Reading Time: 2 mins

సినీ ప్రముఖులు తెలుగు TV ఎంటర్ టైన్ మెంట్ చానళ్ళ నిర్వాహకులతో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చ

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సినిమా, TV షూటింగ్ లు, సినిమా థియేటర్ ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులు, తెలుగు TV ఎంటర్ టైన్ మెంట్ చానళ్ళ నిర్వాహకులతో చర్చించారు.

ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలకు అనుగుణంగా, గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధి కారులతో జరగనున్న సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా చర్చించారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుమారు  85 సినిమాల షూటింగ్ లు వివిధ దశలలో ఉన్నాయని, మరికొన్ని షూటింగ్ లు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నాయని వివరించారు.

షూటింగ్ లకు అనుమతించడం వలన అనేక మందికి తిరిగి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. షూటింగ్ లను కూడా ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తామని చెప్పారు. షూటింగ్ లలో పాల్గొనే సినిమా ఆర్టిస్టులు వ్యక్తి గత పరిశుభ్రత తదితర జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగ అభివృద్దికి దేశంలోనే బెస్ట్ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుందని మంత్రి శ్రీ శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సినిమా, టీవీ లకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేలా ఇప్పటికే ఆదేశాలను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని, కానీ షూటింగ్ ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు, సినిమా థియేటర్ లను తెరిచిన తర్వాత పరిస్థితులను కూడా పరిగణ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సినీ పరిశ్రమ కు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాల నిర్వహణకు తోడ్పాటును అందించే రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

ఈ సంస్థ బలోపేతంతో చిత్ర పరిశ్రమ కు చేయూతను అందించడంతో పాటు ఆర్టిస్టులను ప్రోత్సహించేలా ఆవార్డుల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

ఈ సమావేశంలో FDC మాజీ చైర్మన్ రాం మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు మురళి మోహన్, నిర్మాతలు C.కళ్యాణ్, దిల్ రాజు, సురేందర్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ N.శంకర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అద్యక్షులు నరేష్, జీవిత, ఎగ్జిబిటర్స్ సునీల్ నారంగ్, విజయేందర్ రెడ్డి, రాజ్ తాండ్ల, మా, ఈ టీవీ, జెమిని, జీ తదితర TV చానళ్ళ నిర్వాహకులు  అలోక్ జైన్, బాపినీడు, సుబ్రహ్మణ్యం, అనురాధ గూడూర్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.