సినిమా బండి మూవీ రివ్యూ
ధైర్యంగా ఎక్కచ్చు: ‘సినిమా బండి’ రివ్యూ
Rating:3/5
మన దేశంలో చాలామందికి సినిమా అనేది ఒక కల. సినిమాని నిర్మిద్దాం అనికాని, డైరెక్ట్ చేద్దాం అని కాని, యాక్ట్ చేద్దాం అని కాని.. ఇలా ఏదో ఒక కల ఉండే ఉంటుంది. వాళ్లందరికి ఎక్కడో ఏదో మూల ఒక చిన్న ఆశ ఉంటుంది. సినిమాకి సంభందించిన ఏదైన పని చేయగలమా అని. సినిమా అంటే అంత ఇష్టం మన ఇండియన్స్‌కి అందులోనూ మన తెలుగు వాళ్లకి. ఆ ఇష్టాన్ని బేస్ చేసుకుని ఓ కాన్సెప్టు అనుకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమా..కొంతమంది పల్లెటూరు వాళ్లు సినిమా తీయటం గురించి ఉంటుంది అని మనకు ట్రైలర్స్ తో అర్దమైంది. ఇలాంటి సినిమాలు మనకు నచ్చుతాయా..ఇలాంటి కథలు మనకు ఎక్కుతాయా…అసలు ఆ కథేంటో, దాని వ్యవహారం ఏమిటో చూద్దాం..
స్టోరీ లైన్…
హృదయంలో ప్రతీ ఒక్కరూ ఫిల్మ్ మేకర్సే అనే ట్యాగ్ లైన్ తో మొదలయ్యే ఈ సినిమాలో ..గొల్లపల్లి అనే తిరుపతి దగ్గర చిన్న ఊరు. అక్కడ ఓ ఆటోడ్రైవర్ వీరబాబు (వికాస్ వశిష్ట)కు కెమెరా దొరుకుతుంది. దాని గురించి అతనికేమీ తెలియదు. కొద్దిగా కెమెరా నాలెడ్జ్ ఉన్న తన ప్రెండ్ పల్లెటూరి ఫొటోగ్రాఫర్ గణపతి(సందీప్ వారణాసి) ని సంప్రదిస్తారు. మొదట దాన్ని అమ్మేయాలనుకున్నా…ఆ తర్వాత దాంతో సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తుంది. దాంతో ఆ కెమెరాతో తాను తన గ్రామంలో, తన స్నేహితులతో ఓ సినిమా తీయాలనుకుంటాడు. కానీ అతనికిగానీ, అతని స్నేహితులకు కానీ సినిమాను ఎలా తీస్తారో తెలియదు. కానీ ఎన్నో సినిమాలను చూసిన వారి అనుభవం, వారికి దొరికిన కెమెరా సినిమా తీయాలనే తపన వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళుతుంది.
అప్పుడు బార్బర్ షాపు నడుపుకునే మరిడియ్య( రాగ్ మయూర్) ని తమ సినిమాకు హీరోగా ఎంపిక చేసి ముందుకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఆ ఆటోడ్రైవర్ ఎదుర్కున్న పరిణామాలు, ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు అన్నీఎంటర్టైన్మెంట్ గా సాగుతాయి. మధ్యంలో హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్, ఊరి వారందరూ నిలదీయటం, ఈ లోగా అసలు ఆ కెమెరా ఓనర్ రావటం, సినిమా ఆగిపోవటం వంటి వాటి చుట్టు తిరుగుతుంది. ఈ క్రమంలో ఈ ఊరి వారి అమాయకత్వం, సినిమా చేయాలనే వారి ఆసక్తి ఎలా ముగింపుకు వచ్చాయి. వారు సినిమాని పూర్తి చేయగలిగారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్..
ఎప్పటికప్పుడు కొత్తరకమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు రాజ్ అండ్ డీకే ద్వయం. వారు ‘గో గోవా గాన్’ వంటి జాంబీ ఫిల్మ్, ‘స్త్రీ’ వంటి బ్లాక్‌బాస్టర్ సినిమాలను చేశారు. దాంతో వారి నుంచి వస్తున్న సినిమా అనగానే ఖచ్చితంగా సినిమాపై ఆసక్తి కలుగుతుంది. అందులోనూ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ క్రమంలో చాలా మంది దృష్టి ఈ సినిమాపై పడింది. ఆ అంచనాలను చాలా వరకూ రీచ్ అయ్యారనే చెప్పాలి. సినిమాలో పల్లెటూరు అమాయకత్వపు పాత్రలు చేసే సున్నితమైన హాస్యం, అలాగే ఆ స్వచ్ఛమైన మనస్తత్వాలు మధ్య రగిలే సంఘర్షణలు వర్కవుట్ అయ్యాయి. అయితే కథలోకి స్పీడుగా వెళ్ళిపోయి..ఆ తర్వాత ఏ మలుపు లేకుండా చాలా సేపు సినిమా నడపటం కాస్త విసిగిస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ లు సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి. అయితే స్లోగా సాగే కొన్ని సీన్స్ , మనకు తెలుసున్న ఆర్టిస్ట్లులు ఎవరూ లేకపోవటం, సరైన ప్యాడింగ్ లేకపోవడంతో ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీల్ వచ్చింది. అయితే కాన్సెప్టు వైజ్ ‘కెమెరా వాడటం కూడా రాని పల్లెటూరు బ్యాచ్, ఓ ఫ్యూచర్ ఫిల్మ్ తీయడానికి పడిన పాట్లు బాగా నవ్విస్తాయి. దాంతో సినిమా చూస్తున్నంత సేపు వీరబాబు, గణపతి ఉంటున్న ఊరిలోకి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అలాగే చిన్న చిన్న పంచ్ లు, సున్నితమైన హాస్యం కూడా సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అలాగే ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసరికి, ఎమోషన్స్ తో నింపటం కూడా పండింది. అయితే క్లైమాక్స్ కాస్తంత డోస్ పెంచితే మరింత బాగుండేది.
దర్శకత్వం,మిగతా విభాగాలు
కొత్త డైరక్టర్ ప్రవీణ్ పై ప్రపంచ హాఫ్ బీట్ సినిమా,ముఖ్యంగా ఇరాన్ సినిమా ప్రబావం ఉన్నట్లు అర్దమవుతోంది. తెలుగులో తీస్తున్నాం కదా అని కమర్షియల్ ఎలిమెంట్స్ ని పోగెయ్యకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళటం కలిసొచ్చింది. అలాగే ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్‌సిరీస్ అద్భుతమైన సక్సెస్‌తో హిందీ పరిశ్రమతో పాటు మిగతా ఇండస్ట్రీల చూపును తమ వైపు తిప్పుకున్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే). వారు నిర్మాతలు కావటం కూడా ప్లస్ అయ్యింది. తక్కువ ఖర్చుతో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. మ్యూజిక్ కూడా సినిమాకు తగ్గట్లు సాగింది.
ఇక హీరోగా నటించిన వికాస్ వశిష్ఠ, అలాగే మరో నటుడు సందీప్ వారణాసి, రాగ్ మయూర్ కూడా తమ పాత్రల్లో అద్భుతమైన నటన కనబర్చారు. మిగిలిన నటీనటులు నటన కూడా మనల్ని నవ్విస్తోంది. పదిమంది స్నేహితులు కలిసి ఈ ఇండిపెండెంట్ సినిమాను చేశారు. ఈ సినిమా కోసం వీరిలో కొందరు యాక్టర్స్‌గా కూడా మారారు
చూడచ్చా…
ఏ మొహమాటం లేకుండా చూసేయచ్చు…..
తెర వెనక, ముందు…
నటీనటులు : వికాస్ వశిష్ఠ, వారణాసి సందీప్ కుమార్, రాగ్ మయూర్, ఉమా వైజి, సింధు శ్రీనివాసమూర్తి, సిరివెన్నెల, త్రిషర తదితరులు.
కథ: వసంతమరింగంటి
స్క్రీన్ ప్లే: ప్రవీణ్ కంద్రెగుల, వసంతమరింగంటి, కృష్ణ ప్రత్యూష
సినిమాటోగ్రాఫర్స్: అపూర్య సాలిగ్రమ్, సాగర్ వైవీవీ
ఎడిటర్స్: ధర్మేంద్ర కాకరాల ఎఎఫ్‌ఈ, రవితేజ గిరిజాల
మ్యూజిక్: శిరీష్ సత్యవోలు
సౌండ్ సింకరనైజేషన్ డిజైన్: అక్షయ్ పటేల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: విజయ్‌శంకర్ డొంకాడ, రాహుల్ గాంధీ
లైన్ ప్రొడ్యూసర్: అఖిల్‌రెడ్డి
అసోసియేట్ డైరెక్టర్స్: కృష్ణ ప్రత్యూష, కొండురు దీపక్ రాజు, వసంత మరింగంటి
అసిస్టెంట్ డైరెక్టర్స్: శ్రీనిబాబు ముసిమి, వంశీకృష్ణ కుప్పం, సిద్దార్థ్ వర్మ కె, చింతలరాజు, ఎమ్ అభిజిత్
అసోసియేట్ సినిమాటోగ్రాఫర్: రోహిత్ కొప్పు
కాస్ట్యూమ్ డిజైనర్స్: సిరివెన్నెల యడమండ్ల, కృష్ణ ప్రత్యూష
ప్రొడక్షన్ డిజైనర్స్: అఖిల్‌రెడ్డి, కృష్ణ ప్రత్యూష
డైరెక్టర్: ప్రవీణ్ కంద్రెగుల
నిర్మాతలు: రాజ్ అండ్ డీకే
రన్ టైమ్: 1 గంట ,38 నిముషాలు.
ఓటీటి: నెట్ ప్లిక్స్
విడుదల తేదీ: 14,మే, 2021.