స్వేచ్ఛ చిత్రం ట్రైలర్ మీడియాకు ప్రదర్శన
స్వేచ్ఛ’ ఉంటేనే ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారు- కథానాయిక మంగ్లీ
స్వేచ్ఛ ఉంటేనే ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణిస్తారని కథానాయిక, గాయని మంగ్లీ అన్నారు. రామానాయుడు ప్రివ్యూ ధియేటర్ లో ‘స్వేచ్ఛ’ చిత్రం ట్రైలర్ ను మీడియాకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్రనిర్మాత రాజునాయక్, సంగీత దర్శకుడు భోలే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంగ్లీ మాటాడుతూ ‘ఈ పోస్టర్ లో నేను కనిపించడంలేదు సీతాకోక చిలుకే కనిపిస్తోంది. అంతబాగా దీన్ని డిజైన్ చేశారు. స్వేచ్ఛ అని పేరెందుకు పెట్టారంటే దేవుడు పక్షులకు రెక్కలిచ్చింది ఎందుకు? అవి ఎగారాలి వాటిని పంజరంలో పెట్టకూడదు. అలాగే ఆడపిల్లలకు కూడా అలాంటి స్వేచ్ఛనివ్వాలి. మగాళ్లకు సమానంగానే ఆడపిల్లలను కూడా చదివించాలి. అలా చేస్తేనే వారు రాణిస్తారు. నిజంగా దర్శకుడు స్ఫూర్తినిచ్చే సినిమా తీశారు. మా కమ్యూనిటీలలో జరిగే కథాంశంతో ఈ సినిమా తీశారు. సొసైటీకి ఉపయోగపడే సినిమా. ఈ సినిమాకి అందరూ బాగా కష్టపడ్డారు. ఒక అమ్మాయిని వాళ్ల నాన్న అమ్మేస్తే ఆమె బాగా చదువుని వచ్చి ఆ ఊరిని బాగు చేస్తుంది. మన ఇంటి ముందు చెట్టు లేకపోతే ఆ ఇల్లే వేస్ట్.. అలాంటిది మన ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆఇల్లే వేస్త్ … అలాంటి కథాంశమే ఇది. ఇందులో పాటలు కూడా బాగా వచ్చాయి. ఇంతకుముందు బోలేతో జీహెచ్ఎంసీ పాట ఒకటి చేశారు. ఆ తర్వాత ఇందులో పాట పాడాను. బంజారే బంజారే పాటకు మంచి స్పందన వస్తోంది. మా బంజారా కమ్యూనిటీలో ఈ సినిమా ముందే విడుదలై మంచి విజయం సాధించింది. ఇతర రాష్ర్టాలలో కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. ఈ నెల 28న విడుదలయ్యే ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత రాజు నాయక్ మాట్లాడుతూ గోర్ జీవన్ పేరుతో బంజారా భాషలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. సంగీత దర్శకుడు బోలే మాట్లాడుతూ.. ‘గోర్ జీవన్ అనే సినిమా బంజారా బాషలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలుసు. ఇది బంజారా బాహుబలి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బంజారా బాషలో ఇంత పెద్ద సినిమా లేదు. అంతేగాకుండా బంజారా నుండి మంగ్లీ ఇంత స్థాయికి ఎదిగి ఇలాంటి గొప్పచిత్రం చేయడం మరింత ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్న రాజు నాయక్ గారికి నా వందనాలు. ఈరోజుల్లో అమ్మాయిలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. వారి మీద జరుగుతున్న అఘాయిత్యాలను మనందరం చూస్తున్నాం. అప్పట్లో అనేవారు అర్థరాత్రి ఆడది రోడ్డు మీద ధైర్యంగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని. కానీ అసలు అమ్మాయిలకి ఇప్పటికీ స్వాతంత్య్రం రాలేదని నాకనిపిస్తోంది. అలాంటి ఆడవాళ్ళ గురించి వారి స్వేచ్ఛ గురించి చిత్రించిన ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడాలి’ అన్నారు.
ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘రెగ్యులర్ గా నేను సినిమా కలెక్షన్స్ ఫాలో అవుతూ ఉంటాను. బంజారా బాషలో గోర్ జీవన్ గా రిలీజైన ఈ చిత్రం సాధించిన కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయాను.మూడు నెలల క్రితం గోర్ జీవన్ హౌస్ ఫుల్ హౌస్ ఫుల్ అని విని అసలు ఈ గోర్ జీవన్ ఏంటి.. అసలు మంగ్లీ నాకు చెప్పకుండా ఎప్పుడు సినిమా చేసింది అని ఆలోచించాను. మొదట ఈ చిత్రం దాదాపు 35 థియేటర్లలో విడుల చేశారు. రిలీజైన మూడో రోజుకే 75 థియేటర్లు, వారాంతంలో 100 థియేటర్లకు పెరిగింది. నేను గోర్ జీవన్ టీమ్ ని పిలిపించి ఆఫీసులో మాట్లాడాను. అంతేకాకుండా ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నాను. కానీ రాజు నాయక్ గారు ఈ సినిమాని తెలుగులో అందిస్తున్నారు. మంగ్లీ గొప్ప గాయనే కాకుండా మంచి యాక్టర్ అని కూడా ఈ స్వేచ్ఛ సినిమా ద్వారా నిరూపించుకున్నారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అన్నారు.