Reading Time: 2 mins

శ్రీకాంత్ మీడియా సమావేశం

అఖండ ఒక హై ఓల్టేజ్ సినిమా –   శ్రీకాంత్

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే బోయపాటి గారు అన్నారు. సరైనోడు సినిమాలో మంచి సాఫ్ట్ కారెక్టర్ ఇచ్చారు. మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా అని అన్నాను. అలా కొన్ని రోజులు ఎదురుచూశాను. అలా ఓ సారి బాలయ్య బాబు అఖండ కోసం విలన్ కారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా? అనుకున్నాను.

నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేశారు. ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. వరదరాజులు పాత్ర చాలా బాగా వచ్చింది.

బాలయ్య గారితో శ్రీరామారాజ్యం సినిమాలో నటించాను. అందులో లక్ష్మణుడి పాత్రలో తమ్ముడిగా కనిపిస్తే ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అప్పుడు మన పాత్ర కూడా బాగా వస్తుందంటూ బోయపాటి గారికి చెబుతూ ఉండేవారు. క్రికెట్ ఆడే సమయం నుంచి ఆయనతో మంచి ర్యాపో ఉంది.

ఈ సినిమా తరువాత బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. సబ్జెక్ట్‌లు నేను చెబుతాను అని బాలకృష్ణ అనేవారు.

లెజెండ్ సినిమా జగపతి బాబుకు ఎంత ప్లస్ అయిందో నాకు తెలుసు. ఇప్పటికీ మంచి స్థానంలో ఉన్నారు. నాకూ అలా ఉంటుందని నేను అనుకోను. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దర్శక నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి. ఓ పక్కన హీరోగా, విలన్‌గా నటిస్తున్నాను ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలోనూ పాత్రను పోషిస్తున్నాను. మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను.

ఈ చిత్రంలో నాది సెటిల్డ్ పర్ఫామెన్స్‌లా ఉంటుంది. తెగ అరిచుకునేలా ఉండదు. డబ్బింగ్‌లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. సెటిల్డ్‌గా డైలాగ్స్ చెప్పించారు.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య గారి దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది.

ఇది హెవీ హై ఓల్టేజ్ సినిమా. నేచర్‌తో ఎలా ఉండాలి.. ఎలా  పోరాడాలనే విషయాలుంటాయి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా పాత్రను చూసి జనాలు ఏమంటారు? తిడతారా? అని చూస్తున్నాను.

నాకు హీరోగా చేయడమే ఇష్టం. కానీ పాత్రలు నచ్చితే కారెక్టర్‌లు కూడా చేశాను. అది నాకొక సరదా. హీరోగానే చేస్తాను అని పట్టుపట్టను. లైఫ్‌ను అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి.

ఇలాంటి సినిమాను చేయాలంటే అది బోయపాటి గారి వల్లే అవుతుంది. కథ వినేటప్పుడు.. తెర మీదకు వెళ్లేటప్పటికి చాలా హైలో ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. బాలక‌ృష్ణ గారు నేను కలిసి ఓ ఫైట్ కోసం తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం. హీరోగానే బెటర్ అనే పరిస్థితికి వచ్చాను (నవ్వులు)

థియేటర్లో చూసే ఎక్స్‌పీరియన్స్ వేరు. ఓటీటీలో అయితే ఇంట్లో ఒకరిద్దరం కూర్చుని చూస్తాం. కానీ ఇలాంటి సినిమాను అందరి మధ్య కూర్చుని చూస్తూ విజిల్స్ వేస్తూ చూడాలి. అప్పుడే మజా ఉంటుంది.

పునీత్ రాజ్ కుమార్‌తో ఓ సినిమాలో విలన్‌గా నటించాను. శంకర్ రామ్ చరణ్ సినిమాలో ఓ పాత్రను చేస్తున్నాను. వివరాలు ఇప్పుడే చెప్పొద్దని అన్నారు.