సుడానీ ఫ్రమ్‌ నైజీరియా చిత్రం రివ్యూ

Published On: November 6, 2020   |   Posted By:
సుడానీ ఫ్రమ్‌ నైజీరియా చిత్రం రివ్యూ
 
గుడ్ ఫిల్మ్స్ ఫ్రమ్ కేరళ:‘సుడానీ ఫ్రమ్‌ నైజీరియా’ రివ్యూ

Rating:3/5

అవార్డ్ విన్నింగ్ సినిమాలంటే మనకు అవి ఆర్ట్ సినిమాల్లా భయపెడుతూ దూరం పెట్టేస్తూంటాం. అయితే మానవత్వం మేల్కొపుతూ హాస్య ప్రధానంగా సాగే సినిమాలు సైతం అవార్డ్ లు సంపాదిస్తాయని ఊహించం. అలాంటి సినిమాల్లో ఒకటి సౌబిన్‌ షాహిర్‌ కీలక పాత్రలో నటించిన మళయాళ చిత్రం ‘సుడానీ ఫ్రమ్‌ నైజీరియా’. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది బిగ్గెస్ట్‌‌‌‌ కమర్షియల్‌ హిట్ సినిమాల్లో ఒకటి. కేరళ స్టేట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌ ఐదు సాధించటమే కాక, 66వ ‘జాతీయ చలనచిత్ర పురస్కారాలు’ లో ఉత్తమ మలయాళ చిత్రం అవార్డ్ పొందింది. ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి ఆహా యాప్ వారు మనకు అందించారు. ఇంతకీ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించటానికి కారణమేంటి..అవార్డ్ లు ఎందుకు వచ్చాయి..అసలు అంత గొప్ప కథ,కథనం ఈ సినిమాలో ఉందా..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

స్టోరీ లైన్

నైజారియాకు చెందిన శ్యాముల్ ఫుట్ బాల్ ఆటగాడు. తన జీవిత కష్టాలను అధిగమనించటానికి కేరళలోని ఓ క్లబ్ తరుపున డబ్బులకు ఆడటానికి వస్తాడు. వచ్చి ఇక్కడ తమ టీమ్ కు సక్సెస్  ఇస్తాడు. కానీ అనుకోని విధంగా బాత్రూమ్ లో జారిపడటంతో అసలు కష్టాలు మొదలవుతాయి. అయితే కష్టాలు వచ్చేది శ్యాముల్ కు అనుకుంటే మీరు పొరబడినట్లే. శ్యామూల్ ని రప్పించిన మేనేజర్ మజీద్ రెహమాన్ కు అసలు సమస్యలు వస్తాయి. ఇప్పటికిప్పుడు తమ ఆటకు పనికి రాడు కదా అని పంపటానికి కుదరదు. కాలిమడమకు బాగా దెబ్బ తగలటంతో సర్జరీ చేయించాల్సి వస్తుంది. అసలే మజీద్ కు ఆర్దిక కష్టాలు ఎక్కువ. దాంతో ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ప్రెండ్ భార్య నగలు తాకట్టు పెట్టి మ్యానేజ్ చేస్తాడు. కానీ శ్యామూల్ ని తగ్గి నడిచేదాకా హాస్పటిల్ లో ఉంచాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దాంతో వేరే దారి లేక, ఇష్టం లేకపోయినా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. అక్కడ నుంచి బెడ్ పై ఉన్న అతనివల్ల కొన్ని సమస్యలు..ఇబ్బందులు. వాటిని మజీద్ ఎలా అధిగమించాడు. శ్యామూల్ తో తప్పనిసరి పరిస్దితుల్లో కలిసి జర్ని మొదలెట్టాక అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. చివరకు శ్యామూల్ ..నైజీరియా వెళ్లాడా…అతన్ని ఫ్రమ్ సూడాన్ అని ఎందుకు అన్నారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ సినిమా చూస్తూంటే మనకు ఇదే హీరో చేసిన ఆండ్రాయిడ్ కట్టప్ప సినిమా గుర్తుకు రావటం సహజం. అలాగే స్పీల్ బర్గ్ ఇటి తరహా సినిమా ఇది. మనకు సంభందంలేని ఓ జీవి లేదా వ్యక్తి లేదా ప్రాణి మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చి,మనతో స్నేహం చేసి,తనదైన ముద్ర వేసి, వెళ్లిపోతుంటే ఆ భావోద్వేగం అపూర్వం. అదే ఇక్కడ సమర్దవంతంగా ఆవిష్కరిస్తాడు దర్సకుడు. అన్నిటికన్నా మానవత్వం గొప్పదని చెప్పకనే చెప్తాడు. ఎక్కడా సందేశం ఇవ్వడు కాని అతను అంతర్గతంగా చెప్పే విషయాలు మన హృదయం ఆలకిస్తుంది. శ్యామూల్ పై మనకు సినిమా ప్రారంభంలో పెద్ద ఇంప్రెషన్ ఉండదు. కానీ రాను రానూ అతనిపై సానుభూతి,సహాయానుభూతి ఏర్పడతాయి. ఓ సారి శ్యామూల్ ని వాళ్ల ఊరు మనమూ చూసి వద్దాం అనేంతగా కథలోకి తీసుకెళ్తాడు. నిజానికి ఇదో సీరియస్ స్టోరీ. కానీ దానిన్ని చెప్పటంలో ఫన్ ని అడ్డం పెట్టి ఆ పెయిన్ ని డైరక్ట్ గా మనని తాకకుండా చేస్తాడు దర్శకుడు. ఆ విషయంలో కథకుడుగా డైరక్టర్ సక్సెస్. అయితే శ్యామూల్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ అయితే అతికినట్లు అనిపించవు. మరీ మెలోడ్రామాగా అనిపించాయి. ఇంక హీరో పెళ్లి చూపులు తంతు గమ్మత్తుగా ఉంటుంది. అసలు హీరో క్యారక్టరైజేషన్ తోనే సగం మార్కులు కొట్టేస్తాడు దర్శకుడు. చాలా నాచురల్ గా కథని నడపటంతో మనకు ఎక్కడా ఈ సినిమా అసహజంగా అనిపించదు. మన ప్రక్క వీధిలోనో, మన ప్రక్క ఊళ్లోనో కథ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.

టెక్నికల్ గా ..

ఈ సినిమా కథ,కథనం చాలా రిచ్ గా ఉండటంతో మిగతా విషయాల జోలికి పోబుద్ది కాదు. అయితే మిగతా డిపార్టమెంట్స్ అన్ని కలిసికట్టుగా నిలబడ్డాయి కాబట్టే ఆ కథ,కథనంకు వన్నె వచ్చింది. ఇక సౌబిన్‌ షాహిర్‌ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. అలాగ్ మజీద్ తల్లి జమీల్యాగా చేసిన ఆమె  మనకు సినిమా పూర్తైనా అలా గుర్తుండిపోతుంది. కెమెరా వర్క్ సినిమాని ఉన్నత స్దాయిలో నిలబెడితే,ఎడిటింగ్ పోటీపోటీగా పరుగెడుతుంది. నిర్మాణ విలువలు నీటుగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ …కేరళ మిడిల్ క్లాస్ లోగిళ్లను చక్కగా ఆవిష్కరించింది.

చూడచ్చా..

తప్పనిసరిగా చూడాల్సిన సినిమా..ఫ్యామిలీ మొత్తానికి నచ్చే అవకాశాలు ఎక్కువ

ఎవరెవరు..

నటీనటులు  సౌబిన్‌ షాహిర్‌, శ్యామూల్ అబిల రాబిన్సన్ తదితరులు
రచన,దర్శకత్వం జకారియా మహ్మద్
నిర్మాత సమీర్ తాహిర్,సైజూ ఖాలీద్
సంగీతం: రెక్స్ విజయన్
సినిమాట్రోగ్రఫీ:  షైజు ఖాలీద్
ఎడిటర్:  నౌఫాల్ అబ్దుల్లా
రన్నింగ్ టైమ్: 124 నిముషాలు
నిర్మాణం: హ్యాపీ అవర్స్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ:  30, అక్టోబర్ 2020
ఆహా యాప్ విడుదల