స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌ మూవీ రివ్యూ

Published On: July 9, 2021   |   Posted By:
స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌ మూవీ రివ్యూ
 
 
స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌’ రివ్యూ

Rating : 2.5/5
 
గతం..చరిత్ర రూపంలో చదువుకుంటే గొప్పగానూ ఉండచ్చు లేదా బాధగానూ అనిపించవచ్చు. అయితే అదే సిని మాధ్యమం వరకూ వచ్చేసరికి చాలా మార్పులు చేరి అసలు రూపం చెడిపోయి..ఎవరికి కావాల్సిన చరిత్రను వారు చూడటానికి తీసుకున్నట్లు అనిపిస్తుంది అని మనకు వచ్చిన అనేక చరిత్ర సినిమా ఇప్పటిదాకా చెప్పాయి. అయితే చరిత్రలో జరిగిన ఓ వీరోచిత సంఘటనను బేస్ చేసుకుని కొన్ని కల్పితాంశాలు కలిపి తెరకెక్కిస్తే అది జనాలకు నచ్చుతుందా.. అసలు ఈ కాలంలో  చరిత్ర అంటే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు ఎవరు..స్టార్స్ లేకుండా చరిత్రను చూడలేము అని సమాధానం వస్తే ఏమీ చెప్పలేము కానీ…ఓ చారిత్రక సంఘటనను తెరకెక్కించారు.అప్పటి రోజుని ఓ సారి కంటికి కనపడే సాక్ష్యాలతో రీక్రియేట్ చేసుకుని చూద్దామనుకుంటే ఇలాంటి సినిమాలు ఓ దారి చూపెడతాయి. 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా జీ 5 ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ : 26/11’ ను అందించింది. అది వీక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. దాంతో ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌’ ఫ్రాంచైజీలో రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌’ను ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ఈ నేపధ్యంలో ఓటీటిలో వచ్చిన ఈ సినిమా కేవలం చరిత్రకు దారే చూపెట్టిందా లేక ఓటీటి వారికి కాస్తంత డబ్బులు కూడా తెచ్చిపెడుతుందా చూద్దాం.

స్టోరీ లైన్

2002 సంవత్సరం సెప్టెంబరు 24వ తేదీన ఇద్దరు ఇస్లామిక్ తీవ్రవాదులు అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఉన్న కృష్ణధామ్ మందిర్ (అక్షరధామ్‌ మందిర్ ) పై ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనైడ్లతో దాడి (జీహాద్) చేశారు. ఇదంతా పాకిస్దాన్ నుంచి మోనిటర్ చేసారు. ఆ దాడిలో 33 మంది చనిపోయారు.ఆ చనిపోయిన వారిలో 28 మంది సందర్శకులు ఉండగా, ఇద్దరు కమెండోలు, ఒక ఎన్.ఎస్.జి కమెండో, స్టేట్ రిజర్వు పోలీసు‌కు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడిలో ఉగ్రవాదులు కొంత మంది ప్రజలను చంపేసి, అక్కడున్న మరికొందరిని బందీలుగా ఉంచుకుంటారు. ఎలర్టైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్  లు(ఎన్‌ఎస్‌జి) ఉగ్రవాదులు పై ఎదురు దాడి చేస్తారు. వారిని వేటాడి బందీలుగా ఉన్న వారిని విడిపిస్తారు. ఈ ఎన్ఎస్‌జీ టీమ్ కు మేజర్  హనుత్ సింగ్(అక్షయ్ ఖన్నా)  నాయకత్వం వహిస్తారు. అయితే హనుత్ సింగ్, మరియు అతని బృందం ప్రాణాలను పణంగా పెట్టి ఎలా ఉగ్రవాదులను మట్టుపెట్టారనే యాక్షన్ సీక్వెన్స్ లతో చిత్రీకరించినదే ఈ కథ.  

ఎనాలసిస్ …

సినిమా ప్రారంభంలో ఈ సినిమా కథ ఎవరినీ ఉద్దేశించి కాదు…ఇందులోని  సంఘటనలు కానీ,వ్యక్తులను పోలినా అది యాధృచ్చికమే. పాత్రలు కేవలం కల్పితం అని డిక్లరేషన్ ఇస్తూ మొదలవుతుంది. అయితే మొదలైన ముప్పై నిముషాల్లోపే మనకు అర్దమవుతుంది. 2002లో అక్షర్ ధామ్ దేవాలయం పై జరిగిన దాడి గురించిన పాయింట్ తో సినిమా చేసారని. అయితే ఆ సంఘటన జరిగి ఇరవై సంవత్సరాలు దాదాపు అయ్యింది. ఆ జనరేషన్ వారికి గుర్తుండవచ్చు లేదా మీడియాలో వారికి గుర్తుండవచ్చు కానీ ఇప్పటి వారికి ఈ సంఘటన ని గుర్తు తేవటం కష్టమే. ఆ సంఘటనను అడ్డం పెట్టి జాతీయభావాలను మనలో రేకిత్తించాలనుకోవటమూ అత్యాసే. అయితే దర్శకుడు అప్పటి సంఘటనను మన కళ్ల ముందు మరోసారి ఉంచాలనుకున్నాడు. అయితే ఇలాంటి సినిమాల వల్ల పెద్దగా ఒరిగేది ఏముంటుందనిపించినా మన సైనిక శక్తిని, ఎన్ఎస్‌జీ సామర్ద్యాన్ని మరోసారి గుర్తు చేసుకునే అవకాసం కలుగుతుంది.

స్క్రీన్ ప్లే పరంగా చూస్తే చాలా నార్మల్ గా కథనం ఉంటుంది. సంఘటన అయితే ఉంది కానీ దాని చుట్టు అల్లిన సీన్స్ మాత్రం చాలా ఊహాత్మంగా అనిపిస్తాయి. ప్రతీది మనం ప్రెడిక్ట్ చేసేయచ్చు. అలాగే ట్విస్ట్ లు ఏమీ లేదు. క్లైమాక్స్ అసలు జరిగినట్లే అనిపించదు. దానికి తోడు బాగా స్లో నేరేషన్. అది వ్యూయర్స్ ని ఇబ్బంది పెడుతుంది. ఫస్టాఫ్ బాగానే ఉన్నా..సెకండాఫ్ లో చెప్పుకోదగ్గ విషయం అయితే ఏమీ లేదు.టెర్రిరిస్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూట్ చేసే  సీన్స్ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ ని పట్టుకోలేదనిపిస్తుంది.

వాస్తవానికి ఈ మధ్యన అంటే తగ్గాయి కానీ ఆ మధ్యన వరుసగా ఉగ్రదాడులు జరిగాయి. దాంతో .. జాతీయస్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక చట్టం తేవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే మాట మనం తరచూ వింటున్నాం. అమెరికాలో హోంల్యాండ్ సెక్యూరిటీ చట్టం తెచ్చాక.. అక్కడ భద్రతా వ్యవస్థ పరిస్థితి మెరుగైంది. భద్రతాదళాలతో, పోలీసులను సమన్వయం చేశాక.. స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల పనితీరు మెరుగైంది. మనదేశంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాల మధ్య సమన్వయం కాగితాలకే పరిమితమౌతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ వైఫల్యాన్ని మరోసారి గుర్తు చేస్తుందీ సినిమా. ఎంత త్వరగా ఆ సమస్యను సరిదిద్దుకుంటే.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో విజయం సాధించగలమని మనకీ సినిమా ద్వారా దర్శకుడు స్పష్టం చేస్తున్నారు. అక్కడ దాకా మనం అతన్ని అభినందించాలి.

టెక్నికల్ గా…

సినిమాకు కెన్ ఘోష్ దర్శకుడు అవటంతో టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే డిజైన్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు తగ్గ స్దాయిలో లేదు. సీన్స్ బోర్ కొట్టకపోతే టెక్నికల్ గా చేసిన కృషి ఫలించేది.ఎడిటింగ్ జస్ట్ ఓకే. కెమెరా వర్క్ బాగుంది.ఉ. 26/11 ముంబయి దాడుల సమయంలో ఎన్‌ఎస్‌జీకికి సెకండ్‌ ఇన్‌ కమాండ్‌ గా ఉన్న కల్నల్‌ (రిటైర్డ్‌) సందీప్‌ సేన్‌ ఈ స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తూండటం వల్ల కొన్ని యాజటీజ్ తియ్యగలగినట్లున్నారు.
 
నటినటుల్లో …అక్షయ్‌ ఖన్నా చాలా సంవత్సరాల తర్వాత ఆర్మీ యూనిఫామ్‌లో కనిపిస్తూ…ఎన్‌ఎస్‌జి కమాండోగా చాలా బాగా చేశాడు. యాక్షన్‌ సీన్స్ లో అదరకొట్టాడు. టెర్రరిస్ట్ లను డీల్ చేసే సీన్స్ రియల్ గా జరిగినవి షూట్ చేసారా అన్నట్లున్నాయి. ఇక టెర్రిరిస్ట్ లు పాత్ర పోషించిన నటులందరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. అనేక తెలుగు చిత్రాల్లో నటించిన మంజరి ఫడ్నవీస్‌, గౌతమ్‌ రోడె, సమీర్‌ సోని, పర్వీన్‌ దబాస్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషించటం కొద్దిలో కొద్ది మన తెలుగు వ్యూయర్స్ కు ప్లస్.

చూడచ్చా

ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలు వంటివి ఎక్సపెక్ట్ చేయకుండా చూస్తే బాగానే ఉంటుంది.

తెర వెనక..ముందు

నటీనటులు : అక్షయ్ ఖన్నా, వివేక్ దాహియా, మంజరి ఫడ్నవీస్‌, గౌతమ్‌ రోడె, సమీర్‌ సోని, పర్వీన్‌ దబాస్‌ తదితరులు.
దర్శకుడు : కెన్ ఘోష్
నిర్మాతలు : అభిమన్యు సింగ్
రన్ టైమ్:110 నిముషాలు
విడుదల తేదీ : జూలై 09,2021
ఓటీటీ  : ‘జీ 5’