Reading Time: 3 mins

సూపర్ ఓవర్ మూవీ రివ్యూ

నవీన్ చంద్ర ‘సూపర్ ఓవర్’ రివ్యూ

Rating:2.5/5
 
ఓ ముగ్గురు చిననాటి ప్రెండ్స్ కాశీ(నవీన్ చంద్ర), వాసు(రాకేందు మౌలి),  మధు(చాందిని చౌదరి) పెద్దైనా కలిసే ఉంటారు. కలిసే తింటారు. అమ్మాయి కాబట్టి కలిసి పడుకోవదు అంతే. ఇలా ఇంత కలిసిమెలిసిపోయి జీవితం గడిపేస్తున్న ఈ ముగ్గురుకి మూడు ఏంబిషన్స్. కాశీకు అమెరికా చెక్కాయాలనే జీవితాశయం. అయితే అతని ప్లాన్స్ ఏమీ వర్కవుట్ కావు. అతని ఆశయానికి గండి అన్నట్లుగా ఇంటి దగ్గర నుంచి మామయ్య ఫోన్. ఇంటి మీద చేసిన అప్పు నలభై లక్షలు తీర్చకపోతే..నీకు భవిష్యత్ లో ఇల్లు అనేది ఉండదు అని. సరే ఇప్పుటికిప్పుడు అంత డబ్బు ఎక్కడ వస్తుంది అని మధన పడుతూంటే… ఓ ప్రెండ్ బంగార్రాజు(వైవా హర్ష) ద్వారా క్రికెట్ బెట్టింగ్ చేయచ్చు అని ఐడియా వస్తుంది. వెంటనే బెట్టింగ్ లోకి దూకిన కాశీకు అదృష్టం తనవైపే ఉందని అర్దమైంది. కోటీ నలభై లక్షలు గెలుస్తాడు.అయితే ఆ డబ్బు హవాలా ద్వారా తీసుకోవాలి. వెంటనే ముగ్గురు ఫ్రెండ్స్ ఆ డబ్బు కోసం రంగంలోకి దూకుతారు. హవాలా బ్యాక్ కోసం బయిలుదేరతారు. మరి క్రైమ్ ఉన్నచోట పోలీస్ లు ఉంటారు కదా..కరెక్ట్ గా డబ్బు అందుకుందామనుకునే సరికి అక్కడ ఎస్సై అజయ్ (అజయ్) సీన్ లోకి వస్తాడు. అతన్ని బురిడి కొట్టించి ఎలా ఈ ముగ్గురు ఆ డబ్బుని సొంతం చేసుకున్నారనేది మిగతా కథ.
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

ఓటీటిలో డైరక్ట్ తెలుగు సినిమా రిలీజ్ అంటే భయపడి దూరంగా ఉండే పరిస్దితి ఉంది. రిలీజ్ కాక మూలన పడి ఉన్న సినిమాలు దుమ్ము దులిపి ఓటీటిల్లో వేసేస్తున్నారు అని చాలా మంది ఫిక్స్ అయ్యిపోయారు. అందుకు కారణం ఓటీటి కాన్సెప్టుని సరిగ్గా అర్దం చేసుకుని డిజిటిల్ ప్లాట్ ఫామ్ లకు తగ్గ కంటెంట్ ని మేకర్స్ రెడీ చేయకపోవటమే. అయితే మెల్లిమెల్లిగా ఆ పరిస్దితి మారుతోంది. తెలుగు ఫిల్మ్ మేకర్స్ సైతం డిజిటిల్ మీడియం కు కావాల్సిన కథల వెనక ఉన్న కోడ్ ని క్రాక్ చేస్తున్నారు. పెద్ద తెరకోసం సినిమా తీసి దాన్ని వేరే దారిలేక ఓటీటిలో రిలీజ్ చేయటం కాకుండా వెబ్ ఫార్మెట్ కోసమే స్క్ర్రిప్టులు రాయటం, ఫీచర్ ఫిల్మ్ లు చేయటం చేస్తున్నారు. ఈ విషయం మనకు ఈ సినిమా చూస్తూంటే స్పష్టంగా అర్దమవుతుంది. దర్శకుడు ప్రవీణ్ వర్మ (లేటు) కొత్తవాడైనా ఈ సినిమాని ఓటీటి ప్రమాణాలకు అణుగుణమైన ట్రీట్మెంట్ , లెంగ్త్ తో చేసారు. పాటలు పెట్టుకోలేదు. క్రిస్ప్ గా ప్యాకేజ్ చేసిన థ్రిల్లర్ అందించాలని ప్రయత్నం చేసారు. అందులో ఎంతవరకూ సక్సెస్ అయ్యారనే విషయం ప్రక్కన పెడితే ఓ అవగాహనతో ఈ ప్రయత్నం చేసారని స్పష్టం అవుతుంది.

క్యారక్టర్స్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవటం, సినిమా మొత్తం ఒకే ప్లోలో వెళ్లకపోవటం, కొన్ని చోట్ల కీ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూషన్ చాలా రా గా అనిపించటం వంటి లోపాలు కొట్టచ్చినట్లు కనిపించాయి. అయితే ఎక్కడా మరీ బోర్ కొట్టదు. అలా రన్ వెళ్తూనే ఉంటుంది. సినిమాలో చాలా కోఇన్సిడెంట్ లు, సినిమాటెక్ సంఘటనలు మనని ఇబ్బంది పెడతాయి. అయితే కొత్త డైరక్టర్, బడ్జెట్ పరిమితి అంటూ ఏదో ఒక కారణంతో సరిపెట్టుకుంటే నడిచిపోతుంది. అలాగే హీరో కాశీ పాత్రకు డబ్బు అర్జెంట్ గా కావాలి అని చెప్తారు కానీ ..ప్రాణం పోయేటంత పరిస్దితి అయితే లేదు. అంత రిస్క్ చేసేటంత అవసరమూ కనిపించదు.

 అలాగే బెట్టింగ్ లో గెలుస్తాడు అని చెప్పినా అనుభవం లేని కాశీ హఠాత్తుగా అంత పెద్ద మొత్తం ఎలా గెలుస్తాడనేది మిమ్మల్ని తొలుస్తుంది. ఇలా వెతికి చూస్తే లోపాలు ఎన్నో కనిపిస్తాయి.అవి చాలదన్నట్లు ఫోర్సెడ్ గా అనిపించే ట్విస్ట్ లు . అయితే తెలివైన ట్విస్ట్ లు మన ఇంట్రస్టింగ్ లెవిల్స్ ని తృప్తిపరుస్తాయి. కథలో వచ్చే క్యారక్టర్స్, సంఘటనలు విడివిడిగా అనిపించినా ఒక చోట అవన్నీ కనెక్ట్ అవటం మనకి నచ్చుతుంది. అయినా క్రికెట్ బెట్ లో డబ్బులు సంపాదించాలనే క్యారక్టర్స్ చేసే పనులు ఎవరికి ఇంట్రస్టింగ్ గా ఉండవు చెప్పండి.
  
టెక్నికల్ గా..

మొదటే చెప్పుకున్నట్లు డైరక్టర్ ఫెరఫెక్ట్ ఓటీటి ఫిల్మ్ చేద్దామని అందుకు తగిన జాగ్రత్తలు అన్ని తీసుకునే మొదలెట్టాడు. అందుకు తగ్గ టీమ్ నే సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో ఇలాంటి సినిమాలకు అవసరమైన కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రీరికార్డింగ్ వంటివి బాగా కుదిరాయి. దాదాపుగా ఓ రాత్రి పూట జరిగే కథ.కెమెరా మెన్ ఇది ఓ పరీక్ష. ఏ మాత్రం తేడా కొట్టినా చూసేవాడికి చీకట్లో చిందులాటే. అయితే అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు. చక్కటి లైటింగ్, మూడ్ క్రియేట్ చేసారు. ఓ రకంగా ఈ సినిమాలో అవి విడతీయలేనట్లుగా కలిసిపోయాయి. డైలాగులు మాత్రం కాస్త ఓవర్ అయ్యారు. ఆర్టిస్ట్ లలో నవీన్ చంద్ర నీట్ గా చేసారు. అజయ్, ప్రవీణ్, వైవా హర్ష, చాందినీ చౌదరి వంటివారు రెగ్యులర్ గా చేసుకుంటూ పోయారు. డైరక్షన్ ఇద్దరు చేసారు. మొదట సినిమా ప్రారంభించిన ప్రవీణ్ వర్మ చనిపోతే ఇప్పటికే తన సినిమాలతో ప్రూవైన సుధీర్ వర్మ మిగతాది పూర్తి చేసారు. ఆ మేకింగ్ తేడా మనకు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. పాటలు లేకుండా,లెంగ్త్ తక్కువ పెట్టుకుని సినిమాని జనాలకు బోర్ కొట్టనివ్వకుండా చేసారు.
 
చూడచ్చా

క్రైమ్ థ్రిల్లర్స్ కు ఇష్టపడేవారికి ఇది మంచి కాలక్షేపమే.  
 
తెర ముందు..వెనక

నటీనటులు: నవీన్ చంద్ర-చాందిని చౌదరి-రాకేందు మౌళి-అజయ్-వైవా హర్ష-ప్రవీణ్

తదితరులు

సంగీతం: సన్నీ ఎం.ఆర్
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: సుధీర్ వర్మ
రచన-దర్శకత్వం: ప్రవీణ్ వర్మ
ఓటీటి:ఆహా
రన్ టైమ్: 1 గంట, 20 నిముషాలు
విడుదల  తేదీ: 22/01/2021