషులు మారాలి, మల్లెపూవు, చక్రవాకం, వీరాభిమన్యు, రక్తసంబంధం, విక్రమ్‌, సామ్రాట్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా చరిత్రలో 71 సినిమాలకు దర్శకత్వం వహించి.. 95 శాతం విజయాలను స్వంతం చేసుకున్న ప్రతిభాశీలి వి. మధుసూదనరావు.
1923 జూన్‌ 14న జన్మించిన 2023కి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన శతజయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో ఘనంగా నిర్వహించారు అయన కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా మధుసూదనరావు గారి శిష్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అనివార్య కారణాల వల్ల ఈ సభకు హాజరుకాలేకపోతున్నానంటూ తన సందేశాన్ని లేఖ రూపంలో పంపించారు.
ఆ లేఖలో ‘‘ విజయాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న శ్రీ వి. మధుసూదనరావు గారి గురించి ఈ తరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అభ్యుదయానికి పార్టీలు, సిద్ధాంతాలతో పని లేదు. మానవతా వాదమే అసలు సిసలు అభ్యుదయవాదం. అటువంటి అభ్యుదయవాది శ్రీ వి.మధుసూనరావు గారు. ఆయన బాల్యానికి, నా బాల్యానికి సారూప్యతలున్నాయి. అమ్మ ఒడే బడి కావాల్సి ఉండగా మాకు సమాజమే బడి అయింది. శ్రీ వి. మధుసూదనరావు గారికి విజయాలు సునాయాసంగా దక్కలేదు. రాయలసీమ కరువు బాదితుల సహాయార్ధం సినీ దిగ్గజాలందరూ నాటక ప్రదర్శన తలపెట్టినప్పుడు మధుసూదనరావు గారి జీవితంలో ఎదురైన అతి సంక్లిష్ట పరిస్థితి, అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన ఎంతటి మానవతా వాదో తెలియజేస్తుంది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంతంగా, రాజీలేకుండా పరిశ్రమించారు. స్వాతంత్య్రోద్యమ ప్రభావంతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. ఆయన చలనచిత్రాలు నేను చాలా చూశాను. అభ్యుదయ వాదాన్ని సామాన్య ప్రజానీకానికి మరింత చేరువ చేయడానికి ఆయన సినీ మాధ్యమాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఎంతో మంది కథానాయకులకు, కథానాయికలకు, ఇతర నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి, దర్శకులకు బ్రేక్‌ ఇచ్చినా అది తన ఘనతగా ఏనాడూ చెప్పుకోని నిగర్వి, సమాజంపై ప్రభావం చూపిన విజయాలు. మనుషుల ఆలోచనల్లో మార్పులు తెచ్చిన విజయాలు వీరమాచనేని మధుసూదనరావు… విక్టరీ మధుసూదనరావు అయ్యారు. ‘వి’ అంటే సమాజంలో మార్పునకు బీజం వేసిన విక్టరీ. ‘వి’ అంటే వినూత్న పథగామి. ‘వి’ అంటే విలువలకు కట్టుబడిన మనిషి. శ్రీ వి.మధుసూదనరావు గారి స్ఫూర్తిని నేటి తరానికి కూడా తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన శతజయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న శ్రీ వి. మధుసూదన రావు గారి కుటుంబసభ్యులకు నా అభినందనలు’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మధుసూదనరావు గారి కుమార్తె వాణి మాట్లాడుతూ…
మధుసూదనరావు గారి అమ్మాయి అనే గొప్ప గుర్తింపును ఇచ్చిన నాన్న గారి రుణం ఎలా తీర్చుకోగలను. ఆయన సినిమానే శ్వాసించారు.. సినిమానే జీవితంగా భావించి పయనించారు. జయాపజయాలను ఒకే రీతిని తీసుకునే స్పోర్టివ్‌నెస్‌ వల్ల ఆయన్ను గర్వం దూరం నుంచి చూడటం తప్ప ఆయన దరికి కూడా రాలేకపోయింది. ఇంతమంది పెద్దలు నాన్నగారిని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని స్మరించుకుంటున్నారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్ధమౌతోంది. నాన్నగారి శతజయంతి వేడుకలకు విచ్చేసి ఆయనకు నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
ప్రముఖ నటులు, నిర్మాత మురళీమోహన్‌ మాట్లాడుతూ…
మధుసూదనరావు గారి దర్శకత్వంలో నేను నటించడం నిజంగా నా అదృష్టం. ఆయన చాలా కోపిష్టి… ఎంత కోపిష్టో.. అంత మంచి మనసు కల వారు. నటన విషయంలో ఆయన్ను ఒప్పించడం అంత తేలిక కాదు. నాకు జేబుదొంగ సినిమాలో సెకండ్‌ హీరో అవకాశం ఇచ్చారు. మొదట చాలా భయపడ్డాను. ఆ తర్వాత ఆయన మెప్పు పొందాను. హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిన అగ్రదర్శకుల్లో ఆయనే మొదటి వారు. ఇక్కడ లోకల్‌ టాలెంట్‌ను ప్రోత్సహించటానికి ‘మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ను స్థాపించి ఎందరో కళాకారులను పరిశ్రమకు అందించారు. ఆయన శత జయంతి వేడుకల వేదిక మీద నాకు కూడా మాట్లాడే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ…
నేను ఈరోజు మూడు పూటలా అన్నం తింటున్నాను అంటే అది మధుసూదనరావు గారి దయే. నా చేతి రాత చూసి, నా తలరాత మార్చేశారు అయన. పి. చంద్రశేఖర్‌రెడ్డి గారి ద్వారా ఆయన్ను కలవడం జరిగింది. మొదట ఆయన ఆగ్రహానికి గురైనా.. ఆ తర్వాత ఆయన ప్రేమను అమితంగా పొందిన వాడిని. అలాంటి మహానుభావుడి శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం ద్వారా భావితరాలకు ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పడం చాలా సంతోషం అన్నారు.
దర్శకులు బి. గోపాల్‌ మాట్లాడుతూ…
నేను ఆయన దగ్గర పనిచేయక పోయినా ఆయన సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుంచుకోదగ్గ పేర్లలో మధుసూదనరావు గారి పేరు కూడా ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఇలాంటి పెద్దలను శతజయంతి పేరుతో మరోసారి గుర్తు చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
దర్శకులు ఎస్‌.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ…
మధుసూదనరావు గారి సినిమాలు దాదాపు అన్నీ నేను చూశాను. ఆయన సినిమాల్లో సెంటిమెంట్‌, మానవతా విలువలు, సమాజం పట్ల బాధ్యత కనిపిస్తాయి. ఆయన స్ఫూర్తితోనే నేను ‘మావిచిగురు’ శుభలగ్నం వంటి బంధాలు, అనుబంధాలకు విలువనిచ్చే సినిమాలు తీశాను. ఈ శత జయంతి సందర్భంగా ఆయన్ను మరోసారి మనం గుర్తు చేసుకోవడమే కాకుండా.. నేటి తరం వారికి కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజేసిన ఈ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు నాకు గర్వంగా ఉంది అన్నారు.
ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ…
మధుసూదనరావు గారు కమ్యునిస్ట్‌ భావజాలం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇన్ని కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్‌హిట్‌లు ఇచ్చారంటే చాలా గర్వపడాల్సిన విషయం. సినిమా నవరసాలను సమ్మిళితం చేయడమే అనే సిద్ధాంతాన్ని నమ్మి.. చివరి వరకూ ఆచరించిన వ్యక్తి ఆయన. అలాంటి మహానుభావుని శత జయంతి వేడుకుల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…
నాన్నగారికి, మధుసూదనరావు గారికి ఎంతో స్నేహం ఉండేది. సినిమాకు సంబంధించిన ఎ టు జెడ్‌ తెలిసిన వ్యక్తి మధుసూదనరావు గారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలను తీస్తూనే.. మరోవైపు సమాజాన్ని మేల్కొలిపే అభ్యుదయ చిత్రాలను కూడా తీసి విజయం సాధించారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి సినిమా అనే మాధ్యమాన్ని మాగ్జిమమ్‌ ఉపయోగించుకున్న దర్శకుల్లో మధు గారు ముందు వరుసలో ఉంటారు. అందుకే విక్టరీని ఇంటిపేరుగా పొందగలిగారు. ఆయన భౌతికంగా మరణించినా.. ఆయన సినిమాలు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాయి అన్నారు.
నటుడు శివాజీరాజా మాట్లాడుతూ…
గురువు గారి దగ్గర ట్రైనింగ్‌ తీసుకోవడం వల్లనే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అని గర్వంగా చెపుతున్నా. సినిమాకు సంబంధించి ఆయన ఒక డిక్షనరీ వంటి వారు. తాను ఎంచుకున్న కథలో ఏ రసాన్ని ఎంత పాళ్లల్లో మిక్స్‌ చేసి సక్సెస్‌ కొట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన స్థాపించిన ఇనిస్టిట్యూట్‌లో తొలి విద్యార్థుల్లో నేనూ ఒకడిని కావడం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు.
నటుడు బండ్ల గణేష్‌ మాట్లాడుతూ…
నేను ఆయన దగ్గర శిక్షణ తీసుకోవటం వల్లనే పరిశ్రమలో అవకాశాలు పొందాను.. ఇంతటి వాడినయ్యాను. ఆయన శిష్యుడు అనేదే పెద్ద కాండాక్ట్‌ సర్టిఫికెట్‌. నా జీవితంలో మధుసూదనరావు గారికి, ఎస్‌.వి. కృష్ణారెడ్డి గారికి, పవన్‌ కళ్యాణ్‌ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ వేడుకల్లో ఆయన్ను మరోసారి స్మరించుకోవడం నాకు దక్కిన అదృష్టం అన్నారు.
సీనియర్‌ నటి శివపార్వతి మాట్లాడుతూ…
నేను మధుగారి దర్శకత్వంలో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చూశాను. ఆయన్ను దూరం నుంచి అయినా చూస్తే చాలు అని అనుకునేదాన్ని. అలాంటిది రవీంద్రభారతిలో నా నాటకం ఒకటి ఆయన వీక్షించారు. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన మనవరాలితో కలిసి నటించాను. ఈరోజు ఇంతమంది ఈ వేడుకకు ఆయన్ను స్మరించుకోవడానికి వచ్చారంటేనే అర్ధమౌతోంది ఆయన సాధించిన విజయాలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులను మధుసూదనరావు గారి కుటుంబ సభ్యులు శాలువాలతోను, మెమొంటోలతోను సత్కరించారు. అలాగే ఆయన సినిమాల్లోని పాటలతో ఏర్పాటు చేసిన నృత్యాలు, గాయకులు, గాయనీమణులు ఆలపించిన ఆయన చిత్రాల్లోని పాటలు ఆహూతులను అలరించాయి.
ఇంకా ఈ కార్యక్రమంలో మధుసూదనరావు గారి మనవడు నవీన్‌, మనవరాలు నీలిమ, ఆల్మండ్ హౌస్ అధినేత మేనల్లుడు నాగార్జున, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ప్రసాదరావు,ప్రిన్సిపల్ డాక్టర్ జి కుమారస్వామి, ఫ్యాకల్టీ గడ్డం ప్రశాంత్, శివరామిరెడ్డి మరియు ప్రస్తుత, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.